పలు ప్రయివేటు కళాశాలలు విద్యను వ్యాపారమయం చేస్తున్నాయని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఆనంద్ ఆరోపించారు.
కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: పలు ప్రయివేటు కళాశాలలు విద్యను వ్యాపారమయం చేస్తున్నాయని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఆనంద్ ఆరోపించారు. వాటి ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక మద్దూర్‌నగర్‌లోని సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయివేటు విద్యాసంస్థల ధన దాహానికి విద్యార్థులు బలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పాఠశాలల్లో విలువలు, ప్రామాణాలను పాటించడం లేదన్నారు. కొన్ని విద్యాసంస్థలు కేవలం అడ్మిషన్లు పొందితే సరాసరి పరీక్షలకు హాజరయ్యే ఆవకాశం కల్పిస్తున్నాయని ఆరోపించారు. ఇంజనీరింగ్, డిఎడ్ కళాళాలల్లో ఈ పరిస్థితి మరి అధికంగా ఉందన్నారు. విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి వారికి మంజూరయ్యే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను స్వాహా చేస్తున్నారన్నారు. ఇలాంటి విద్యా సంస్థలపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు దాకేష్, శ్రీనివాసులు, మునిస్వామి, సోమశేఖర్, భాస్కర్, జనార్ధన్, చంద్రశేఖర్, నాయుడు పాల్గొన్నారు.