ఆరిన విద్యా దీపం

Girl Committed Suicide For Education - Sakshi

పూట గడవని బతుకుల్లో చదువులెందుకని భ్రమపడ్డారుగానీ.. రేపటి రోజున తమ బిడ్డే పది మందికి అన్నం పెడుతుందని ఊహించలేకపోయారు. ఆడ పిల్లకు పది చదువుచాలని అపోహపడ్దారుగానీ.. తమ ఇంటే సరస్వతీ పుత్రిక పుట్టిందని గుర్తించలేకపోయారు. చదువులు వద్దంటే నాలుగు రోజులు మౌనంగా రోదిస్తుందనుకున్నారుగానీ.. ఆ చదువే తన ప్రాణమని తెలుసుకోలేకపోయారు. అమ్మాయి కాలేజీకెళితే అప్పులు పాలవుతామని ఆందోళనపడ్డారుగానీ.. ఆ ఆడ బిడ్డే ఆర్థిక అండవుతుందని అర్థం చేసుకోలేకపోయారు. పది మెట్టు దాటిన బిడ్డ.. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని ఆలోచించలేకపోయారు ఆ తల్లిదండ్రులు..అక్షరమే తన ఆయువని అమ్మానాన్నకు అర్థమయ్యేలా చెప్పలేక, చదువుపై మమకారం చంపుకోలేక దుగ్గిరాల మండలం చిలువూరులో ఎలుకల మందు తిని బాలిక తనువు చాలించింది. దేదీప్యమానంగా వెలగాల్సిన విద్యాదీపం ఆరిపోయింది. 

సాక్షి, దుగ్గిరాల: ఎలుకల మందు తిని పదో తరగతి బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిలువూరు గ్రామానికి చెందిన ఓ బాలిక పదో తరగతి పూర్తి చేసి వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటుంది. మే 14వ తేదీ వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 9.5 గ్రేడ్‌ పాయింట్లు సాధించి ప్రతిభ కనబరిచింది. ఈ నెల 9వ తేదీ ఇంటర్మీడియట్‌ చేరాలని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇక చదివించలేమని తేల్చిచెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.

తల్లి కూలీ పని కోసం బయటకు వెళ్లిన సమయంలో ఇంటిలో ఉన్న ఎలుకల మందు తాగింది. తిరిగి తల్లి ఇంటికి వచ్చే సమయానికి నోటి వెంట నురగరావడంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఈ నెల 12వ తేదీ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 15వ తేదీ శనివారం రాత్రి 7.30 గంటలకు మృతి చెందింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ వై. అర్జున్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top