జిల్లాలో ప్రధానంగా చిత్తూరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్ల పరిధిలో నీటి సమస్య అధికంగా ఉండగా, ఈ ఏడాది తిరుపతి డివిజన్ పరిధిలో సైతం తాగునీటి ఎద్దడి తలెత్తింది...
చిత్తూరులోని కట్టమంచి ప్రాంతంలో తాగునీటి కోసం క్యూలో వేచి ఉన్న జనం జిల్లాలో తాగునీటి ఇక్కట్లు రోజురోజుకూ ఎక్కువవుతు న్నాయి. 2012 నాటికి కేవలం 406 గ్రామాలలో నీటిసమస్య ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ చివరినాటికి ఆరింతలు పెరిగింది. పడమటి మండలాల్లో భూగర్భ జలాలు 1500 అడుగుల లోతుకు చేరాయి. ప్రస్తుతం 2724 గ్రామాలకు ప్రభుత్వమే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇందుకోసం నెలకు ’ 7.3 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తోంది. ప్రయివేటు నీటి వ్యాపారం ’ కోట్లలో సాగుతోంది. సమస్య శాశ్వత పరిష్కారానికి మాత్రం ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదు.
- ఏటా తీవ్రమవుతున్న సమస్య
- ఏప్రిల్ నాటికి 2724 గ్రామాలకు నీటి సరఫరా
- నెలకు * 7.3 కోట్లు ప్రభుత్వ ఖర్చు
- ప్రయివేటు నీటి కొనుగోలు *కోట్లలో...
సాక్షి,చిత్తూరు: జిల్లాలో ప్రధానంగా చిత్తూరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్ల పరిధిలో నీటి సమస్య అధికంగా ఉండగా, ఈ ఏడాది తిరుపతి డివిజన్ పరిధిలో సైతం తాగునీటి ఎద్దడి తలెత్తింది. మూడేళ్ల గణాంకాలను చూస్తే ఏడాదికేడాది నీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాక పడమటి మండలాల్లో భూగర్భ జలాలు 1500 అడుగుల లోతుకు చేరాయి. ఈ ఏడాది వేలాది గ్రామాల్లో తాగునీరు దొరకని పరిస్థితి. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. 2012 ఏప్రిల్ నెలలో చిత్తూరు డివిజన్‌లో 177 గ్రామాలకు మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయగా, 2013 ఏప్రిల్‌లో 255 గ్రామాలకు, 2014లో 261 గ్రామాలకు, 2015లో ఏకంగా 1,081 గ్రామాలకు నీటి సరఫరా చేయాల్సి వచ్చింది. మదనపల్లె డివిజన్‌లో 2012 ఏప్రిల్‌లో వంద గ్రామాలకు, 2013 ఏప్రిల్‌లో 255 గ్రామాలకు, 2014 ఏప్రిల్‌లో 261 గ్రామాలకు,2015 లో 922 గ్రామాలకు సరఫరా చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. తిరుపతి డివిజన్‌లో 2012 ఏప్రిల్‌లో కేవలం ఐదు గ్రామాలకు మాత్రమే నీటిని సరఫరా చేయగా, 2013 ఏప్రిల్‌లో మూడు గ్రామాలకు, 2014లో ఒక్కగ్రామానికి కూడా నీటిసరఫరా చేయలేదు. 2015లో మాత్రం ఏకంగా వంద గ్రామాలకు ట్యాం కర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది.
ప్రాజెక్టులు పూర్తయితేనే...
జిల్లా నీటి సమస్య తీరాలంటే హంద్రీ-నీవా, కండలేరు నీటి పథకాన్ని పూర్తిచేయడం మినహా మరో మార్గం లేదు. హంద్రీనీవా పూర్తి కావాలంటే రూ.1100 కోట్లు అవసరం. బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.200 కోట్లు. చిత్తూరు జిల్లాకు రూ.50 కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. జిల్లాలో వేలాది గ్రామాలకు తాగునీటిని అందించే కండలేరు తాగునీటి పథకాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాం లో ఆ పథకం రూపుదిద్దుకుందన్న అక్కసుతోనే బాబు ప్రభుత్వం దానిని పక్కన పెట్టింది. చిత్తశుద్ధితో ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేసి తాగునీటి సమస్యను శాశ్వ తంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది.