మత సామరస్యానికి ప్రతీక అయిన నేరేడుచర్ల మండలంలోని జాన్‌పహాడ్ దర్గా ఉర్సు నేటినుంచి మూడు రోజులపాటు జరగనుంది.
నేరేడుచర్ల, న్యూస్‌లైన్: మత సామరస్యానికి ప్రతీక అయిన నేరేడుచర్ల మండలంలోని జాన్‌పహాడ్ దర్గా ఉర్సు నేటినుంచి మూడు రోజులపాటు జరగనుంది. అందుకోసం దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉర్సుకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఉర్సులో భాగంగా గురువారం గుసుల్ షరీఫ్ నిర్వహిస్తారు. దర్గాలోని సైదులు బాబా సమాధులను గంధంతో, నూతన వస్త్రాలు (దట్టీలు), పూలదండలతో అలంకరిస్తారు. దర్గాలో కొవ్వొత్తులతో దీపాలు వెలి గించి బాబాకు నైవేద్యం సమర్పిస్తారు. 24వ తేదీన హైదరాబాద్‌లోని వక్ఫ్‌బోర్డు కార్యాలయం నుంచి పవిత్ర గంధాన్ని జాన్‌పహాడ్‌లోని సందల్‌ఖానాకు తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. పవిత్ర గంధాన్ని గుర్రంపై ఊరేగించడం ఇక్కడ అనవాయితీ.
ఉదయం 9:30గంటలకు పవిత్ర గంధాన్ని సందల్‌ఖానా నుండి గుర్రంపై జాన్‌పహాడ్ పురవీధులలో ఊరేగించి నమాజ్ చేసే సమయానికి దర్గాకు తీసుకువస్తారు. నమాజ్ పూర్తయిన అనంతరం గంధాన్ని బాబా సమాధులపైకి ఎక్కిస్తారు. అనంతరం దర్గాకు వచ్చిన భక్తులకు గం ధాన్ని పంచుతారు. ఈ పవిత్ర గంధాన్ని తాకడం వలన మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా పేద భక్తులకు వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తారు. 25వ తేదీన బాబా సమాధుల వద్ద దీపాలు వెలిగించి (చిరాగా) నైవేద్యం (ఫాతెహా) సమర్పిస్తారు. దింతో ఉర్సు ఉత్సవాలు ముగుస్తాయి.
ఉర్సుకు సర్వం సిద్ధం...
గురువారం నుండి మూడు రోజుల పాటు జరగనున్న జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు వక్ఫ్‌బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉర్సు సందర్భంగా భక్తులకు మంచినీటి సరఫరా చేయడానికి దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ట్యాంకర్లను సిద్ధం చేసింది. ఎస్‌బీహెచ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటుచేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో దర్గా సమీపంలో భక్తులకు సేవలందించడానికి స్టాళ్లు ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ సమస్య లేకుండా మిర్యాలగూడ డీఎస్‌పీ సుభాష్‌చంద్రబోసు హుజూర్‌నగర్ సీఐ పి. బలవంతయ్యల ఆధ్వర్యంలో ఏడుగురు సీఐలు, 27గురు ఎస్‌ఐలు, 27గురు ఏఎస్‌ఐలు, 150మంది పోలీసులు, 135మంది హోంగార్డులు, 21మంది మహిళా కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఉర్సుకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం దామరచర్ల రోడ్డుకు పెట్రోలు బంకు పక్కన, నేరేడుచర్ల రోడ్డుకు పెట్రోలు బంకు పక్కన స్థలాన్ని కేటాయించారు. మిర్యాలగూడ డిపో నుండి 25 ఆర్టీసీ బస్సులను దామరచర్ల మీదుగా జాన్‌పహాడ్‌కు.. కోదాడ నుండి నేరేడుచర్ల మీదుగా జాన్‌పహాడ్ దర్గాకు 25 బస్సులను నడుపుతున్నట్లు మిర్యాలగూడ డిపో మేనేజర్ గిరిష్‌కుమార్ తెలిపారు.