
కొమరవోలు(పామర్రు): లైంగిక వేధింపులను తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణాజిల్లా పామర్రు మండలం, కొమరవోలులో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మేడపాటి ప్రవీణ్ రాజు, వసంత(24)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు చిన్నారులు. వీరి ఇంటికి సమీపంలో ఉన్న మెరుగుమాల పవన్ రోజూ వసంతను అసభ్య పదజాలంతో ఇబ్బంది పెడుతూ.. రెండు రోజుల నుంచి లైంగికంగా కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది.
ఆమెను భర్త హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందింది. శనివారం రాత్రి బాధితురాలి వద్ద పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు. తనను పవన్ నిత్యం లైంగికంగా వేధించడం వల్లే విషద్రావణం తాగానని చెప్పిందని పామర్రు ఎస్‌ఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, మృతదేహాన్ని పామర్రు–గుడివాడ జాతీయ రహదారిపై ఉంచి కుటుంబీకులు శనివారం రాస్తారోకో చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.