రాజకీయాలకు కొత్త భాష్యం వైఎస్సార్‌

Devireddy Subrahmanyam Reddy Article On YS Rajasekhara Reddy - Sakshi

సందర్భం

జనం మెరుగైన జీవితాన్ని సాగించడానికి అవసరమైన పరిస్థితులను సృష్టించగలిగిన వాడే రాజకీయ నాయ కుడు. ఆ విధంగా పరిస్థి తుల్ని, వ్యక్తుల్ని, సమాజాన్ని పురోగమనం వైపు మార్చడంపై ఆలోచించి, ఆచరించిన దార్శనికుడు, ఉదారవాది, జనరంజక పాలకుడు, జనాకర్షక నాయకుడిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచి పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఆయనొక ధృవతార. దిశానిర్దేశం చేసిన తార. జన ఆకాంక్షలకు ఆయనొక ప్రతీక. జనం గుండెల్లో ఎన్నటికీ చెరపలేని ముద్ర ఆయనది. నమ్మకం ఆయన ఇంటిపేరయింది. సంక్షేమం ఆయన నిరంతరం ఆలోచించే ‘నిరుపేదల పేరు’ అయింది. 

ఆయన అనుకుంటే కాంగ్రెస్‌ మరణశయ్య నుంచి ఏపీలో లేచి కూచుంటుంది. ఆయన నవ్వుతూ చేయి ఊపితే గెలువలేని నేత కూడా గెలిచి కూర్చుంటాడు. ఆయన కృషితో కేంద్రంలోనే పార్టీ అధికారంలో కూర్చుంటుంది. ఆయన ఆదేశిస్తే జనం కోసం రిలయన్స్‌ వంటి బడాబాబులూ, మోన్‌శాంటో వంటి విత్తనాధిపతులూ మెడలు దించాల్సిందే.  ఒక్క బిడ్డయినా చదువుకోలేదంటే ఆయన కంట్లో కన్నీళ్లు కారతాయి. ఒక్క మనిషైనా వైద్యం పొందలేకుంటే ఆయన గుండె తరుక్కుపోతుంది. ఒక నోట్లో ముద్ద పడకున్నా ఆయన çహృదయం అల్లాడి పోతుంది. ఒక్క రైతు అప్పులతో సతమతమవుతున్నా ఆయన మనస్సు గిలగిలా కొట్టుకుంటుంది. ఒక్క రైతుకు సాగునీరు లేకున్నా, కరెంటు లేకున్నా, గిట్టుబాటుధర, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లేకున్నా ఆయన కుదురుగా కూర్చోలేడు. ఒక్క పేద మహిళకు పావలా వడ్డీకి రుణం అందకున్నా ఆయన ఆవేదన ఆపలేనిద వుతుంది.

పార్టీలకు అతీతంగా, ప్రభుత్వ పథకాల మేళ్లు ఓ ఒక్కరికి అందకున్నా ఆయన అధికారులను పరుగెత్తిస్తాడు. అది విద్యా సమస్యా, వైద్య సమస్యా, రైతు సంక్షేమమా, మహిళాభివృద్ధా, యువతకు ఉద్యోగ, ఉపాధులా, వృద్ధులు, దివ్యాం గులు, వితంతు పింఛన్లు వంటి అవసరాలా ఇంకేదైనానా అనే దాంట్లో తేడా ఉండదు. ఇక ఆయన ముస్లిం రిజర్వేషన్లు ఒక సంచలనం. ఆయన ప్రవేశ పెట్టిన ఎస్సీ, ఎస్టీ పథకాలు ఊహకందనివి. బీసీ సంక్షేమ కార్యక్రమాలు నిత్యనూతనాలు. అసలు ఆయన మేనిఫెస్టోనే తప్పనిసరిగా ‘చేసితీరే పట్టిక’. అది అన్నివర్గాల ప్రజలకూ మేలు చేసే రాజన్న శాసనం. అందుకే ఆయన్ని తప్పుగా ఒక్క మాటన్నా జనం చేతులు పైకి లేస్తాయి. ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమాల్ని చెరపాలనుకునేవాళ్లకు జనం రాజకీ యంగా బుద్ధి చెబుతారు. ఆయనంటేనే జనం పడి చస్తారు. అందుకే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది జనం కన్నుమూశారు. ఇది, ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన ఒకే ఒక్క అరుదైన సంఘటన. అందుకే, ఆయన పథకాల్ని నీరుగార్చి, ఆయన ప్రతిష్టను తగ్గించాలనుకొనే సీఎంలు కూడా వాటిని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రద్దు చేయలేకున్నారు. ఇంతటి మహానేత కావుననే జనం ఆయన్ను రాజన్న అని ముద్దుగా... వైఎస్సార్‌ అని గౌరవంగా  పిలుచుకొంటున్నారు. 

అసలు, జనం దృష్టిలో ఆయనొక ‘విరాట్‌ స్వరూపం, జగన్‌ ఆయన అంశం. ఇందుకు కారణం, భారతీయ సంస్కృతిలో ‘పదిమందికి మంచిపనులు చేసి, మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో, జనాన్ని నడిపిన వ్యక్తి ‘దేవుడు’గా పరిగణిస్తారు. ‘పదిమందికి’ చెడుపనులు చేసి, చెడు మాటలు చెప్పి చెడు మార్గంలో జనాల్ని నడిపిన వ్యక్తిని రాక్షసుడుగా పరిగణిస్తారు. అంటే మానవుల్లోని ఉన్నతమైన గుణాలకు ప్రాచీన మానవులు దైవస్థానం ఇచ్చారు. అలాంటి గుణాలు గల వారిని దైవం అన్నారు. అందుకే జనం గుండెల్లో ఇప్పటికీ వైఎస్సార్‌ దైవంగా నిలిచిపోయి ఉన్నాడు. ఆయన ‘ఆత్మ’ జగన్‌ రూపంలో, విజయ పథంలో నడిపిస్తోన్న పార్టీగా జనం ‘వైఎస్సార్‌సీపీ’ని భావిస్తున్నారు. అందుకే, ‘ఆత్మ’ లేని పార్టీగా కాంగ్రెస్‌ మిగిలిపోయింది. ‘సంక’కెత్తుకొన్న అన్ని పార్టీలనూ ‘చిదిమేసిన’ బాబు టీడీపీ కోసం ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అర్రులు చాస్తోంది. అంతో ఇంతో మిగిలివున్న కాంగ్రెస్‌ ఓటర్లేమో ఇందిరమ్మ ‘ఆత్మప్రబోధం’ బాటలో పయనించి వైఎస్సార్‌ ఆత్మ ఉన్న జగన్‌ పార్టీకే ఓటు వేయడానికి సిద్ధపడుతున్నారు.
(సెప్టెంబర్‌ 2న వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి)

వ్యాసకర్త : డా‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి,  విశ్రాంత ఆచార్యులు, చరిత్రశాఖ, ఎస్వీ యూనివర్సిటీ ‘ 98495 84324

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top