ఐదేళ్లలో రక్షణ రంగంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానం 

Full Indigenous Knowledge in the Defense of Five Years - Sakshi

ఐదేళ్లలో రక్షణ రంగంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానం  

డీఆర్‌డీవో చైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి 

విశాఖ సిటీ: దేశ రక్షణ రంగంలో ఇప్పటి వరకు 60 శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, రానున్న ఐదేళ్లలో 100 శాతం వినియోగించే దిశగా అడుగులేస్తున్నట్లు డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) చైర్మన్‌ సతీష్‌రెడ్డి చెప్పారు. విశాఖలోని నేవల్‌ సైన్స్‌ టెక్నాలజీ లేబొరేటరీ(ఎన్‌ఎస్‌టీఎల్‌) 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మహాపాత్ర ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన రైజింగ్‌ డే ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భవిష్యత్తులో దేశంలో వినియోగించే ప్రతి ఆయుధం, సామగ్రిని ఇండియన్‌ టెక్నాలజీతో రూపొందిస్తామని చెప్పారు.

లాంతర్గామి విధ్వంసక టార్పెడో ప్రాజెక్టు వరుణాస్త్రకు డిమాండ్‌ ఉండటం వల్ల.. దాన్ని ఎగుమతి చేసే సత్తా దేశానికి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. వరుణాస్త్రలో భాగంగా తేలికపాటి టార్పెడోల తయారీకి పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. వరుణాస్త్ర సహా మారీచ్, థాల్‌ టెక్నాలజీలను డిజైన్‌తో పాటు అభివృద్ధిచేసి దేశంలోని పలు సంస్థలకు బదిలీచేసే దిశగా కృషి చేయాలని సూచించారు. భారత రక్షణ పరిశోధన రంగంలోనూ స్టార్టప్‌లను ప్రోత్సహించేలా అడుగులేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌టీఎల్‌ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్‌వీఎస్‌ఎస్‌ మూర్తితోపాటు సివిల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు అప్పలరాజు, సైంటిస్ట్‌ వర్కర్స్‌ కమిటీ దూబే, పీవీఎస్‌ గణేష్‌కుమార్‌  పాల్గొన్నారు.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top