చంద్రబాబు వల్లే రాష్ట్రానికి అన్యాయం | Dharmana Prasada Rao fires on Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి అన్యాయం

Feb 12 2018 9:46 AM | Updated on May 29 2018 4:40 PM

Dharmana Prasada Rao fires on Chandrababu - Sakshi

కడియం: చంద్రబాబు నాయుడివల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పల్ల వెంకన్న నర్సరీలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలోని ప్రతిపక్షం, ప్రజా సంఘాలు, పౌరులు, వివిధ వర్గాలు చేసిన సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రం నష్టపోయిందన్నారు. ఆనాడు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొన్ని సూచనలు చేస్తే అనుభవం లేకుండా మాట్లాడుతున్నారని సీఎం హేళన చేశారన్నారు. బీజేపీతో టీడీపీ కలిసి ఉండడం ఇష్టం లేక ఆరోపణలు చేస్తున్నారని ప్రచారం చేసుకున్నారన్నారు. చివరికి ఇప్పుడు చంద్రబాబే అంగీకరిస్తున్నారు.

కేంద్రంతో ఘర్షణపడి ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన సమయంలో నోరు విప్పకుండా ఇప్పుడు పోరాడేస్తామని చెప్పడం డ్రామా కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చంద్రబాబు వల్ల జరిగిన నష్టానికి ఎవరిని బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. కేబినెట్‌ మంత్రుల ఆమోదం పొందాకనే బడ్జెట్‌ పార్లమెంట్‌కు వచ్చిందని, అప్పుడు నోరు మెదపకుండా కూర్చుని ఇప్పుడు టీడీపీ చేస్తున్నదంతా నటించడం కాక ఇంకేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకంటే సొంత రాజకీయ ప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారని దాని ప్రభావం రాష్ట్రంపై పడిందని ధర్మాన వివరించారు.

జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని రాష్ట్రం నిర్మిస్తుందని తీసుకోవడం, స్విస్‌ చాలెంజ్‌ వద్దని సుప్రీంకోర్టు చెబుతున్నా రాజధాని నిర్మాణం చేపట్టడం, టీడీపీ కార్యకర్తల కడుపు నింపేందుకే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను వినియోగించడం తదితర అన్ని అనైతిక కార్యక్రమాలను చంద్రబాబు చేయడం వల్ల కేంద్రం ముందు నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

తాను చేసిన తప్పును మరొకరి మీదకు నెట్టి మరోసారి చంద్రబాబు డ్రామా ఆడుతున్నారు. ఎన్నికలకు ఇంకా యేడాదిన్నర సమయం ఉన్నందున పొత్తులపై ఇప్పుడేమీ చెప్పలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కానీ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడే విధంగానే తమ పార్టీ వ్యవహరిస్తుందన్నారు. రూరల్‌ కోఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల వీర్రాజు (బాబు), రాష్ట్ర రైతు కార్యదర్శి చిక్కాల ఉమామహేశ్వరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అంతకు ముందు రైతులు ధర్మానకు ఘన స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement