‘గోదావరి’లో క్షీణించిన క్షీరధార

‘గోదావరి’లో క్షీణించిన క్షీరధార - Sakshi


- డెయిరీని ముంచుతున్న లోపాల వెల్లువ

- పాడిరైతులకు లోపించిన సర్కారు సహకారం

- 9 వేల లీటర్లకు పడిపోయిన రోజువారీ పాలసేకరణ

- సిబ్బంది ఇష్టారాజ్యంతో మరోసారి మూతపడే ముప్పు

మండపేట :
జిల్లాలో గోదావరి డెయిరీలో పాలపొంగు చల్లారిపోతోంది. ప్రభుత్వం నుంచి రైతులకు సహకారం కొరవడుతోంది. ప్రైవేటుకు దీటుగా ప్రోత్సాహకాలు అందించకపోవడంతో రైతులు అటే మొగ్గడం వల్ల పాలసేకరణ దిగజారుతోంది. గతంలో రోజుకు 60 వేల లీటర్లకు పైబడి సేకరిస్తే ప్రస్తుతం తొమ్మిది వేల లీటర్లకు పడిపోయింది. జిల్లాలో మొత్తం పాలసేకరణలో ఇది కేవలం ఐదు శాతం మాత్రమే. ఉభయగోదావరి జిల్లాల్లో ఐదు దశాబ్దాల క్రితం పదివేల లీటర్ల పాలసేకరణతో ప్రారంభమైన గోదావరి డెయిరీ 1982 నాటికి లక్ష లీటర్ల సామర్థ్యానికి చేరుకుంది. నిర్వహణ లోపాలతో సిబ్బందికి జీతాలు, రైతులకు చెల్లింపులు చేయలేని స్థితిలో 1992లో డెయిరీ మూతపడింది. 1997లో తెరిచినప్పటికీ నిర్వహణ సరిగాలేక ఐదేళ్లకే మళ్లీ మూతపడింది.

 

జీవం పోసిన వైఎస్..

రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన ప్రభుత్వ రంగ డెయిరీల పునరుద్ధరణకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి క్షీరక్రాంతి పథకం ద్వారా 2007లో కృషి చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంయుక్తంగా ఉండే గోదావరి డెయిరీని రెండుగా విభజించారు. తూర్పులో గోదావరి డెయిరీ పునరుద్ధరణకు సుమారు రూ.20 కోట్లు విడుదల చేశారు. రైతులకు పాతబకాయిలు చెల్లించారు. పశుక్రాంతి పథకం ద్వారా మేలుజాతి పశువులను, పశుదాణా, దాణా తయారీ పరికరాలను సబ్సిడీపై అందించారు. మూడు మండలాలకు ఓ కేంద్రంగా సుమారు రూ.80 లక్షల చొప్పున వ్యయంతో 14 బల్క్ మిల్క్ సెంటర్ల (బీఎంసీ)ను ఏర్పాటు చేశారు.రైతులకు ప్రోత్సాహకాలు అందించడంలో గోదావరిని ముందుంచారు. రైతాంగానికే కాక డెయిరీ ద్వారా నిరుద్యోగులకు, మహిళా సమాఖ్యల వారికి ఉపాధి కల్పించారు. పది రోజులకే పాల బిల్లులు చెల్లించడం, పశువుల దాణా, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని సబ్సిడీపై అందజేయడం, ఉత్పత్తిదారులకు బీమా సౌకర్యం, మరెన్నో పథకాలు, ప్రోత్సాహకాలను వైఎస్ అమలుచేశారు.

 

ప్రోత్సాహకాలిస్తున్న ప్రైవేట్ డెయిరీలు

అధికారుల నిర్లక్ష్యానికి తోడు ప్రస్తుత పాలకుల సహకారం కొరవడి గోదావరి డెయిరీని తిరోగమనంలోకి మళ్లించాయి. జిల్లాలో గోదావరితో పాటు ప్రైవేటు డెయిరీలు కలిపి 10 వరకు ఉన్నాయి. రోజు వారీ పాలసేకరణ రెండు లక్షల లీటర్లు ఉండగా వీటిలో గోదావరి డెయిరీ కేవలం తొమ్మిది వేల లీటర్లు మాత్రమే సేకరించగలుగుతోంది. ప్రైవేటు డెయిరీలు లీటరుకు రూ.56.5 నుంచి రూ.57.5 వరకు చెల్లిస్తుండగా గోదావరి డెయిరీ సుమారు రూ.54 మాత్రమే చెల్లిస్తోంది.దీనికి తోడు ప్రైవేటు డెయిరీలు సబ్సిడీపై దాణాను, పాడిపశువుల కొనుగోలుకు 70 శాతం వరకు రుణసాయాన్ని నేరుగా అందిస్తున్నాయి. గోదావరి డెయిరీ కొద్దిమందికి మాత్రమే బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తోంది. ప్రైవేటు డెయిరీలతో పోలిస్తే సబ్సిడీపై అందించే దాణా అంతంత మాత్రంగానే ఉంటోందని రైతులు విమర్శిస్తున్నారు. ప్రైవేటు డెయిరీలు ఉద్యోగులకు లక్ష్యాలను నిర్దేశించి పాలు సేకరిస్తుంటే ఈ విధానం గోదావరి డెయిరీలో లోపించింది. పర్యవేక్షణ లేక ఉద్యోగుల ఇష్టారాజ్యంగా మారిందన్న విమర్శలున్నాయి.గతంలో జిల్లావ్యాప్తంగా సుమారు 622 కలెక్షన్ పాయింట్లు ఉంటే ప్రస్తుతం 280కు తగ్గిపోయాయి. వీటి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కొందరు సిబ్బంది డెయిరీ ఆస్తులను స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బీఎంసీల్లో సుమారు 60 వేల లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్నా లక్షాన్ని చేరుకోలేక పోవడంతో నిర్వహణ భారమవుతోంది. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే డెయిరీ మళ్లీ మూతపడే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా రైతులకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా డెయిరీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top