కుడిచేతితో ఇచ్చి ఎడం చేతితో లాక్కున్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. గోదావరి పుష్కరాలకు కేంద్రమైన రాజమండ్రి
రాజమండ్రికి రూ.240 కోట్ల ఆర్థిక సంఘం నిధులు
ఇప్పటి వరకూ చేపట్టిన పనులు 50 శాతమే
ఇంతలోనే రూ.40 కోట్లు ఇరిగేషన్, ఇతర శాఖలకు మళ్లింపు
అయినా కిమ్మనని టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధులు
కుడిచేతితో ఇచ్చి ఎడం చేతితో లాక్కున్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. గోదావరి పుష్కరాలకు కేంద్రమైన రాజమండ్రి నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ఊరించిన సర్కారు.. చివరికి ఈ నగరంలో భక్తులకు మౌలిక సదుపాయూల కల్పనకు కేటాయించిన నిధులను దొడ్డిదారిన నీటి పారుదల శాఖ, ఇతర శాఖలు చేపట్టే పనులకు మళ్లించింది.అయినా ప్రభుత్వం తమ పార్టీదే కావడంతో నగరపాలకులు నోరు మెదపడం లేదు.
రాజమండ్రి :రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రి కార్పొరేషన్‌ను వెక్కిరిస్తూ.. పుష్కర నిధులను ఇరిగేషన్ (నీటిపారుదల) శాఖకు తరలించింది. పుష్కర పనుల నిమిత్తం ప్రభుత్వం కార్పొరేషన్‌కు రూ.240 కోట్ల 13వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది. అయితే ఇప్పటి వరకు కేవలం రూ.73.22 కోట్లకు సంబంధించిన పనులు మాత్రమే కార్పోరేషన్ చేపట్టింది. దీనిలో కూడా తొలివిడతలో రూ.74.25 కోట్ల విలువ చేసే 306 పనులు చేయాల్సి ఉండగా రూ.45.61 కోట్ల విలువ చేసే 289 పనులు చేపట్టింది. రెండో విడతలో రూ.70.25 కోట్లతో 191 పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.17.61 కోట్ల విలువ చేసే 118 పనులు మాత్రమే చేపట్టింది. మొత్తం మీద రూ.144.50 కోట్లకుగాను, రూ.73.22 కోట్ల విలువ చేసే పనులు మాత్రమే జరుగుతున్నారుు.
అంటే కేవలం 50 శాతం పనులు మాత్రమే జరుగుతున్నాయన్న మాట. మిగిలినవాటిలో కొన్నింటిని ద్వితీయ ప్రాధాన్యతా పనులుగా గుర్తించి వాటిని పుష్కరాల తరువాత నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ పనులు చేస్తారనే నమ్మకం నగరవాసులకు కలగడం లేదు. ఇదే సమయంలో కార్పొరేషన్‌కు కేటాయించిన పుష్కర నిధుల్లో సుమారు రూ.40 కోట్లకు పైగా నిధులను నీటిపారుదల శాఖ చేపట్టిన ఘాట్‌లకు, వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులకు మళ్లించింది. రాష్ట్రంలో పుష్కరాల నిర్వహణకు రూ.1,200 కోట్లు అని ఒకసారి, కాదు రూ.1,500 కోట్లని మరోసారి చెప్పిన ప్రభుత్వం, అవసరమైన మరిన్ని నిధులు ఖర్చుపెట్టేందుకు సైతం వెనుకాడేది లేదని గొప్పలకు పోరుుంది. అన్ని కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నగరపాలక సంస్థకు కేటాయించిన 13వ ఆర్థిక సంఘం నిధులు మళ్లించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
టీడీపీ ఎమ్మెల్యే హస్తం..
కాగా నిధులు తరలిపోవడం వెనుక అధికారపార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే హస్తముందనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన సూచన మేరకే నిధులు మళ్లించినట్టు కొందరు అంటున్నారు. అయితే ఈ విషయంలో నగరపాలక మండలిలో అధికార పక్షమైన తెలుగుదేశానికి చెందిన ప్రజాప్రతినిధులు ఎవరూ నోరుమెదపడం లేదు. నగర చరిత్రలోనే అత్యంత జనసమ్మర్దం తటస్థించే సందర్భం గోదావరి పుష్కరాలు. నిత్యం నగర జనాభాను మించి భక్తులు వెల్లువెత్తే ఈ సందర్భంలో నగరంలో ఎన్నో నిర్మాణాలు, సదుపాయూలు కల్పించాల్సిన బాధ్యత నగర పాలక సంస్థపై ఉంది. అలాంటి కేటారుుంచిన నిధులనే మళ్లించడం వల్ల నగరంలో పుష్కరాల 12 రోజులూ అవస్థలు తప్పవని, ఎలాంటి అసౌకర్యం కలిగినా నగర పాలక సంస్థకు ఆపాదించే ఆ అపఖ్యాతి దేశం నలుమూలలా వ్యాపిస్తుందని తెలిసినా టీడీపీ ప్రజాప్రతినిధులు పైకి అనే సాహసం లేక మౌనముద్ర వహిస్తున్నారు. అయితే తమ పార్టీకి చెందిన సదరు ఎమ్మెల్యేపై లోలోపలే కారాలుమిరియూలు నూరుతున్నారు.