ఏఎన్‌యూలో ఫ్రీడమ్ ఫెస్ట్ ప్రారంభం | freedom fest started in nsu | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూలో ఫ్రీడమ్ ఫెస్ట్ ప్రారంభం

Mar 8 2014 2:14 AM | Updated on Sep 2 2017 4:27 AM

అవకాశాలు లేని సమాజంలో యువతకు మరిన్ని అవకాశాలు కల్పనకు స్వేచ్ఛ ఫౌండేషన్ దోహదం చేస్తుందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు.

 ఏఎన్‌యూ, న్యూస్‌లైన్
 అవకాశాలు లేని సమాజంలో యువతకు మరిన్ని అవకాశాలు కల్పనకు స్వేచ్ఛ ఫౌండేషన్ దోహదం చేస్తుందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. యూనివర్సిటీ స్వేచ్ఛ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరుగనున్న ‘ఫ్రీడం ఫెస్ట్’ శుక్రవారం వర్సిటీలో ప్రారంభమయింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి ఫెస్ట్‌లు దోహదం చేస్తాయన్నారు. ఫ్రీడం ఫెస్ట్‌ను ప్రారంభించిన స్వేచ్ఛ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డి.భువన్‌కృష్ణ మాట్లాడుతూ ప్రముఖ సాప్ట్‌వేర్ నిపుణుడు ఆరోన్ స్వార్ట్జ్ జ్ఞాపకార్ధం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
 
 ఢిల్లీ సైన్స్ ఫోరమ్ ముఖ్య కార్యదర్శి, ఫ్రీ సాఫ్ట్‌వేర్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు ప్రబీర్ పుర్కాయస్థ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముందు తరాలు సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమాజ అవసరాలను గుర్తించి వాటిని తీర్చేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు అందించేందుకు యువకులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్రీడం ఫెస్ట్ లాంటి కార్యక్రమాల ద్వారా ఆధునిక పరిజ్ఞానంపై మరింత చర్చ జరగాలన్నారు. కార్యక్రమంలో స్వేచ్ఛ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రమేష్, దక్షిణ, ఉత్తర కోస్తాల ప్రతినిధులు ప్రమోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు
 ఏఎన్‌యూలో ఫ్రీడం ఫెస్ట్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఇంజినీరింగ్ విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి 70 ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో ప్రదర్శనలిచ్చారు. ఈ ఫెస్ట్‌లో ప్రాజెక్ట్ ఎక్స్‌పో, పేపర్ ప్రెజెంటేషన్, క్రియేటివ్ ఆర్ట్స్, పోస్టర్ ప్రజంటేషన్, కోడ్ డబ్బింగ్, ప్రోగ్రామింగ్, బిగ్‌డేటా, బ్లెండర్ త్రీడీ యానిమేషన్ తదితర అంశాల్లో ప్రదర్శనలు నిర్వహించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement