ఆయన పాలసీ సపరేటు! 

Excise Officers Irregularities In Kadari - Sakshi

కదిరిలో ఎక్సైజ్‌ మత్తు 

ప్రభుత్వ దుకాణాల్లో ఎంఆర్‌పీకి మంగళం 

రాత్రి 8 తర్వాత బార్లలో మస్తుగా విక్రయాలు 

అబ్కారీ అధికారి ఆదేశాలతో సాగుతున్న తంతు 

సారు సంపాదన రోజూ రూ.2 లక్షలు 

మద్య నిషేధానికి అడుగులు వేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీ ఓ ఎక్సైజ్‌ అధికారికి కాసులు కురిపిస్తోంది. మద్యం పాలసీని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఆయన.. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. మద్యానికి ఆయనే ఓ రేటు నిర్ణయించి ఇష్టానుసారం అమ్మిస్తున్నాడు. ఇక బార్ల నిర్వాహకులతో చేతులు కలిపి మందుబాబులను భారీగా దోచేస్తున్నాడు. ఫలితంగా అనతి కాలంలోనే కోటీశ్వరుడయ్యారు. ఆయన పేరు ఏమంటే కదిరిలో ఎవరైనా ‘టఖీ’మని చెప్పేస్తారు. 

సాక్షి, కదిరి: నిరుపేదల రెక్కల కష్టం మద్యం షాపునకు కాకుండా వారి పిల్లల భవిష్యత్‌కు పెట్టుబడి కావాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకే ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే మద్యనిషేధానికి తొలి అడుగులు వేశారు. ఈ క్రమంలోనే నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా 247 మద్యం దుకాణాలు ఉండగా.. 20 శాతం తగ్గిస్తూ 197కు పరిమితం చేశారు. అంతేకాకుండా సమయాన్ని కూడా తగ్గించేశారు. కానీ మద్యం పాలసీని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఓ ఎక్సైజ్‌ అధికారి నిరుపేదల జేబుకు చిల్లు పెడుతూ తన పర్సు నింపుకుంటున్నారు. 

ప్రభుత్వ దుకాణంలోనే అదనం 
కదిరి ఎక్సైజ్‌ శాఖ పరిధిలో ప్రస్తుతం 9 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో పనిచేసే సిబ్బందిని ఇటీవల ప్రభుత్వమే నియమించింది. వీటిపై పెత్తనం ఎక్సైజ్‌ శాఖకు ఉండటంతో ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించాలని దుకాణాల్లోని యువకులకు ఆదేశించారు. టిన్‌ బీర్‌పై ఎంఆర్‌పీ రూ.100 ఉండగా రూ.130లకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి లిక్కర్‌ను అధిక ధరకు విక్రయిస్తుండగా.. మందుబాబులు లబోదిబోమంటున్నారు. 

దోపిడీ ‘బార్లా’ తెరిచారు 
కదిరి పట్టణంలో రెండు బార్లు ఉన్నాయి. ఆర్‌టీసీ బస్టాండ్‌కు సమీపంలో పీవీఆర్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో రోజుకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ఆర్‌ఎస్‌ రోడ్‌లో ఉన్న చందు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో రోజుకు రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా వ్యాపారం జరుగుతున్నట్లు ఎక్సైజ్‌ అధికారులే చెబుతున్నారు. నిబంధనల ప్రకారం పట్టణంలోని మద్యం దుకాణాలు రాత్రి 8 గంటలకు మూతపడగానే ఈ బార్‌లలో మద్యం వ్యాపారం రెట్టింపు అవుతుంది. ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రూ.100 టిన్‌ బీర్‌ రూ.150 అమ్ముతారు. రూ.130 ఉన్న నాకౌట్‌ బీర్‌ రూ.160 నుంచి రూ.180, కొరియర్‌ గ్రీన్‌ విస్కీ క్వాటర్‌ బాటిల్‌ రూ.230 ఉంటే రూ.300 అమ్ముతున్నారు. ఇలా ఏ బ్రాండ్‌ తీసుకున్నా ఫుల్‌ బాటిల్‌ మీద రూ.100 నుంచి రూ.300 దాకా అధికంగా వసూలు చేస్తున్నారు.  

సారుకు సగం.. బార్లకు సగం 
బార్లలో రాత్రి 8 తర్వాత జరిగే వ్యాపారంలో బార్‌ల నిర్వాహకులకు సగమైతే.. ఆ మిగిలిన సగం వాటా ఎౖక్సైజ్‌ సారుకు అందుతోంది. ఆ డబ్బు ఎప్పటికప్పుడు రోజూ ఆయనే స్వయంగా వెళ్లి కలెక్షన్‌ చేసుకుంటున్నారని సంబంధిత శాఖ సిబ్బందే చెబుతున్నారు. ఇలా మద్యం దుకాణాల ద్వారా అధిక ధరలకు మద్యం అమ్మినందుకు ఆయనకు రోజుకు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలు దాకా వస్తోందని, ఆ రెండు బార్‌ల ద్వారా రోజూ ఆయనకు రూ.80 వేల నుంచి రూ.లక్ష దాకా అక్రమ ఆదాయం వస్తోందని తెలుస్తోంది. ఎక్సైజ్‌ నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న సదరు ఎక్సైజ్‌ అధికారి అక్రమార్జనకు అడ్డూఅదుపు లేకుండా పోవడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top