ప్రాణాలతో కోట్లాట! | ESI Service Stopped in SVIMS Hospital Tirupati | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో కోట్లాట!

May 7 2019 9:20 AM | Updated on May 7 2019 9:20 AM

ESI Service Stopped in SVIMS Hospital Tirupati - Sakshi

అత్యంత ప్రతిష్టాత్మకమైన ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌)లో డబ్బులుంటేనే వైద్య సేవలు అన్న విధంగా మారిపోయింది. శ్రీవారి పాదాల చెంతవెలసిన స్విమ్స్‌లో వైద్యానికి రేటుకడుతున్నారు. గత వారం రోజులుగా ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ రూ.10 కోట్ల బకాయి చెల్లించలేదని వైద్య సేవలను నిలుపుదల చేశారు. ఈఎస్‌ఐ శాఖ ముందస్తుగా రూ.కోటి చెల్లించినా ఉపయోగం లేకుండా పోయింది. పూర్తిస్థాయి బకాయి చెల్లిస్తేనే వైద్య సేవలు కొనసాగిస్తామని స్విమ్స్‌ యాజమాన్యం తేల్చి చెప్పింది. బకాయిలో కేవలం రూ.4 కోట్లు చెల్లిస్తే చాలని ఈఎస్‌ఐ అధికారులు స్విమ్స్‌ యాజమా న్యానికి విన్నవించారు. స్విమ్స్‌ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి బకాయి చెల్లించాల్సిందేని స్విమ్స్‌ యాజమాన్యం స్పష్టం చేసింది. రెండు సంస్థల మధ్య బకాయి చెల్లింపు విషయం గందరగోళంగా మారడంతో ఈఎస్‌ఐ సేవలు నిలిచిపోయాయి. ఈఎస్‌ఐ లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.

తిరుపతి (అలిపిరి): స్విమ్స్, ఈఎస్‌ఐ సంస్థల మధ్య బకాయి చెల్లింపుల విషయం వివాదంగా మారడంతో స్విమ్స్‌ యాజమాన్యం ఈఎస్‌ఐ సేవలు నిలిపివేసింది. రూ.10 కోట్లు బకాయి చెల్లిస్తేనే వైద్యసేవలు కొనసాగిస్తామని గత నెల ఆస్పత్రిలో బోర్డులు పెట్టి మే ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో సేవలు నిలిపివేసింది. ఈఎస్‌ఐ అధికారులు తర్జనభర్జనల అనంతరం స్విమ్స్‌ ఖాతాలో రూ.కోటి జమచేశారు. సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌ స్కీం రేట్ల ప్రకారం ఇక రూ.4కోట్లు మాత్రమే బకాయి ఉందని ఈఎస్‌ఐ అధికారులు ప్రకటించడంతో వివాదం చెలరేగింది. స్విమ్స్‌ యాజమాన్యం మాత్రం బకాయి మొత్తం చెల్లిస్తేనే వైద్య సేవలు కొసాగిస్తామని తేల్చి చెప్పింది. ఈఎస్‌ఐ నిబంధనల ప్రకారమే రేట్లు వేశామని పేర్కొంది. రెండు సంస్థల మధ్య బకాయి చెల్లింపు విషయం ఇంకా కొలిక్కిరాలేదు.

డబ్బుంటేనే వైద్యం?
స్విమ్స్‌ నిరుపేదలకు సూపర్‌ స్పెషాలిటీవైద్యం అందిస్తోంది. ప్రాణదాన పథకం ద్వారా నిరుపేదలకు ప్రాణాలు పోస్తోంది. నిత్యం శ్రీవారి నామస్మరణతో నడుస్తున్న ఆస్పత్రిలో డబ్బులుంటేనే వైద్య సేవలు అనేలా మారుతోంది. కార్మిక రాజ్య బీమా సంస్థ రూ.10 కోట్లు బకాయి చెల్లించలేదని ఏకంగా కార్మికులకు వైద్య సేవలు నిలిపివేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

స్విమ్స్‌ యాజమాన్యం మొండిపట్టు
కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన స్విమ్స్‌ యాజమాన్యం ఈఎస్‌ఐ సంస్థ బకాయి చెల్లిస్తేనే వైద్యం చేస్తామని చెప్పడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఈఎస్‌ఐ సంస్థ బకాయిని ఈనెల 15వ తేదీ లోపు చెల్లించే అవకాశం ఉందని రాతపూర్వకంగా స్విమ్స్‌ యాజమాన్యానికి విన్నవించినా ఉపయోగం లేకుండా పోయింది. బకాయి మొత్తం చెల్లిస్తేనే వైద్య సేవలు అంటూ మొండిపట్టు పట్టింది.

అసలేం జరిగిందంటే..
సీజీహెచ్‌ఎస్‌ రేట్ల ప్రకారం స్విమ్స్‌ వైద్య ఖర్చులు కేవలం రూ.5 కోట్లు మాత్రమేనని ఈఎస్‌ఐ అధికారులు వెల్లడించారు. అయితే దీనిపై స్విమ్స్‌ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. నిబంధనల ప్రకారం రేట్లు వేశామని స్పష్టం చేసింది. డయాలసిస్‌ బ్యాగులు, కేన్సర్‌ విభాగానికి సంబంధించి మాత్రమే రూ.3.5 కోట్లు అయినట్లు స్విమ్స్‌ అధికారులు చెబుతున్నారు. ఈఎస్‌ఐ అధికారులు మాత్రం స్విమ్స్‌ వాదను వ్యతిరేకిస్తున్నారు. రెండు సంస్థల మధ్య బకాయి చెల్లింపు కొలిక్కిరాలేదు.

అవస్థలు పడుతున్న లబ్ధిదారులు
స్విమ్స్‌ వైద్య సేవలను నిలిపివేయడంతో డయాలసిస్‌ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈఎస్‌ఐ కింద ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేసుకుంటున్నారు. అయితే స్విమ్స్‌లో కొంత మేర నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. తాజా పరిణామాలతో ఈఎస్‌ఐ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైన స్విమ్స్‌ యాజమాన్యం మానవతాదృక్పథంతో బకాయి చెల్లింపు పక్కనబెట్టి ఈఎస్‌ఐ లబ్ధిదారులకు వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బకాయి చెల్లిస్తేనే వైద్య సేవలు
స్విమ్స్‌ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. ఈఎస్‌ఐ నిబంధనల ప్రకారమే బిల్లులు కోడ్‌ చేశాం. పూర్తి స్థాయి బకాయి చెల్లిస్తేనే ఈఎస్‌ఐ లబ్ధిదారులకు నగదు రహిత వైద్య సేవలు కొనసాగుతాయి.   – డాక్టర్‌ అలోక్‌ సచన్, మెడికల్‌ సూపరింటెండెంట్,స్విమ్స్, తిరుపతి

రూ.కోటి చెల్లించాం
డయాలసిస్‌ బ్యాగులు, మందులు, కొన్ని ఇతరత్రా వైద్య సేవలు ఈఎస్‌ఐ పరిధిలోకి రావు. సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌ స్కీం రేట్ల ప్రకారమే ఆన్‌లైన్‌ బిల్లులు అనుమతిస్తారు. స్విమ్స్‌ ఖాతాలో రూ.కోటి చెల్లించాం.– బి. రామకోటి,రీజినల్‌ డైరెక్టర్, ఈఎస్‌ఐ, ఏపీ

సొంత ఖర్చుతో డయాలసిస్‌
స్విమ్స్‌లో ఈఎస్‌ఐ సేవలను నిరాకరించడంతో సొంత ఖర్చులతో డయాలసిస్‌ చేసుకుంటున్నా. రెండు డయాలసిస్‌లకు రూ.3 వేలు చెల్లించా. ఈఎస్‌ఐ రెఫరెన్స్‌ ఉన్న ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతాయో లేవో తెలియదు. స్విమ్స్‌లో సీనియన్‌ టెక్నీషియన్లు ఉన్నారు. రోగులకు ఇబ్బందులు వుండవు.– గోపాలకృష్ణమూర్తి, ఈఎస్‌ఐ లబ్ధిదారు, తిరుపతి

సేవలు కొనసాగించాలి
స్విమ్స్‌లో ఈఎస్‌ఐ సేవలు కొనసాగించాలి. సొంత ఖర్చుతో డయాలసిస్‌ చేసుకుంటున్నాం. స్విమ్స్‌ అధికారులు స్పందించి ఈఎస్‌ఐ లబ్ధిదారులను ఆదుకోవాలి. ఇలానే మరికొంత కాలం కొనసాగితే లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడక తప్పదు.    – శేఖర్,    ఈఎస్‌ఐ లబ్ధిదారు, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement