'బకరా'లను చేస్తున్నారు

Goats Recycling In Telangana Scheme - Sakshi

పక్కదారి పడుతున్న తెలంగాణ రాష్ట్ర గొర్రెల యూనిట్ల పథకం

దళారులు, పశు వైద్యుల మాయాజాలం

గొర్రెల రీ సైక్లింగ్‌తో దందా

చెవులకు ట్యాగ్‌లు మార్చి పదే పదే విక్రయాలు

గొర్రెల కాపరులను మోసం చేస్తున్న అధికారులు

పట్టించుకోని పాలకులు

యాదవుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గొర్రెల యూనిట్ల మంజూరు’ పథకం పక్కదారి పట్టిస్తున్నారు. దళారులు, పశు వైద్యులు కలిసి కాసులు దండుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొన్న గొర్రెలనే పంపిణీ చేయాలనే నిబంధన అవకాశంగా మలుచుకొని రీసైక్లింగ్‌ దందాకు తెరతీశారు. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ రాష్ట్రాల్లోని గొర్రెల పెంపకందారులను బకరాలను చేస్తున్నారు.

ప్రకాశం, గిద్దలూరు: తెలంగాణ రాష్ట్రంలో యాదవులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అక్కడి కేసీఆర్‌ ప్రభుత్వం గొర్రెల యూనిట్లు మంజూరు చేసింది. ఇందుకు ఒక్కో యూనిట్‌కు రూ.1.11 లక్షలు కేటాయించింది. ఇందులో లబ్ధిదారుని వాటాగా రూ.31,250 చెల్లించాలి. యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలును కొనుగోలుచేయాల్సి ఉంది. గొర్రెలను సొంత రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో కొనుగోలు చేసేలా నిబంధనలు విధించారు. దీని వల్ల కొత్త ప్రదేశంలోని గొర్రెలు బాగా అభివృద్ధి చెందుతాయని, అక్రమాలు జరక్కుండా ఉంటాయని ప్రభుత్వ ఉద్దేశం. కొనుగోలు చేసే ప్రాంతంలో గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయా, ఉత్పత్తి పెరుగుదల ఉంటుందా అనే విషయాలను పశువైద్యాధికారి పరిశీలించి ధ్రువీకరించిన తర్వాతనే గొర్రెలను గొనుగోలు చేయాల్సి ఉంది. కానీ పశువైద్యాధికారులు కొనుగోలు ప్రదేశంలో ఎలాంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించకుండానే లబ్ధిదారులకు గొర్రెలను కట్టబెడుతున్నారు. 10రోజుల క్రితం వరకు వైద్యులు ఈప్రాంతంలోని కొందరిని మధ్యవర్తులుగా చేసుకుని గొర్రెలను కొనుగోలు చేసేవారు. వారి వద్ద పర్సంటేజీలు తీసుకుంటూ రూ.లక్షలు వసూలు చేస్తున్నారు.

రీ సైక్లింగ్‌ జరుగుతోందిలా..
తెలంగాణలో మంజూరైన సబ్సిడీ యూనిట్లకు గొర్రెలను కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలకు ఎక్కువ యూనిట్లను కేటాయించారు. తెలంగాణకు చెందిన లబ్ధిదారులకు గొర్రెలను కొనుగోలు చేసేందుకు జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గిద్దలూరుకు ప్రకాశం జిల్లాతో పాటు, కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల సరిహద్దులు ఉండటం వలన ఇక్కడి వ్యాపారులను మధ్యవర్తులుగా చేసుకుని గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు.

ఇక్కడ కొనుగోలు చేసిన గొర్రెలను తెలంగాణలోని లబ్ధిదారులకు అందించినట్లు ఫొటోలు చూపి మరుసటి రోజే తిరిగి గిద్దలూరు పంపిస్తున్నారు. ఇలా ఒక్కో గొర్రెను 25 సార్లు రెండు రాష్ట్రాల మధ్య తిప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణాకు చెందిన లబ్ధిదారులను లారీల్లో తీసుకొస్తున్న డాక్టర్లు ఒక్కడ ఒక రోజు అటూ ఇటూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తారు. మరుసటి రోజు డాక్టర్ల ఆధీనంలో ఉన్న మధ్యవర్తుల వద్దకు తీసుకెళ్లి వారి గొర్రెలను కొనుగోలు చేసేలా చేస్తారు. ఇలా చేయడం వలన వ్యాపారులు మొద ట (రెండు నెలల క్రితం) యూనిట్‌కు రూ.5వేలు తీసుకునేవారు. ఇలా కొన్న గొర్రెలకు ఇన్సూరెన్స్‌ ట్యాగ్‌ వేయడం, తిరిగి తొలగిస్తూ రీ సైక్లింగ్‌ చేస్తున్నారు. గతంలో ఇనుప ట్యాగ్‌లను వేసేవారు. దీనివల్ల రీసైక్లింగ్‌ సమయంలో ట్యాగ్‌ తొలగించేందుకు చెవి కోయాల్సి వచ్చేది. గొర్రెకు చెవులు చిన్నవవుతున్నాయని పట్టుబడే ప్రమాదం ఉందంటూ ఇనుప ట్యాగ్‌ల స్థానంలో ప్లాస్లిక్‌ ట్యాగ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ప్లాస్టిక్‌ ట్యాగ్‌ను సులభంగా పగులకొట్టి, కొత్త ట్యాగ్‌లు వేస్తున్నారు.

వైద్యులకు యూనిట్‌కు రూ.18వేలు...
గొర్రెల యూనిట్లు ఎక్కువగా రావడంతో పశువైద్యులకు డిమాండ్‌ పెరిగింది. ప్రారంభంలో యూనిట్‌కు రూ.5వేలు తీసుకునే డాక్టర్లు ఇప్పుడు రూ.18వేలు తీసుకుంటున్నారు. అంతా మీరే తీసుకుంటే తమకేంటి లాభం అని మధ్యవర్తులు ప్రశ్నించడంతో అసలు గొర్రెలను మీదగ్గర ఎందుకు కొనుగోలు చేయాలంటూ సొంత వ్యాపారం ప్రారంభించారు. తెలంగాణలోని గొర్రెలను తామే కొనుగోలు చేసుకుని, ఆంధ్రాకు తెచ్చుకుని, ఇక్కడా తమ లబ్ధిదారుల ద్వారా తిరిగి కొనుగోలు చేస్తామంటున్నారు. గొర్రెల యూనిట్‌కు వచ్చే నగదును తమకు అనుకూలంగా ఉండే ఒక వ్యక్తి ఖాతాలో వేస్తూ అతనికి యూనిట్‌కు రూ.500 చొప్పున ఇచ్చి మిగతా లాభాలు డాక్టర్లే తీసుకుంటున్నారని గొర్రెల కాపరులు ఆరోపిస్తున్నారు.

యూనిట్‌ గొర్రెలు రూ.64వేలు...
రీ సైక్లింగ్‌ ద్వారా ఏపీ నుంచి తెలంగాణ, తెలం గాణ నుంచి ఏపీకి తిరుగుతున్న గొర్రెలు నీరసించి పోయాయి. గొర్రెలను కొనుగోలు చేసిన లబ్ధిదా రులు వాటిని పెంచుకునేందుకు అవకాశం లేనంతగా నడవలేకపోతున్నాయని గమనించి తిరిగి వైద్యుల ద్వారానే గొర్రెలను విక్రయించేస్తున్నారు.

యూనిట్‌కు రూ.40 వేల ఆదాయం..
తెలంగాణలో 21గొర్రెల యూనిట్‌ ఖరీదు కేవలం రూ.64వేలకే విక్రయిస్తున్నారు. వాటిని తిరిగి ఏపీకి తీసుకొస్తున్న వైద్యులు తిరిగి రూ.1.11 లక్షలకు లబ్ధిదారులకు కట్టబెడుతున్నారు. ఇలా ఒక్కో యూనిట్‌ గొర్రెలకు పశువైద్యులు రూ.40వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ఏపీలోని గొర్రెల కాపరుల వద్ద గొర్రెలను కొనుగోలు చేస్తే కొంతమేర గొర్రెల కాపరులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండేది. తెలంగాణాలో గొర్రెలను తీసుకున్న లబ్ధిదారుడు గొర్రెలను పెంచుకుంటే వారు బాగుపడే వారు. అలా కాకుండా సబ్సిడీపై ఇచ్చిన గొర్రెల యూనిట్లు పశువైద్యులకు, మధ్యవర్తులకు వరంగా మారాయే తప్ప రెండు రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని గొ ర్రెల కాపరులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

గొర్రెల రీ సైక్లింగ్‌ను అడ్డుకోవాలి..
తెలంగాణ ప్రభుత్వం యాదవుల అభివృద్ధి కోసం ఇచ్చిన గొర్రెల యూనిట్లను గొర్రెల కాపరుల వద్దనే కొనుగోలు చేయాలి. అలా కాకుండా కొన్న గొర్రెలనే తిరిగి విక్రయించడం, వాటినే తిరిగి తెలంగాణ యాదవ లబ్ధిదారులకు ఇవ్వడం చేస్తున్నారు. దీనివలన రెండు రాష్ట్రాల్లోని యాదవులు నష్టపోతున్నారు. వైద్యులు, మధ్యవర్తులే లబ్ధి పొందుతున్నారు. అసలైన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని అధికారులు అడ్డుకోవాలి.– కుక్కా సాంబశివయాదవ్, యాదవ జేఏసీ జిల్లా ప్రధానకార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top