విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈరోజు కౌన్సెలింగ్ జరగని వారందరికీ సర్టిఫికెట్ల పరిశీలనకు మరోసారి అవకాశం ఇస్తామని ఎంసెట్ కన్వీనర్ రఘునందన్ చెప్పారు.
సీమాంధ్ర జిల్లాల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో సమస్యలు, ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమేనని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన 'సాక్షి టీవీ'తో మాట్లాడారు. సీమాంధ్రలోని పలు జిల్లాల్లో కౌన్సెలింగ్కు సమైక్య వాదుల నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని, పాలిటెక్నిక్ లెక్చరర్లు కూడా ఆందోళన చేస్తుండటంతో చాలాచోట్ల కౌన్సెలింగ్ జరగలేదని ఆయన తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈరోజు కౌన్సెలింగ్ జరగని వారందరికీ సర్టిఫికెట్ల పరిశీలనకు మరోసారి అవకాశం ఇస్తామని ఆయన చెప్పారు. సీమాంధ్రలో పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేస్తామని, కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని రమణారావు అన్నారు.
అయితే.. మరోవైపు ఉన్నత విద్యామండలి మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించింది. ఎంసెట్ కౌన్సెలింగ్ను నిలిపివేసే ప్రసక్తే లేదని మండలి తెలిపింది. కౌన్సెలింగ్ విషయంలో విద్యార్థులకు సహకరించాలని విద్యార్థి సంఘాలకు, ఉద్యమకారులకు విజ్ఞప్తి చేసింది.
కాగా, సీమాంధ్రలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఏమాత్రం సజావుగా సాగట్లేదు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్యసెగ తగిలింది. విద్యార్థి జేఏసీ నాయకులు కౌన్సెలింగ్ ప్రక్రియను అడ్డుకున్నారు. దీంతో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను సిబ్బంది నిలిపివేశారు.