రాజాంలో నకిలీనోట్ల కలకలం | Fake currency in srikakulam | Sakshi
Sakshi News home page

రాజాంలో నకిలీనోట్ల కలకలం

May 15 2015 3:15 AM | Updated on Sep 2 2018 4:48 PM

‘రాజాం నగర పంచాయతీ పరిధి పొనుగుటి వలసకు చెందిన టంకాల రాముడమ్మ వృద్ధాప్య పింఛన్ కోసం పోస్టుమెన్

 రాజాం: ‘రాజాం నగర పంచాయతీ పరిధి పొనుగుటి వలసకు చెందిన టంకాల రాముడమ్మ వృద్ధాప్య పింఛన్ కోసం పోస్టుమెన్ దగ్గరకు ఇటీవల వెళ్లింది. రెండు రూ.1000 నోట్లు ఇచ్చాడు. దానిని పట్టుకొని బజార్‌కు వెళ్తే నకిలీనోటు అని చెప్పి సరుకులు ఇవ్వలేదు. ఇప్పుడే పోస్టుమేన్ ఇచ్చాడని చెప్పి గట్టిగా అడిగితే పోలీసులకు చెబుతామని హెచ్చరించారు. ఈ నోటు పట్టుకొని తిరిగి పోస్టుమెన్ వద్దకు వెళ్తే తనకు సంబంధం లేదన్నాడు. గ్రామంలోని ఓ పెద్ద మనిషికి ఇచ్చి అధికారుల వద్దకు వెళ్లి న్యాయం చేయమని వేడుకుంది. ఇంతవరకూ అతీగతీ లేదు’.
 
 ఇది ఒక్క కేసే కాదు.. ప్రతి రోజు రాజాంలో ఏదో ఒక చోట నకిలీనోట్ల మాట వినిపిస్తూనే ఉంది. దీంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు ఏటీఎంల నుంచి సైతం నకిలీనోట్లు వస్తుండడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. రాజాం కేంద్రంలో దొంగనోట్లు చలామణి చేసే ముఠా సంచరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నోటు ఎవరి దగ్గరైనా ఉందని బయటకు తెలిస్తే పరువు పోతుందని, పోలీసుల చేతిలో చిక్కుకొని కొత్త చిక్కులు తెచ్చుకోవాల్సి వస్తుందేమోనని సామాన్యులు మిన్నుకుండిపోతున్నారు.
 
  ఎవరి వద్దనైనా నోటు ఉన్నట్టు గుర్తించినప్పటికీ, అది ఎక్కడ నుంచి వచ్చిందని తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. రియల్‌ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోవడంతో ఇంతవరకూ దర్జాగా తిరిగి జల్సాకు అలవాటుపడ్డ కొంతమంది రియల్ మధ్యవర్తులు ప్రస్తుతం దొంగనోట్లు వ్యాపారానికి దిగినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి దొంగనోట్లు చలామణి రాకెట్ గుట్టు రట్టు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై పోలీసులు వద్ద ప్రస్తావించగా తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. అయినప్పటికీ దర్యాప్తు చేస్తామన్నారు.
 
 ఏటీఎం నుంచి దొంగనోటు వచ్చింది
 ఈ నెల 11, 12 తేదీల్లో వరుసుగా రాజాం శ్రీనివాసాథియేటర్ రోడ్డులో ఉన్న  ఓ ఏటీఎం నుంచి రూ.40 వేలు చొప్పున డ్రా చేశాను. ఆ సొమ్మును పట్టుకొని రాజాంలోని కరూర్ వైశ్యాబ్యాంకు వెళ్లి గోల్డ్‌లోన్‌కు జమచేయాలని చూడగా అందులో ఒక రూ.500 నోటు దొంగదని తెలిపారు. దానిపై ఫేక్‌నోట్ అని రాసి ఇచ్చారు. అది పట్టుకొని సంభందిత బ్యాంకుకు వెళ్తే తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు.
 -వై.భగవతరావు,
 మల్లిఖార్జునకాలనీ, రాజాం
 
 దొంగనోట్లతో బేజారు
 తమ బంధువులకు చెందిన ఒక వృధ్ధురాలు బ్యాంకులో డిపాజిట్ చేయమని రూ.2 వేలు ఇచ్చి వెళ్లిపోయింది. అవి పట్టుకొని డోలపేట స్టేట్‌బ్యాంక్‌కు వెళ్లగా అందులో ఒక రూ. 500 లు నోటు దొంగదని తెలిపారు. బ్యాంకు మేనేజర్ దానిని తిరిగి ఇవ్వకుండా నోట్‌పై ఫేక్ అని  ముద్రించి చించేశారు. ఈ నోటు తమ బంధువుల పెళ్లిలో వచ్చిందని అనుమానంగా ఉంది. ఆమెకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక రూ.500లు జతచేసి అకౌంట్‌కు జమచేశాను. ఇలా అయితే ఎవరికీ సహాయం చేయలేం.
 -ఎస్.రాము, డోలపేట, రాజాం నగరపంచాయతీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement