అన్నదాతల్లో ఆనందం

Farmers were happy with YS Jagan One year rule - Sakshi

ఏడాది పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారు

పంటలకు గిట్టుబాటు ధర కల్పించారు

విత్తనాలిచ్చి పడిగాపులు తప్పించారు

కౌలు రైతులు సహా అందరికీ రైతు భరోసాతో పెట్టుబడి సాయమందించారు

సాక్షి, అమరావతి: మీరు ఉండగా రైతులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.. గతంలో మాదిరిగా విత్తనాల కోసం రాత్రింబగళ్లు పడిగాపులు లేవు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వెంటనే మా ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. గతంలో దళారులకిస్తే రెండు నెలల వరకూ డబ్బులిచ్చేవారు కాదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు ఊర్లోనే సర్టిఫైడ్‌ విత్తనాలు, ఎరువులు ఇస్తుండటం చాలా ఆనందంగా ఉంది. కౌలు రైతులకూ రైతు భరోసాను అందించారు. మీరు 90 శాతం హామీలను నెరవేర్చామని అంటున్నా ప్రజలు మాత్రం వంద శాతం చేసేశారని సంతృప్తిగా ఉన్నారు.. ఇవీ వివిధ జిల్లాల రైతుల అభిప్రాయాలు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల రైతులతో ముఖాముఖి నిర్వహించారు. 

నవరత్నాలంటే ఓట్లకోసమనుకున్నాం..!
రెండెకరాల సొంత పొలంతో కలిపి పదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నా. గతంలో నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మేలు జరగలేదు. పాదయాత్రలో మీరు మాఊరు వచ్చినప్పుడు నవరత్నాల గురించి చెబితే ఓట్ల కోసం అందరూ అలాగే చెబుతారనుకున్నాం. రైతులకు ఎవరూ ఏమీ చేయరు, మన బతుకులు ఇలాగే ఉంటాయనుకున్నాం. మీరు సీఎం కాగానే రైతుభరోసా ద్వారా రూ.13,500 మా ఖాతాల్లో వేశారు. మీరిచ్చిన డబ్బులతో వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాం. కరోనా వల్ల వరి కోతకు కూలీలు దొరక్కపోతే మీ ఆదేశాలతో వ్యవసాయశాఖ కోతమిషన్లు ఏర్పాటు చేసింది. దీని వల్ల కూలీ ఖర్చులు తగ్గాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారంలోనే మా ఖాతాలో డబ్బులు జమ చేశారు. గతంలో దళారులకిస్తే రెండు నెలల వరకూ డబ్బులిచ్చేవారు కాదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు ఊర్లోనే సర్టిఫైడ్‌ విత్తనాలు, ఎరువులు ఇవ్వనుండటం బాగుంది. మాది శివారు గ్రామం. వైఎస్సార్‌ హయాంలో కాలువల్లో పూడిక తీశారు. మీరు మరోసారి ఆ సాయం చేస్తే వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.    
– కొమ్మన వెంకటరమణ, కాకినాడ రూరల్, గంగనాపల్లి గ్రామం, తూర్పు గోదావరి
సీఎం వైఎస్‌ జగన్‌ దీనిపై స్పందిస్తూ వెంటనే రైతు కోరిన మేరకు ఆ ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 

90 కాదు.. 100 శాతం!
90 శాతం హామీలు నెరవేర్చామని మీరంటున్నారు. కానీ జనమంతా వంద శాతం చేసేశారని అంటున్నారు. మహిళా సంఘాలకు జీరో వడ్డీ డబ్బులు జమ చేశారు. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాతో పడిగాపులు కాసే బాధ తప్పింది. కరోనా సమయంలో మీరిచ్చిన బియ్యం, డబ్బులతో ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇబ్బంది లేకుండా గడిపాం. స్కూళ్లు మూసేసిన తర్వాత కూడా అంగన్‌వాడీ టీచర్లు పిల్లలకు ఆహారాన్ని అందిస్తున్నారు. మీరు తెచ్చిన అమ్మఒడి వల్ల ఎంతోమంది పేద తల్లులు పిల్లలను చదివించుకుంటూ మిమ్మల్ని దీవిస్తున్నారు. మ దగ్గర గుర్లలో 4 వేల ఎకరాలకు నీరందించే మినీ రిజర్వాయర్‌ను నిర్మించాలని కోరుతున్నా.    
    – చింతాడ అప్పలనర్సమ్మ, గుర్ల తమ్మిరాజుపేట, మెంటాడ, విజయనగరం

రైతులకు మీ సేవ అంతా ఇంతా కాదు
ఇంతకుముందు రాత్రిళ్లు భుజాన రగ్గు లేసుకుని, క్యారియర్‌లో అన్నం కట్టుకుని విత్తనాల కోసం పడిగాపులు కాసేవాళ్లం. విత్తనాలను దళారీలకు ఇచ్చిన తర్వాతే రైతులకిచ్చేవారు. ఇప్పుడు మా ఇంటికే వచ్చినయ్‌ సార్‌ విత్తనాలు. వేలిముద్ర వేసి లైన్లో నిలబడకుండానే వేరు శనక్కాయలు తీసుకున్నాం. ఒక్కసారి రైతులంతా ఎంత ఆనందంగా ఉన్నామో, సంతోషంగా ఉన్నామో చూడండి. మా రైతులకు మీరు చేసిన సేవ అంతా ఇంతా కాదు. రైతులందరి తరపున మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. రైతు భరోసా డబ్బులు కూడా నాకు అందాయి. గతేడాది వర్షాలు కూడా బాగా పడ్డాయి. ఇది మీ సంకల్పం సార్‌.
    – టి.వెంకప్ప, గంతిమర్రి, రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం

కౌలురైతుకూ భరోసా...
నేను కౌలు రైతును. ఐదెకరాలు సాగు చేస్తున్నా. మాకు కూడా రైతుభరోసా డబ్బులిచ్చినందుకు ధన్యవాదాలు. మొక్కజొన్న బస్తా రేటు రూ.1,100 మాత్రమే ఉంటే మార్కెట్‌ యార్డుల్లో రూ.1,750 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది.  గత ప్రభుత్వ హయాంలో ధాన్యం డబ్బుల కోసం మూడు, నాలుగు నెలలు తిప్పించుకునేవారు, మీరు వెంటనే అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారు. నా మేనల్లుడికి అమ్మఒడి ద్వారా డబ్బులిచ్చారు. మా అమ్మకు పింఛన్‌ ఇంటికే తెచ్చిస్తున్నారు. కంకిపాడు మండలంలో కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటు చేయాలి.
    – బి. శివకోటేశ్వరరావు, పెనమలూరు, కృష్ణా జిల్లా
 
ఏడాదిలోనే అన్ని కార్యక్రమాలు

నాకు 8 ఎకరాల భూమి ఉంది. వరి, అపరాలు పండిస్తా. మీరు చెప్పినట్లుగానే ఏడాది కాలంలోనే రైతు భరోసాతో పాటు అన్ని కార్యక్రమాలు చేపట్టారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు గ్రామంలోనే దొరికేలా చర్యలు చేపట్టడం బాగుంది. పంటలకు ఇన్సూరెన్స్‌ కూడా కల్పించడం మాకు చాలా ధైర్యాన్నిచ్చింది. కొబ్బరికి వైట్‌ ప్‌లై సమస్యను పరిష్కరించాలి. ఎస్‌.రాయవరం మండలంలో బ్రిడ్జి నిర్మిస్తే పది గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది.     
    – దంతులూరి అచ్యుతరామరాజు,  గుడివాడ, ఎస్‌.రాయవరం, విశాఖ
రైతు విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి జగన్‌ స్పందిస్తూ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు దీనిపై మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top