క్షమించండి!

couple commit suicide in prakasam district - Sakshi

 ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య 

 పిల్లలు కలగలేదని కొంతకాలంగా మనస్తాపం 

 క్షమించండంటూ మృతదేహాల వద్ద సూసైడ్‌ నోట్‌  

 సంఘటన స్థలాన్ని పరిశీలించిన చీరాల పోలీసులు

ఆ దంపతులు అన్యోన్యంగా ఉండేవారు. స్థానికులతో కలిసిమెలిసి ఆనందంగా గడిపేవారు. వృద్ధ తల్లిదండ్రులను అపురూపంగా చూసుకునేవారు. తినేందుకు తిండి.. కట్టుకునేందుకు బట్ట, ఉండేందుకు ఇల్లు అన్నీ పుష్కలంగానే ఉన్నాయి. వివాహమై 18 ఏళ్లయినా పిల్లలు కలగలేదు. ఇదే వారి బాధ. పిల్లల కోసం ఎంతో కాలంగా వేచి చూశారు.  ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. అనేక రకాల మందులూ వాడారు. చివరకు ఆమె నాలుగు నెలల క్రితం గర్భం దాల్చింది. నాలుగో నెలలో గర్భస్రావమైంది. దంపతులు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఏం చేయాలో అర్థంగాక జీవితంపై విరక్తి పెంచుకున్నారు. తమను క్షమించండంటూ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పోలీసులకు రూ.10ల స్టాంపు పేపర్‌పై సూసైడ్‌నోటు రాసి ఇద్దరూ సంతకాలు చేశారు. తెల్ల వస్త్రాలు ధరించి ఉరేసుకుని తనువు చాలించారు. ఈ హృదయ విదారక సంఘటన శనివారం ఉదయం చీరాలలో వెలుగు చూసింది. 

చీరాల రూరల్‌:  చీరాల పాత ప్రసాద్‌ థియేటర్‌ సమీపం శ్రీనివాస నగర్‌కు చెందిన పాలువాది శ్రీనివాసమూర్తి (45), నాగమణి (40)లకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాసమూర్తి పట్టణంలోని ప్రముఖ కంటి ఆస్పత్రిలో మెడికల్‌ షాపు నిర్వహిస్తుంటాడు. భార్య ఇంటి వద్దే ఉంటూ ఇంటి పనులతో పాటు అత్తమామలకు సేవలు చేస్తుంటుంది. 

ఇంతలో శ్రీనివాసమూర్తి తండ్రి రిటైర్డు ఉపాధ్యాయుడు చెంచయ్య ఆరు నెలల క్రితం మృతి చెందాడు. దీనికి తోడు శ్రీనివాసమూర్తి దంపతులకు వివాహమై 18 ఏళ్లు దాటినా    పిల్లలు కలగకపోవడంతో కలత చెందారు. జీవితంపై విరక్తి చెందిన ఇద్దరూ తెల్ల దుస్తులు ధరించి ఇంట్లోనే ఎదురెదురుగా ఉరేసుకుని బలవన్మరణం పొందారు. 

తల్లికి సపర్యలు చేసి..
శ్రీనివాసమూర్తి దంపతులు శుక్రవారం రాత్రి భోజనం చేశారు. అనంతరం తల్లికి కూడా అన్నం పెట్టారు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి పడుకున్నారు. తనకు అనారోగ్యంగా ఉందంటూ శ్రీనివాసమూర్తి తల్లి పార్వతమ్మ రాత్రి 11 గంటలకు కొడుకు, కోడలిని నిద్రలేపింది. ఆమెకు సపర్యలు చేసి ట్యాబ్లెట్‌ వేసి పడుకోబెట్టారు. అనంతరం వారు కూడా నిద్రకు ఉపక్రమించారు. 
ఉదయం 8 గంటలైనా కొడుకు, కోడలు నిద్ర లేవకపోవడంతో పార్వతమ్మ వెళ్లి తలుపులు తట్టింది. ఎంతకూ తలుపులు తెరచుకోకపోవడంతో ఇద్దరి సెల్‌లకు ఫోన్‌ చేసింది. ఎటువంటి సమాధానం రాలేదు.

 ఆందోళన చెందిన ఆ వృద్ధురాలు సమీపంలో నివాసం ఉండే తన రెండో కుమారుడు వెంకట సుబ్బారావు ఇంటికి వెళ్లి విషయాన్ని కోడలికి చెప్పింది. ఇద్దరూ హుటాహుటిన వచ్చి మళ్లీ తలుపులు గట్టిగా తట్టారు. అయినా తలుపులు తెరచుకోకపోవడంతో బెడ్‌రూమ్‌ తలుపులు పగలగొట్టి లోపలకు చూశారు.  దంపతులు వేర్వేరుగా ఉరేసుకుని విగత జీవులుగా కనిపించారు. భోరున విలపించి చుట్టుపక్కల వారిని పిలిచారు. వారి కేకలు విన్న స్థానికులు సంఘటన స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒంగోలులో నివాసం ఉండే మృతుడు అన్నయ్య వెంకటేశ్వర్లుకు కూడా సమాచారం అందించారు. ఒన్‌టౌన్‌ సీఐ వి.సూర్యనారాయణ సంఘటన  స్థలానికి చేరుకుని మృతుల బంధువుల వద్ద పూర్తి వివరాలు సేకరించారు. 

సూసైడ్‌ నోట్‌ గుర్తింపు
సీఐ సూర్యనారాయణ ఆధారాల కోసం చట్టుపక్కల గాలించడంతో ఓ సూసైడ్‌ నోట్‌ ఆయన కంట పడింది. అందరినీ వదిలి వెళ్తున్నందుకు మమ్మల్ని క్షమించండి.. ఇందులో ఎవరి ప్రమేయం లేదంటూ రూ.10ల స్టాంప్‌ పేపర్‌పై దంపతులు సంతకాలు చేసి ఉన్నారు. సీఐ పేరుతో రాసిన ఆ సూసైడ్‌నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top