తస్మాత్‌ జాగ్రత్త | Couple Cheats Village People In East Godavari | Sakshi
Sakshi News home page

తస్మాత్‌ జాగ్రత్త

Nov 27 2018 1:13 PM | Updated on Nov 27 2018 1:13 PM

Couple Cheats Village People In East Godavari - Sakshi

గిరిజన మహిళకు అంటకట్టిన రోల్డ్‌గోల్డ్‌ ఆభరణం అమాయకులను బంగారం పేరుతో మోసం చేస్తున్న దంపతులు

నిన్న శంఖవరం, నేడు ఎటపాక మండలంలోని కుసుమనపల్లి గ్రామం.. మోసానికి వస్తువు ఒక్కటే... విధానమే మారింది. ఒకచోట అమాయకులైన గిరిజనుల నుంచి బంగారం పట్టుకుపోతే... మరో చోట నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.70 వేలతో ఉడాయించారు. శంఖవరం గ్రామానికి చెందిన ఓ ఇంటికి ఈ నెల 22వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి సాధువు వేషంలో వచ్చి మాయ మాటలు చెప్పి సుమారు 5 తులాల బంగారు నగలు పట్టుకొని పారిపోయాడు. మా దగ్గర ఓ బంగారు వస్తువు ఉంది... ఇది ఉంచుకొని మాకు కొంత డబ్బు ఇవ్వండి అంటూ కుసుమనపల్లి గ్రామానికి చెందిన ఓ గిరిజన కుటుంబాన్ని బుట్టలో వేసుకొనిరూ.70 వేల నగదుతో మోసగాళ్లు పరారయ్యారు.

తూర్పుగోదావరి, నెల్లిపాక(రంపచోడవరం): సుమారు 40 ఏళ్ల వయసున్న భార్యా, భర్తలు ఈ నెల మొదటి వారంలో ఎటపాక మండలంలోని కుసుమనపల్లి గ్రామానికి వచ్చి ఓ చర్చి వద్ద మకాం పెట్టారు. చీరలు, నైటీలు అమ్ముతామని వాయిదాల పద్ధతిపై డబ్బులు ఇస్తే చాలంటూ గ్రామంలోని పలువురి మహిళలకు విక్రయించారు. ఈ విధంగా వారు వారం రోజులకు పైగా గ్రామంలో ఉన్నారు. ఈ క్రమంలో ఓ కుటుంబంతో అతి సన్నిహితంగా, ఎంతో ఆప్యాయంగా ఉన్నట్లు మెలిగారు. మీది మాది ఒకే మతం అంటూ నమ్మబలికి వారి ఇంట్లో తిరుగుతూ గ్రామంలోని అందరితో కలిసిమెలిసి ఉన్నట్లు నటించారు.

వారి ప్లాన్‌ ఇలా..
మా దగ్గర ఓ బంగారు వస్తువు ఉంది.. మీకు నచ్చితే అది మీదగ్గర ఉంచుకుని మాకు వ్యాపార నిమిత్తం కొంత డబ్బులు ఇవ్వండి అంటూ వారి వద్ద ఉన్న నిజమైన బంగారు ఆభరణాన్ని ఇంటి మహిళకు చూపి ఆశ చూపుతారు. ఇంత బంగారం మీకెక్కడిది అని అడిగితే... మాది విజయవాడ దగ్గర ఓ గ్రామం గతంలో కృష్ణా నదికి వచ్చిన వరదలకు ఓ బ్యాగ్‌ దొరికింది. దానిలో బంగారు వస్తువులు ఉన్నాయని చెబుతారు. అయితే వారి వద్ద ఉన్న మరో బంగారు వడ్డాణం కూడా చూపి వారి మాటలు నిజమేనని నమ్మేలా చేస్తారు. మీకు ఇచ్చే బంగారు వస్తువు నిజమైనదో కాదో పరీక్షించుకున్న తరువాతే మాకు డబ్బులు ఇవ్వండని మాయలేడీ∙చెపుతుంది.

మోసం చేసే తీరు ఇలా...
సుమారు ఆరు కాసుల బంగారు ఆభరణం నుంచి ఓ చిన్న ముక్కను కత్తిరించి ఇస్తారు. ఇది నిజమైన బంగారమే కాదో పరీక్షించుకోమంటారు. అయితే వారు చూపించిన బంగారు ఆభరణం పోలిన నకిలీది కూడా వారి వద్ద ఉంటుంది. కత్తిరించి ఇచ్చిన ముక్క నిజమైన బంగారం అని నిర్ధారణ చేసుకున్న ఆ కుటుంబాన్ని నగదు కావాలని అడుగుతారు. వారు నమ్మి అదేమాదిరి ఉన్న నకిలీ బంగారాన్ని అంటగట్టి ఉడాయిస్తారు. అయితే నిజమైన బంగారు ఆభరణం నుంచి ఎక్కడైతే ముక్క కత్తిరించారో అలాగే రోల్డ్‌గోల్డ్‌ ఆభరణంలో కూడా ముక్క కత్తిరించి ఉంచుతారు. తమకు ముందుగా చూపింది, ఇప్పుడు ఇచ్చింది ఒకటే అనే విధంగా నమ్మించి నట్టేటముంచుతారు. డబ్బులు తీసుకున్న తరువాత అక్కడ నుంచి మకాం మర్చేస్తారు.

మోసం బయట పడింది ఇలా...
కుసుమనపల్లి గ్రామంలో ఈ కిలాడీ దంపతుల చేతుల్లో మోసపోయిన గిరిజన మహిళ తెలిపిన వివరాలు...మమ్మల్ని రూ.లక్ష కావాలని అడిగారు. బంగారు వస్తువు ఉంది కదా అని ముందుగా రూ.70 వేలు ఇచ్చాం. ముందు మాకు చూపించిన వస్తువే కదా అని వారిచ్చిన ఆభరణం తీసుకుని దాచుకున్నాం. వారు గత శనివారం గ్రామం నుంచి వెళ్లిన తరువాత మూడు రోజులైనా రాకపోవటంతో అనుమానం వచ్చింది. మా దగ్గర ఉన్న వస్తువును భద్రాచలం తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది నకిలీదని తేలింది. వారు ముందుగా మాకు ఇచ్చిన ముక్క నిజమైన బంగారమే కాని ఇలా మోసపో యామంటూ లబోదిబోమన్నారు. ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మోసం చేసిన వారు తమ పేర్లు దేవి, సురేష్‌ అని చెప్పారని గ్రామస్తులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement