విషజ్వరాలతో వణుకుతున్న జిల్లా | District of toxic trembler with fever | Sakshi
Sakshi News home page

విషజ్వరాలతో వణుకుతున్న జిల్లా

Sep 9 2013 4:00 AM | Updated on Sep 1 2017 10:33 PM

జిల్లా విషజ్వరాల బారిన పడింది. రక్తంలో ప్లేట్‌లెట్ల కౌంట్ తగ్గించే డెంగీ జ్వరం జిల్లా వాసులను భయపెడుతోంది.

అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లా విషజ్వరాల బారిన పడింది. రక్తంలో ప్లేట్‌లెట్ల కౌంట్ తగ్గించే డెంగీ జ్వరం జిల్లా వాసులను భయపెడుతోంది. ఇప్పటికే ఈ జ్వరం బారిన పడి కోనసీమలోని కరవాకకు చెందిన రేకాడి పుష్పలత (12) గత నెలలో మృతి చెందగా ఆదివారం అవే లక్షణాలతో పి. గన్నవరం శివారు బి.వి. పాలెం గ్రామానికి చెందిన కోటిపల్లి నాగభాస్కరరావు అలియాస్ నాగబాబు (38) మరణించారు. అలాగే కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన సీహెచ్ వీరమణి డెంగీ లక్షణాలతో మరణించగా మండపేటలో డెంగీ అనుమానిత లక్షణాలతో 11 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. కడియం, మండపేట మండలాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత నెలలో మామిడికుదురు మండలం కరవాకలో సుమారు 300 మంది జ్వరాల బారినపడ్డారు. వీరిలో 12 మందికి డెంగీ సోకినట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి.పద్మావతి స్వయంగా ప్రకటించారు. డెంగీతోపాటు మలేరియా, టైఫాయిడ్, కామర్లె వ్యాధి సోకినట్టు అధికారులు గుర్తించారు. తరువాత అదే మండలం అప్పనపల్లిలో వైరల్ జ్వరాలు నమోదయ్యాయి.
 
 గత రెండు రోజుల్లో పి.గన్నవరం మండలం బి.వి.పాలెం, లంకల గన్నవరం, యర్రంశెట్టివారిపాలెం, వై.వి.పాలెం, ముంగండపాలెం గ్రామాలకు చెందిన 50 మందికి పైగా జ్వరాలబారిన పడ్డారు. వీరందరూ అమలాపురంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురికి డెంగీ లక్షణాలు బయటపడుతున్నట్టు తెలిసింది. అమలాపురంలో యునెటైడ్ నర్సింగ్ హోమ్‌లో పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలానికి చెందిన యర్రంశెట్టి లక్ష్మి, యర్రంశెట్టి నాగబాబు, నాగమల్లేశ్వరి, లంకలగన్నవరానికి చెందిన అల్లాడ నరసింహారావు, కొల్లి వెంకటేశ్వరరావుతోపాటు పదిమంది గత నాలుగైదు రోజులుగా చికిత్స పొందుతున్నారు.  
 
 అలాగే పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో వివిధ గ్రామాలకు చెందిన జ్వరాల బారిన పడిన రోగులు ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడంతో  పదుల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు.  మండపేట, పరిసర ప్రాంతాల్లో పదకొండు మంది వ్యక్తులు సైతం డెంగీబారిన పడగా, నిర్ధారణ కోసం వైద్యాధికారిలు పరీక్షలకు పంపారు. ఇవే కాకుండా వరద ప్రభావానికి గురైన లంక గ్రామాల్లో సైతం జ్వరపీడితులు అధికంగా ఉన్నారు. వరదల వల్ల కొట్టుకువచ్చిన చెత్తాచెదారం వల్ల పరిసరాలు, తాగునీరు కలుషితం కావడంతో రోగాలు విజృంభిస్తున్నాయి. సమైక్య ఉద్యమ నేపథ్యంలో ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది. ఈ కారణంగానే రోగాలు విజృంభిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. 
 
 
 డెంగీ లక్షణాలతో సొసైటీ డెరైక్టర్ మృతి
 పి.గన్నవరం : డెంగీ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పి. గన్నవరం సొసైటీ డెరైక్టర్  కోటిపల్లి నాగభాస్కరరావు (నాగబాబు) (38) ఆదివారం మృతి చెందారు. పి.గన్నవరం శివారు బోడపాటివారిపాలానికి చెందిన నాగబాబు నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆయనను రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రక్తంలోని ప్లేట్‌లెట్‌ల సంఖ్య 5వేలకు లోపు పడిపోవడంతో వైద్యసేవలందించినా ఫలితం లేకపోయింది. 
 
 నాగబాబుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగబాబు భార్య వెంకటలక్ష్మి కూడా విష జ్వరం బారినపడడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో పలువురు విషజ్వరాల బారినపడి అమలాపురంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పంటకాలువలోకి ఇళ్లలోని మురుగునీరు చేరడం, స్థానికంగా బెల్లం తయారీ దారులు విడుదల చేసే వ్యర్థాలు నీటిలో కలవడం వల్లనే విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముంగండ రక్షిత మంచినీటి పథకం ద్వారా అందుతున్న నీరు సైతం కలుషితమవుతోందని, అందువల్లే తాము రోగాలబారిన పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement