తగ్గని జ్వరాలు.. ఆగని మరణాలు

వేంపల్లెలో డెంగీతో వ్యక్తి మృతి   

పెరుగుతున్న రోగుల సంఖ్య

ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరత

తొండూరు : ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజల ప్రాణాలను బలి తీస్తోంది. జిల్లాలో జ్వరాలతో మరణాలు సంభవిస్తున్నా.. అధికార యంత్రాంగం చర్యలు చేపట్టలేదు. ఫలితంగా సోమవారం వేంపల్లెకు చెందినబాబు (38) అనే వ్యక్తి డెంగీ జ్వరంతో మృతి చెందాడు. అలాగే జిల్లాలో పలు చోట్ల డెంగీ, టైఫాయిడ్, మలేరియా తదితర జ్వరాలు సోకి కర్నూలు, ప్రొద్దుటూరు, తిరుపతి, కడప తదితర పట్టణాలలో చికిత్సలు పొందుతున్నారు.

ప్రభుత్వాసుపత్రులలో నామమాత్ర వైద్యం
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో జ్వరాలు విజృంభించాయి. జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.  ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా రోగులు వైద్యుల వద్ద క్యూలో బారులు తీరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా పారిశుధ్యం లోపించి మురుగు నీరు, చెత్త చెదారం ఎక్కడ చూసినా దర్శనమిస్తుండటంతో.. దోమలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జిల్లాలో ప్రభుత్వాసుపత్రులలో రోగులకు సరైన వైద్యం అందకపోవడంతోపాటు మందుల కొరత ఉండటం వల్ల చాలా మంది ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్‌ గున్యా తదితర విష జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల వైపు పరుగు తీస్తున్నారు. ప్రతి ఇంటిలో ఇద్దరు లేదా ముగ్గురికి చొప్పున జ్వరాలు సోకడంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చాలా చోట్ల వైద్యుల కొరత ఉండటంతో.. స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్ట్‌లు, అటెండర్లే వైద్యులుగా మారి తూతూమంత్రంగా రోగులకు చిక్సితలు చేస్తున్నారు. జమ్మలమడుగు, మైదుకూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, బ ద్వేలు, పులివెందుల తదితర మున్సి పాలిటీలలో పారిశుద్ధ్యం లోపించింది.

గ్రామీణ ప్రాంతాలలో చెత్త కుప్పలు, మురికి కుంటలు ఉన్నా వైద్యాధికారులు కానీ, పం చాయతీ కార్యదర్శులు కానీ, ఏఎన్‌ఎంలు కానీ పట్టించుకోకపోవడం.. గ్రామాల్లోకి చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారనే విమర్శలు ఉన్నాయి.

ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న బాధితులు
జిల్లా వ్యాప్తంగా వారం నుంచి రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేట్‌ ఆసుపత్రులలో కూడా ఓపీ సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులు వెళ్లినా అక్కడ సరైన వైద్యులు, మందులు అందుబాటులో లేకపోవడంతో ఒకట్రెండు రోజుల పాటు తూతూమంత్రంగా వైద్యం అందిస్తున్నారు. అక్కడ జ్వరం తగ్గకపోతే స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ, డాక్టర్ల వద్ద గానీ, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప తదితర పెద్దాసుపత్రులలోకి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్న వైనం  
జ్వరం వచ్చిందని రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే వేలాది రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తోంది. అక్కడ వైద్యులు రక్త పరీక్షలు అంటూ రిపోర్ట్‌లో రక్త కణాల సంఖ్య తగ్గితే వెంటనే వారు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, స్వైన్‌ఫ్లూ జ్వరం సోకిందని రకరకాల మందులు రాసిస్తున్నారు. జ్వరం వచ్చిందంటే ఆసుపత్రుల నుంచి ఇంటికి వెళ్లాలంటే రూ.10 వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.

పట్టించుకోని ఉన్నతాధికారులు
అధిక సంఖ్యలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట, పులివెందుల ప్రాంతాలలో డెంగీ కేసులు.. కడప, రాజంపేట, రైల్వేకోడూరులో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. గతంలో ప్రభుత్వాసుపత్రులలో డెంగీకి సంబంధించిన కిట్లు రోగులకు అందుబాటులో ఉంచే వారని.. ఈ ఏడాది పట్టించుకునే అధికారులే కరువయ్యారని రోగులు వాపోతున్నారు. ఈ విషయమై జిల్లా మలేరియా అధికారి త్యాగరాజ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. వర్షం పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో రాయచోటి ఏరియాలో అధిక సంఖ్యలో జ్వరాల బారిన పడ్డారని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top