తెలుగు రాష్ర్టం రెండుగా విడిపోవడం బాధాకరమైనప్పటికీ తెలుగు ప్రజలను కలిపే శక్తి ఒక్క తెలుగు భాషకే ఉందని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
భవానీపురం : తెలుగు రాష్ర్టం రెండుగా విడిపోవడం బాధాకరమైనప్పటికీ తెలుగు ప్రజలను కలిపే శక్తి ఒక్క తెలుగు భాషకే ఉందని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. భాషా పండితుడు, బాలవ్యాకరణ రూపకర్త పరవస్తు చిన్నయసూరి 208వ జయంతి సందర్భంగా గవర్నర్‌పేటలోని డాక్టర్ కేఎల్ రావు భవన్‌లో చిన్నయసూరి సాహితీ పీఠం ఆధ్వర్యాన ‘తెలుగు భాషా వికాసం’ అంశంపై శనివారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విజయవాడ కేంద్రంగా సాహితీ వికాస కేంద్రం, సాహిత్య అకాడమీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం తెలుగు శాఖాధిపతి ఆచార్య వెలమల సిమ్మన్నను సత్కరించారు.
సాహితీ పీఠం అధ్యక్షుడు టి.శోభనాద్రి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆకాశవాణి కేంద్రం సంచాలకులు ఎం.కృష్ణకుమారి, తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్, తెలుగు వర్సిటీ మాజీ వీసీ ఆవుల మంజులత, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జి.సుబ్బారావు, గుమ్మా సాంబశివరావు పాల్గొన్నారు.