ఎన్నికల సీజన్ మొదలు కానుంది. ఓటర్లకు గాలం వేసేందుకు అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది.
ఎన్నికల సీజన్ మొదలు కానుంది. ఓటర్లకు గాలం వేసేందుకు అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. అందులోనూ వృద్ధాప్య పెన్షన్లపై కాస్త ఎక్కువ ప్రేమ చూపుతోంది. త్వరలోనే వృద్ధుల పెన్షన్ పెంచాలనే నిర్ణయానికి వ చ్చింది. నెల్లూరు జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. అబ్బో.. వృద్ధులపై ప్రభుత్వానికి ఎంతప్రేమో అంటూ ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు.
కడప రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికలు సమీపిస్తే చాలు...రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ పథకాలపై ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొస్తుంది. ముఖ్యంగా సామాజిక పెన్షన్లపై ఏదో ఒక విధంగా కరుణ కురిపిస్తుంది. సాధారణ రోజుల్లో కాస్తయినా జాలి చూపని పాలకులకు ఎన్నికలు వస్తున్నాయంటే ప్రేమ కట్టలు తెంచుకుంటుంది. అందుకు ఉదాహరణగా గడిచిన ఉప ఎన్నికలకు ముందు అర్హులు వేలాది మంది ఉండగా, కేవలం ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లోనే కొత్త పెన్షన్లను మంజూరుచేసి తమ ఘనతను చాటుకున్నారు. తాజాగా రచ్చబండ నిర్వహిస్తూ అరకొర పెన్షన్లను మంజూరు చేస్తున్నారు.
అలాగే ఎంతోమంది వికలాంగులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తుండగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాయచోటికి వస్తున్నారని, కేవలం ఆ ప్రాంతానికి చెందిన వికలాంగులకు ఆగమేఘాలమీద వికలత్వ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు చకాచకా చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధాప్య పెన్షన్ల సొమ్ము పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. అన్ని పెన్షన్ల సొమ్మును పెంచితే భారమనుకున్నారేమోగానీ కేవలం వృద్ధాప్య పెన్షన్ల సొమ్మును పెంచనున్నట్లు సమాచారం.
త్వరలో ముఖ్యమంత్రి ప్రకటన
ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో రచ్చబండ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వృద్ధాప్య పెన్షన్ల సొమ్మును పెంచుతున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడిస్తారని పేర్కొన్నారు. దీంతో దాదాపుగా వృద్ధాప్య పెన్షన్ల పెంపు ఖాయమైనట్లుగానే తెలుస్తోంది. ప్రస్తుతం వృద్ధులు ప్రతినెల రూ. 200 చొప్పున పెన్షన్ పొందుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత పెన్షన్ సొమ్ము ఎంత పెంచేది తెలియనుంది. సామాజిక పెన్షన్ల కింద వృద్ధులు, వికలాంగులు, చేనేతలు, వితంతువులు, కల్లుగీత కార్మికులు పెన్షన్లను పొందుతున్నారు. వికలాంగులు రూ. 500చొప్పున పెన్షన్ పొందుతుండగా, మిగతా క్యాటగిరీల్లోని వారు రూ. 200 చొప్పున పెన్షన్లను పొందుతున్నారు. అయితే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వృద్ధాప్య పెన్షన్ల సొమ్మును పెంచుతున్నట్లు మాత్రమే ప్రకటించారు.
అంటే మిగతా కేటగిరీల్లోని వారికి యథావిధిగానే పెన్షన్ల సొమ్ము మంజూరు చేస్తారని చెప్పవచ్చు. కాగా, వికలాంగులకు సంబంధించి 40 శాతం వికలత్వం ఉన్న వారికే పెన్షన్లకు అర్హులుగా పరిగణించి వారికి రూ. 500 చొప్పున పంపిణీ చేస్తున్నారు. 20 నుంచి 39 శాతంలోపు వికలత్వం ఉన్న వారికి ప్రతినెల రూ. 200 చొప్పున పెన్షన్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. గతంలో వికలత్వ శాతాన్ని బట్టి 40 శాతం నుంచి పైబడిన వారికి రూ. 500 నుంచి రూ. 700 వరకు పెన్షన్ ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ రూ. 500 పెన్షన్‌ను పంపిణీ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల సమయంలోనైనా ప్రభుత్వం స్పందించి వృద్ధులకైనా పెన్షన్ సొమ్మును పెంచుతుండటం పట్ల పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ సీఎం కాకముందే....
డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం కాకమునుపు 2004వ సంవత్సరం వరకు తెలుగుదేశం పార్టీ పాలనలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కేటగిరీలకు సంబంధించి కేవలం 65 వేల మందికి మాత్రమే పెన్షన్లు పంపిణీ చేసేవారు. కేవలం నెలకు రూ. 75 చొప్పున పెన్షన్ సొమ్ము పంపిణీ అయ్యేది. అది కూడా సక్రమంగా అందేది కాదు.
వైఎస్ సీఎం అయ్యాక..
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సంక్షేమ పథకాల స్వరూపమే మారిపోయింది. అందులోనూ సామాజిక పెన్షన్ల సంఖ్య అమాంతం పెరిగింది. ఇందిరమ్మ కార్యక్రమం కింద కేవలం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేతలు నాలుగు కేటగిరీల్లోనే 2.61 లక్షల పెన్షన్ల సంఖ్య చేరింది. అంతేగాక రూ. 75 ఉన్న పెన్షన్‌ను రూ. 200కు పెంచారు. అనంతరం వికలాంగులకు రూ. 500లకు పెన్షన్‌ను పెంచారు. వైఎస్ మరణానంతరం సంక్షేమ పథకాల అమలులో లోటుపాట్లు సంభవించాయి. ఆ ప్రభావం సామాజిక పెన్షన్లపై కూడా పడింది. పాలకులు ఎన్నికల వేళల్లోనే పెన్షన్లపై ప్రేమను చూపిస్తూ వచ్చారు. దీంతో అర్హుల జాబితాలో ఉన్న వారు సైతం ఏడాదికి పైగా పెన్షన్లను పొందడానికి ఎదురు చూడాల్సి వచ్చింది. తాజాగా ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ల సొమ్మును పెంచుతున్నట్లు ప్రకటించడంతో ప్రజల్లో విస్మయంతోపాటు ఇలాగైనా పాలకులు స్పందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.