
విద్యావిధానంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒత్తిడి లేని విద్య అందించే ప్రక్రియకు అడుగులు పడుతున్నాయి. బడి అంటే అదేదో బందిఖానాలా కాకుండా... ఆటపాటల నిలయంగా మార్చే యత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఆనందలహరి... నో బ్యాగ్‌డే...అంటూ సంస్కరణలు తీసుకొచ్చిన సర్కారు తాజాగా పలు తరగతుల సిలబస్ తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ రూపొందించిన ఈ ప్రణాళికను తాజాగా అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది.
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు, సరళీకృతమైన సమగ్ర విద్యాబోధనకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పాఠశాలల్లో వివిధ తరగతులకు నిర్దేశించిన విద్యాప్రమాణాలను సాధించ డం ఉపాధ్యాయులకు తలకుమించిన భారమవుతోంది. సిలబస్ పూర్తి చేయడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అవసరం లేని పాఠాలను తొలగించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాలు విద్యార్థి భవిష్యత్తుకు అవసరమయినవా కావా అన్న అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బోధనలో ఉపయోగిస్తున్న కొన్ని పాఠ్యాం శాలను తొలగించాలని నిర్ణయించింది. వయోపరిమితిని అనుసరించి విద్యార్థుల సామర్థ్యాలు, వారి మానసిక స్థితిని బేరీజు వేసుకున్న విద్యా శాఖలోని ఎస్‌సీఈఆర్‌టీ(రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ) విభాగం మూడో తరగతి నుంచి 8 వ తరగతి వరకూ గల పాఠాల్లో పలు పాఠ్యాంశాలను తొలగించాలని నిర్ణయించింది. ఆయా పాఠ్యాంశాల వివరాలను విద్యా శాఖకు పంపింది. ఆ పాఠాలను ఇప్పుడు విద్యార్థులు చదవనవసరం లేదనీ, వీటిని పుస్తకాల్లోంచి తొలగించాలని ఏపీ ఎస్‌సీఈఆర్‌టీ ఆదేశించింది. గుర్తించిన పాఠ్యాంశాలపై పరీక్షలుండవని కూడా స్పష్టం చేసింది.
తొలగించనున్న పాఠ్యాంశాలివే...
మూడో తరగతి తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం, లడ్డూ బాధ, పిల్లల మర్రి, చెట్టు కోరిక వంటి వాటితో పాటు ఇంగ్లిష్‌లో మూడు, లెక్కలులో రెండు, ఈవీఎస్‌లో నాలుగు, నాలుగో తరగతిలో తెలుగు నాలుగు పాఠాలు ఇంగ్లిష్ రెండు పాఠాలు లెక్కలులో మూడు ఇలా వరుసగా ఒక్కో తరగతిలోనూ రెండు నుంచి ఆరు వరకూ పాఠాలను అవసరం లేనివిగా గుర్తించారు. ఆరో తరగతిలో ఉర్దూ సబ్జెక్టులో ఆరు పాఠాలు అవసరం లేనట్టు గుర్తించారు. ఇలా ఎనిమిదో తరగతి వరకూ పాఠ్యాంశాలను తొలగిస్తున్నట్టు ఎస్‌సీఈఆర్‌టీ ప్రకటించింది.
ఈ ఏడాది నుంచే అమలు
మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వర కూ అన్ని సబ్జెక్టులలోనూ అవసరం లేని పాఠ్యాంశాలను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నట్టు చెప్పింది. 2019–20 నుంచి ఈ పాఠ్యాంశాలు అవసరం లేనివని వీటిని తొలగిస్తున్నట్టు చెప్పారు.
సామర్థ్యాలు పెరుగుతాయి
దీని ప్రకారం వేలాది మంది విద్యార్థులు అవసరమయిన పాఠాలను ఆకళింపు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ పాఠ్యాంశాలను వదిలి వేయడం వల్ల మిగతా ముఖ్యమైన పాఠాలపై దృష్టి పెట్టడం వల్ల విద్యార్థుల సామర్థ్యాలు పె రుగుతాయి. ఉపాధ్యాయులు కూడా కాస్త ఎక్కు వ సమయాన్ని మిగిలిన పాఠ్యాంశాలపై దృష్టి సా రించి బోధించేందుకు అవకాశం కలుగుతుంది.
బోధన సరళీకృతమవుతుంది
అవసరం లేని పాఠాలను తొలగించడం వల్ల బోధన సరళీకృతమవుతంది. దీని వల్ల విద్యార్థులు ము ఖ్యమైన పాఠాలపై ఏకాగ్రత పెంచుకుని చదువుకునేందుకు అవకాశం కలుగుతుంది. మరింత తొందరగా సిలబస్‌ను పూర్తి చేసి రివిజన్ చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది.
– జె.సి.రాజు, హెచ్‌ఎం, నారాయణప్పవలస