తిరుమల కొండపై ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటలకు చంటిబిడ్డల తల్లిదండ్రులను అనుమతించే సుపథం క్యూలో తోపులాట చోటుచేసుకుంది.
సాక్షి, తిరుమల : తిరుమల కొండపై ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటలకు చంటిబిడ్డల తల్లిదండ్రులను అనుమతించే సుపథం క్యూలో తోపులాట చోటుచేసుకుంది. భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో ఈ పరిస్థితి ఎదురైంది. కిక్కిరిసిన క్యూలో చంటిబిడ్డల రోదనలు ఎక్కువయ్యాయి. కొందరు చిన్నారులు స్పృహ కోల్పోయారు. భక్తులను అదుపు చేసేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవటంతో ఈ పరిస్థితి ఎదురైంది. మూడురోజుల పాటు వరుస సెలవులు రావటంతో తిరుమలకొండపై భక్తులు కిటకిటలాడారు. ఆదివారం వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 62 వేల మంది దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం 26 గంటలుగా టీటీడీ ప్రకటించింది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడిచి వచ్చిన భక్తులు మరో 13 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 10 గంటల తర్వాత దర్శనం లభించనుంది.
భక్తుల రద్దీ పెరగడంతో రూ.300 టికెట్ల క్యూను మధ్యాహ్నం ఒంటిగంటకే నిలిపివేశారు. వీరికి దాదాపుగా 6 గంటల సమయం పడుతోంది. గదులు ఖాళీ లేకపోవడంతో కొన్నిచోట్ల గేట్లు మూసివేశారు. లాకర్ మంజూరు చేసే యాత్రిసదన్ వద్ద కూడా భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది. పెరిగిన భక్తుల రద్దీ వల్ల సాధారణ వీఐపీ దర్శనాలు సోమవారం కూడా రద్దు చేశారు. కాగా, అలిపిరి మీదుగా తిరుమలకు వచ్చే కాలిబాటలోని మోకాళ్ల పర్వతం వద్ద ఆదివారం రాత్రి 7.40 గంటలకు రెండు చిరుత పులులు హల్‌చల్ చేశాయి. తల్లీబిడ్డగా భావిస్తున్న ఈ పులులు అవ్వాచారికోన నుంచి రోడ్డు మీదుగా మరోవైపు దాటాయి. అదే సమయంలో సమూహంగా వెళుతున్న భక్తులు వాటని గుర్తించి పరుగులు తీశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది గుంపులుగా వెళ్లి శబ్దాలు చేయడంతో ఆ చిరుతలు దట్టమైన అడవిలోకి వెళ్లిపోయాయి.