
రగులుతున్న సెగలు
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కోసం రగులుతున్న రాజకీయం తెలుగుదేశం పార్టీలో సెగలు రేపుతోంది. ఏకాభిప్రాయమంటున్న మంత్రులు
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కోసం రగులుతున్న రాజకీయం తెలుగుదేశం పార్టీలో సెగలు రేపుతోంది. ఏకాభిప్రాయమంటున్న మంత్రులు.. గ్రూపుల మధ్య అగ్గి రాజేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. పదవుల పందేరమంతా పారదర్శకమని అంటూనే ‘నా’ అనుకున్నవారిని అందలమెక్కించే తెరచాటు వ్యూహాలు పన్నుతూండడంపై పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం తెరతీస్తూండడంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ల కన్ను వాటిపై పడింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గిరీ చెప్పుకోదగ్గ ప్రొటోకాల్ ఉన్న పదవి. దీనిని అడ్డం పెట్టుకొని ముఖ్య నేతలు పార్టీలో హైడ్రామా సృష్టిస్తున్నారని మిగిలిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతల కోటాలో మెట్ట ప్రాంతం నుంచి ఎస్‌వీఎస్ అప్పలరాజు ఈ పదవిని ఆశిస్తున్నారు. గతంలో ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు, వివాదరహితుడు, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తగా ఆయనకు పేరుంది. ఈ అంశాలను తనకు సానుకూలంగా మలచుకోవాలన్నది ఆయన వ్యూహం. కాగా అదే సామాజికవర్గం నుంచి రాజోలు ప్రాంతానికి చెందిన ముదునూరి చినబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు భూపతిరాజు ఈశ్వరరాజువర్మ కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని క్షత్రియ సామాజికవర్గానికి కట్టబెట్టడం జిల్లాలో సంప్రదాయంగా వస్తోంది. ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగించాలన్న పార్టీ ప్రయత్నాలకు భిన్నంగా.. రెడ్డి సామాజికవర్గం నుంచి అర్తమూరుకు చెందిన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి కూడా రేసులోకి దిగారు. ఈ పదవిని కట్టబెట్టే విషయంలో మంత్రుల తీరు సందేహాస్పదంగా కనిపిస్తోందని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుల హామీ ఉండటంతో.. మలికిపురం మండలం లక్కవరానికి చెందిన ముదునూరి చినబాబుకు ఈ పదవి ఖాయమన్న ప్రచారం పార్టీలో బలంగా వినిపిస్తోంది. బెంగళూరుకు చెందిన ఎన్‌సీఎస్ గ్రూపు అండదండలు కూడా ఆయనకు ఉండటం అధిష్టానం నుంచి కలిసివచ్చే అంశంగా నేతలు విశ్లేషిస్తున్నారు.
ఇద్దరు మంత్రులూ మొదట్లో ఇచ్చిన హామీతో చినబాబు ధీమాగా ఉండగా, భూపతిరాజు ఈశ్వరరాజువర్మ పేరు హఠాత్తుగా తెరపైకి వచ్చింది. ఇది మంత్రుల పాత్ర లేకుండా జరిగిన పరిణామం కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భూపతిరాజును కావాలనే ఎగదోస్తున్నారనే అభిప్రాయం చినబాబు వర్గీయుల్లో బలంగా వినిపిస్తోంది. చినబాబుతో రాజకీయ వైరం ఉన్నందున రాజోలు నియోజకవకర్గ ఇన్‌ఛార్జి బత్తుల రాము.. పొరుగు గ్రామస్థుడు కావడంతో జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు వర్గీయులు.. భూపతిరాజుకు మద్దతు ఇస్తున్నారన్న ప్రచారం పార్టీలో నడుస్తోంది. ఇందుకు బలం చేకూర్చేలా జిల్లా పార్టీలో ముఖ్యమైన సమన్వయ కమిటీ సమావేశాన్ని మామిడికుదురు మండలం గోగన్నమఠంలోని భూపతిరాజు ఇంట్లో ఇటీవల వ్యూహాత్మకంగా నిర్వహించారని చెబుతున్నారు. ఈ సమావేశానికి యనమల హాజరవడం, అదే రోజు అంతర్వేదిలో ప్రారంభోత్సవాలకు వచ్చిన చినరాజప్ప గైర్హాజరవడం పార్టీలో చర్చనీయాంశమైంది.
ఆ సమావేశం సందర్భంగా పదవులపై నేతలంతా ఏకాభిప్రాయానికి రావాలని పేర్కొన్న యనమల.. భూపతిరాజు ఇంట్లో సమావేశానికి ఎలా అంగీకరించారని నేతలు ప్రశ్నిస్తున్నారు. చైర్మన్‌గిరీపై ముందు ఒక మాట.. వెనుక మరో ఆట.. అన్నట్టు మంత్రుల తీరు నడుస్తోందని వారు ఆక్షేపిస్తున్నారు. ముందు చినబాబుకు హామీ ఇవ్వడం, ఇప్పుడు భూపతిరాజు వెనుక ఉన్నట్టు సంకేతాలు ఇవ్వడం చూస్తే.. తమ మధ్య గ్రూపులు సృష్టించి అగ్గి రాజేస్తున్నట్టుగా ఉందని ద్వితీయ శ్రేణి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరితో పాటు నల్లమిల్లి వీర్రెడ్డికి కూడా ముఖ్యనేతలు భరోసా ఇచ్చారనే ప్రచారం పార్టీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది.