అనుమతి లేని బోటులో రాష్ట్రపతి సతీమణి, కుమార్తె

The daughter and  wife of the president, in the unauthorized boat - Sakshi

అధికారుల ఏర్పాట్లపై విమర్శలు

భవానీపురం/సాక్షి, అమరావతి బ్యూరో/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): పవిత్ర సంగమం వద్ద ఇటీవల పడవ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన నేపథ్యంలో కృష్ణా నదిలో ప్రైవేట్‌ సంస్థలకు చెందిన బోట్లన్నింటినీ నిలిపివేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతిని బుధవారం పున్నమిఘాట్‌ నుంచి భవానీ ద్వీపానికి అనుమతి లేని ప్రైవేట్‌ బోటులో తీసుకురావడం గమనార్హం.

మూసివేసిన చాంపియన్‌ యాచ్ట్‌ క్లబ్‌కు చెందిన బోటులో వీరిని తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ బోటులో రాష్ట్రపతి భార్య, కుమార్తెను ఎండలో కూర్చోబెట్టారు. తిరుగు ప్రయాణంలో పర్యాటక శాఖకు చెందిన బోధిసిరి పడవలో తీసుకొచ్చారు. భవానీ ద్వీపానికి వెళ్లేటప్పుడు కూడా ఇదే బోటులో తీసుకెళితే బాగుండేది కదా అని సవితా కోవింద్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

దుర్గమ్మ సన్నిధిలో రాష్ట్రపతి సతీమణి
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి బుధవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో సూర్యకుమారి, ట్రస్టు బోర్డు చైర్మన్‌ గౌరంగబాబు, పాలక మండలి సభ్యులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. సవితాకోవింద్, స్వాతి అమ్మవారికి సహస్ర నామార్చన చేయించుకున్నారు. అనంతరం వారు భవానీ ద్వీపం చేరుకున్నారు. పున్నమిఘాట్‌ వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక పడవలో వారు కృష్ణానదిలో విహరించారు.

అంతకు ముందు స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 36వ జాతీయ గులాబీల ప్రదర్శనను, గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన కోలాటం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరిజన ధింసా నృత్యాన్ని తిలకించారు. భవానీ ద్వీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంగళగిరి పట్టు చీరల స్టాల్‌ను సందర్శించి వాటి నాణ్యత ప్రమాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లేపాక్షి స్టాల్‌ను సందర్శించి కొండపల్లి బొమ్మలను కొనుగోలు చేసి వాటి విశేషాలను తెలుసుకున్నారు. బందరు మిఠాయి స్టాల్‌ వద్ద బందరు లడ్డూ రుచులను ఆస్వాదించారు. ప్లోటింగ్‌ పౌంటేయిన్, మ్యూజికల్‌ లేజర్‌ షోను తిలకించారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం: అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రాజగోపురం నుంచి నడుస్తున్న సవితా కోవింద్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. రాజగోపురం లోపలకు ప్రవేశించేందుకు ఏర్పాటు చేసిన ఐరన్‌ ర్యాంప్‌ వద్ద సవితా కోవింద్‌ అదుపు తప్పి జారిపోగా, పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఆమెను పట్టుకున్నారు. ఆమె వెంట ఉన్న ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top