ఆశల మోసులు

పల్లెపోరుకు కసరత్తు

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఈసీ ఆదేశాలు

ఇంకా తేలని సర్కారు వైఖరి

ఉదయగిరి : ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణ, సామగ్రి, బ్యాలెట్‌ పత్రాల అవసరత, ఖర్చులు, సిబ్బంది భత్యాలు తదితర అంశాలకు సంబంధించి ఏ మేరకు నిధులు అవసరమవుతాయనే దానిపై వివరాలతో కూడిన నివేదికలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ విషయం తెలిసి పంచాయతీ పీఠాలపై కన్నేసిన స్థానిక నాయకులు రాజకీయ వ్యూహాలకు తెరలేపారు. రాష్ట్ర విభజనకు ముందు 2013 జూన్, జూలై నెలల్లో జిల్లాలో 931 గ్రామ పంచా యతీలు, 8,834 వార్డు పదవులకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ కాలం వచ్చే ఏడాది ఆగస్టు 2వ తేదీతో ముగియనుంది. ఆలోగా కొత్త పాలకవర్గాలను కొలువుదీర్చాల్సి ఉండటంతో ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.

గడువులోగా నిర్వహించేందుకు..
పంచాయతీ ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగిసే రోజులు సమీపిస్తున్న తరుణంలో గడువులోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 941 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొన్ని పంచాయతీలకు కోర్టు ఆదేశాలు ఉండటం, మరికొన్ని పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేసిన పురపాలక సంఘాల పరిధిలోకి వెళ్లడంతో 2013లో వాటికి ఎన్నికలు జరగలేదు. ఈసారి అన్ని పంచాయతీలకు ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. మొత్తం పంచాయతీల్లో సగం స్థానాలను మహిళలకు కేటాయించాలి. రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 487 పంచాయతీలు, జనరల్‌కు 454 కేటాయిస్తారు.

వీటి పరిధిలో 8,900 వరకు వార్డులు ఉన్నాయి. గ్రామ పంచాయతీల వారీగా వార్డుల వివరాలు, ఓటర్ల జాబితాలను అందజేయాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సందర్భంలో ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయం, పోలింగ్‌ కేంద్రాల అవసరత, బ్యాలెట్‌ బాక్సులు, ఉద్యోగ, సిబ్బంది అవసరం వంటి వివరాలను అందించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ప్రాథమిక నివేదికలను జిల్లా అధికారులు రూపొందించారు. ఎన్నికల నిర్వహణకు రూ.13 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. బడ్జెట్, ఇతర వివరాలతో కూడిన నివేదికలను ఎన్నికల సంఘానికి పంపించేందుకు తుది కసరత్తు చేస్తున్నారు.

ఇంకా తేలని సర్కారు వైఖరి
జిల్లాలో 10 నియోజకవర్గాల పరిధిలో సుమారు 32 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరిలో 20,87,590 మంది ఓటర్లు. గడువులోగా ఎన్నికలు నిర్వహించాలా లేదా అనే అంశంపై  ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పష్టత రాలేదు. సార్వత్రక ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే అధికార పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాల వల్ల తలెత్తే పరిణామాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయేమోనని టీడీపీ నేతలు కలవరపడుతున్నారు. స్థానిక ఎన్నికల వల్ల కలిగే లాభ, నష్టాలను బేరీజు వేసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది.

నిధులను కోల్పోయే ప్రమాదం!
నిర్దేశిత గడువులోగా పంచాయతీ ఎన్నికలు జరపకపోతే కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్లను నిలిపివేసే ప్రమాదం ఉంది. ఈ దృష్ట్యా ఎన్నికలను సకాలంలో జరపక తప్పదని కొందరు పేర్కొంటున్నారు. సకాలంలో ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సర్పంచ్‌లకు గల చెక్‌ పవర్‌ను ఫిబ్రవరిలో రద్దు చేసి ప్రత్యేక అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత పాలకవర్గాలు అందుబాటులో ఉన్న నిధులను ఖర్చు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నాయి. ఏదిఏమైనా గ్రామసీమల్లో పంచాయతీ ఎన్నికల వేడి ప్రారంభమైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top