హోం అబ్జర్వేషన్‌!

COVID 19 Tests in Gannavaram Airport Krishna - Sakshi

జిల్లాకు విదేశాల నుంచి 620 మంది రాక  

వారిపై 14 రోజుల పాటుపర్యవేక్షణ  

అప్పటిదాకా ఇళ్లకే పరిమితం చేస్తున్న అధికారులు

కరోనాపై మరింత అప్రమత్తమైన యంత్రాంగం

సాక్షి, అమరావతి బ్యూరో: కంపరం పుట్టిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని జనంలోకి వెళ్లకుండా పరిశీలనలో ఉంచుతోంది. కరోనా వైరస్‌ వెలుగు చూసినప్పట్నుంచి ఇప్పటి వరకు ఇతర దేశాల నుంచి 620 మంది జిల్లాకు వచ్చారు. వీరిలో జర్మనీ, అమెరికా, ఇటలీ, గల్ఫ్, యూరప్‌ దేశాల నుంచి వచ్చిన వారున్నారు. వీరికి కరోనా వైరస్‌ లక్షణాలు లేకపోయినా వైద్యారోగ్యశాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా వారిని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. వీరి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు వైద్యారోగ్య సిబ్బంది ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అందుకోసం ప్రాథమికంగా 14 రోజుల పాటు వారిని తమ అబ్జర్వేషన్‌లో ఉంచుతున్నారు. వైరస్‌ లక్షణాలు లేవని నిర్ధారించకున్నాక బయటకు వెళ్లేందుకు వారిని అనుమతిస్తున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు గన్నవరం విమానాశ్రయంలోనూ ఇతర దేశాల నుంచి జిల్లాకు వస్తున్న వారి ఆరోగ్య స్థితిని పరీక్షించేందుకు ఫిబ్రవరి ఒకటి నుంచి స్క్రీనింగ్‌లు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా ప్రత్యేక వైద్య బృందాలను నియమించారు. మరో వైపు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డులతో పాటు త్వరలో ప్రారంభించనున్న సూపర్‌ స్పెషాలిటీ బ్లాకులో రెండు ఐసీయూలను సిద్ధం చేశారు. అక్కడ 22 పడకలను ఏర్పాటు చేశారు. అంతేకాదు 50 వెంటిలేటర్లను అందుబాటులో ఉంచారు. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచారు.

కరోనాపై ఆందోళన వద్దు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కరోనా వైరస్‌ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ అన్నారు. జిల్లాలో కరోనా(కోవిద్‌ 19) వ్యాధి నియంత్రణకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే వైరల్‌ ల్యాబ్‌తోపాటు, అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటుచేసిన ఐసీయూలను ఆదివారం ఆయన పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వ్యాధిని ప్రాథమిక దశలో నిర్ధారణకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా ఆర్‌టీపీసీఆర్‌ యంత్రాన్ని నెలకొల్పినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా వ్యాధి అనుమానితులుగా గుర్తించిన తూర్పుగోదావరిజిల్లాకు చెందిన ఐదుగురు, ఏలూరుకు చెందిన ఒకరి రక్తనమూనాలు ఈ కేంద్రానికి అందినట్లు తెలిపారు. వీరి రక్తనమూనాలను పరీక్షించి పూణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపడం జరిగిందన్నారు. ఈ యంత్రం ద్వారా మొదటి 10 శాంపిల్స్‌ పరీక్షించి , వారి వివరాలను పూణేకు పంపుతారని, ఆ పరీక్షల్లో ఖచ్చితత్వాన్ని పరిశీలించిన అనంతరం ఇక్కడ నుంచే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి రిపోర్టులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యాధి నిర్ధారణలో జాప్యం లేకుండా వ్యాధి సోకిన వారికి వెంటనే చికిత్స అందించి ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. కరోనా వైద్య నిర్ధారణ అనుమతి అందిన వెంటనే పరీక్షలు వేగవంతం చేయడం జరుగుతుందన్నారు. కరోనా వైరస్‌ వ్యాధి, నివారణ అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ప్రజలు కూడా శారీరక, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పోతురాజు నాంచారయ్య, మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్‌ లక్ష్మీకుమారి, డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ టీయస్‌ఆర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): కరోనా వ్యాధిపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని  ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పిడియాట్రిక్స్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ అన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం పిల్లలపై అధికంగా చూపే అవకాశం ఉండటంతో పిల్లల వైద్యులు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగించేందుకు భారత పిల్లల వైద్యుల సమాఖ్య ఏపీ చాప్టర్, కృష్ణాజిల్లా చాప్టర్, భారత నవజాత శిశువుల వైద్యుల సమాఖ్యల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఏజీ రోడ్డులోని ఓ హోటల్‌లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ మొదటిగా కరోనా వైరస్‌ గత ఏడాది డిసెంబరు 31న చైనా వెలుగు చూసిందని, ఇప్పటికీ 1.28 లక్షల మంది ప్రపంచంలోని 114 దేశాల్లో ఈ వైరస్‌ బారిన పడినట్లు తెలిపారు. వారిలో 93 శాతం మంది ఇటలీ, చైనా, ఇరాన్, దక్షిణకొరియా దేశాలకు చెందిన వారే ఉన్నట్లు పేర్కొన్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారికి పరీక్ష చేయడం, వారితో దగ్గరగా ఉన్న వారిని గుర్తించడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమైనవన్నారు. వైరస్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు స్కూల్స్, కళాశాలలు మూసివేయడం కూడా అవసరాన్ని బట్టి చేయాల్సి ఉంటుందని చెప్పారు. నేషనల్‌ నియోనాట్‌ ఫోరం ఏపీ సెక్రటరీ డాక్టర్‌ పీవీ రామారావు మాట్లాడుతూ పిల్లలు వారికి వారుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం, వైరస్‌ వ్యాప్తి చెందకుండా స్కూల్‌ భవనాలు శుభ్రపరచడం, పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు ఉంటే ఇంటి దగ్గరే ఉండి వైద్య సలహా తీసుకోవడం, దగ్గడం, తుమ్మినప్పుడు టిష్యూ కానీ, రుమాలు కాని ఉపయోగించడం చేయాలని కోరారు. సరైన జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చునని సూచించారు.  సమావేశంలో ఐఏపీ ప్రతినిధులు డాక్టర్‌ పరుచూరి అనిల్‌కుమార్, డాక్టర్‌ ఆర్‌. వెంకటేశ్వరరావు, డాక్టర్‌ సూర్యనారాయణ, మల్లికార్జునరావు పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్టులో అప్రమత్తం
విమానాశ్రయం(గన్నవరం): దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా గన్నవరం విమానాశ్రయంలో కరోనా వైరస్‌ పరీక్షలు విస్తృతం చేశారు. ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో దేశ, విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను క్షుణంగా పరీక్షిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు బృందాలుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది థర్మోస్కానింగ్‌ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ప్రయాణికులకు కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వైద్య సిబ్బంది వివరిస్తున్నారు. ఇప్పటి వరకు 72 మంది వైద్య పరీక్షలు జరిపినట్లు హెల్త్‌ సూపర్‌వైజర్‌ డి.సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఇటీవల జర్మనీ నుండి వచ్చిన విద్యార్థికీ కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయనే అనుమానం మేరకు టెస్టులు నిర్వహించగా నెగిటివ్‌గా తేలినట్లు చెప్పారు. వైద్య శిబిరంలో ఎంపీహెచ్‌ఈఓ గోపాలరావు, హెల్త్‌ ఎడ్యుకేటర్లు రామలక్ష్మి, కుమారి  పాల్గొన్నారు.

అసత్య ప్రచారాలు నమ్మవద్దు
కరోనా వైరస్‌పై జిల్లా వాసులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ వైరస్‌పై వస్తున్న అసత్య ప్రచారాలనూ నమ్మొద్దు. సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో కరోనా వైరస్‌పై అవాస్తవాలను పోస్టు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వివిధ దేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని ముందుజాగ్రత్త చర్యగా 14 రోజుల పాటు వారిళ్లకే పరిమితం చేస్తున్నాం. వారిని వైద్యారోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచుతున్నాం. వీరికి కరోనా వైరస్‌ లక్షణాలు లేవని నిర్ధారించు కున్నాక బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నాం.  –టి.శ్రీరామచంద్రమూర్తి,డీఎంహెచ్‌ఓ, కృష్ణా జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top