ఎన్నికలతో ఎంత కలతో.. | election duty in Government authorities | Sakshi
Sakshi News home page

ఎన్నికలతో ఎంత కలతో..

Apr 8 2014 12:18 AM | Updated on Aug 14 2018 4:32 PM

ఎన్నికల విధుల్లో నిమగ్నమైన ప్రభుత్వ యంత్రాంగానికి బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్టాలు పట్టడం లేదు. జిల్లాలో ఉపాధి కూలీలు వేతనాల కోసం,

 సాక్షి, కాకినాడ : ఎన్నికల విధుల్లో నిమగ్నమైన ప్రభుత్వ యంత్రాంగానికి బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్టాలు పట్టడం లేదు. జిల్లాలో ఉపాధి కూలీలు వేతనాల కోసం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా సంబంధిత సిబ్బంది ‘నిధులు విడుదల కాలేదు. మమ్మల్నేం చేయమంటారు’ అని  చెబుతున్నారు. జిల్లాలో 4,77,499 మంది పింఛన్‌దారులుండగా వారిలో వృద్ధాప్య పింఛన్‌దారులు 2,16,679 మంది, వితంతువులు 1,50,028 మంది, వికలాంగులు 64,776 మంది, అభయహస్తం పింఛన్‌దారులు 34,891 మంది, కల్లుగీత కార్మికులు 2,434 మంది, చేనేత కార్మికులు 8,691 మంది ఉన్నారు. వీరికి పింఛన్లుగా ప్రతి నెలా రూ.16.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఏప్రిల్ నెల మొదలై వారం గడిచినా ఇంకా విడుదల కాలేదు. ప్రతి నెల మాదిరే పింఛన్ల కోసం సంబంధిత పోస్టల్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. 
 
 నిత్యావసరాలు, మందులకు ఉపయోగపడే పింఛన్ డబ్బుల కోసం అధికారులను ప్రాధేయపడుతున్నారు. ఎన్నికలయితే కానీ ఇవ్వలేమని కొంతమంది చెబుతుంటే.. మరికొంత మంది ‘ఈరోజు కాదు.. రేపు రండి’ అంటూ తిప్పుతున్నారు. డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజును వివరణ కోరగా ఈ నెల పింఛన్ల పంపిణీలో జాప్యంవాస్తవమేనన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు ఈ నెల 12 నుంచి 19 వరకు పింఛన్లు చెల్లిస్తామని చెప్పారు.మరోపక్క ఉపాధి కూలీలదీ అలాంటి అవస్థే జిల్లావ్యాప్తంగా ప్రతిరోజూ 40 వేల నుంచి 60 వేల మంది ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్నారు. వారందరికీ గత నాలుగు వారాలుగా వేతనాలు అందడం లేదు. స్థానిక అధికారులను నిలదీస్తే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదంటూ చేతులు దులుపుకొంటున్నారు. ఁఈవాళ  కాకపోతే రేపైనా వస్తాయిరూ.  అనే ఆశతో కూలీలు పంటి బిగువున పనులు సాగిస్తున్నారు.
 
 వేసవి భత్యంతో కలిపి కూలీకి రోజుకు రూ.149 చొప్పున జిల్లాలో ఉపాధి కూలీలకు రోజుకు రూ.74 లక్షలు వేతనంగా ముట్టాల్సి ఉంది. గత నాలుగు వారాల వేతనాల మొత్తం రూ.16 కోట్లకు పైనే ఉంటుంది. ఒకపక్క రాష్ట్ర విభజన, మరో పక్క ఆర్థిక సంవత్సరం ముగింపు వంటి సాంకేతిక కారణాల వల్లే నిధులు విడుదల కాలేదని చెబుతున్నా రెక్కాడితే కాని డొక్కాడని కూలీలు పస్తులతో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక పూట తిని మరో పూట గంజినీళ్లు తాగాల్సి వస్తోందని కోనసీమకు చెందిన కె.వెంకట్రావు అనే ఉపాధి కూలీ వాపోయాడు. వేతనాల జాప్యంపై డ్వామా పీడీ పి.సంపత్‌కుమార్‌ను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదన్నారు. నాలుగైదు రోజుల్లో విడుదల కాగానే పంపిణీ చేస్తామన్నారు.
 
 పింఛనే నాకు ఆధారం
 వెనకా ముందూ ఎవరూ లేని నాకు ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన పింఛనే ఆధారం. రూ.500 పింఛన్ సొమ్ముతోనే రేషన్ బియ్యం, నిత్యావ సరాలు కొనుక్కుని బతుకుతున్నారు. ఈనెల పింఛన్ అందక ఇబ్బందులు పడుతున్నా.
 - గాలంకి నరసింహమూర్తి, వికలాంగుడు, లొల్ల
 
 సకాలంలో ఇవ్వడం లేదు
 ప్రభుత్వమిచ్చే రూ.500 పింఛనే నాకు ఆధారం. గత నాలుగేళ్లుగా ఏనాడూ పింఛన్ సక్రమంగా అందడం లేదు. ఎప్పుడిస్తారో తెలియడం లేదు. అడుగుతుంటే రేపిస్తాం.. మాపిస్తాం అంటూ తిప్పించుకుంటున్నారు.
 - కె.ధనలక్ష్మి, వికలాంగురాలు, కిర్లంపూడి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement