‘కలెక్టరేట్ కంత్రీల’పై విచారణ కంచికేనా? | Corruption sand funds in Kakinada | Sakshi
Sakshi News home page

‘కలెక్టరేట్ కంత్రీల’పై విచారణ కంచికేనా?

May 7 2015 1:20 AM | Updated on Sep 22 2018 8:31 PM

ఇసుక సీనరేజి నిధుల గోల్‌మాల్, కోట్లాది రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీల్లో మాయాజాలం, చిన్న మొత్తాల పొదుపు సొమ్ములు స్వాహా

రూ.కోట్ల అవినీతి జరిగినట్టు నిర్ధారణ
     ఏళ్లు గడుస్తున్నా చర్యలు కరువు
 
 కాకినాడ సిటీ : ఇసుక సీనరేజి నిధుల గోల్‌మాల్, కోట్లాది రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీల్లో మాయాజాలం, చిన్న మొత్తాల పొదుపు సొమ్ములు స్వాహా.. ఇలా జిల్లాలో పరిపాలనకు కేంద్రమైన కలెక్టరేట్‌లో వెలుగు చూసిన అవినీతి వ్యవహారాలపై విచారణ ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా తయారైంది. మొదట్లో సీనరేజి నిధులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల అక్రమాల కేసు సీఐడీ వరకు వెళ్లి నిలిచిపోయింది. తర్వాత 2012 నవంబర్‌లో కలెక్టరేట్‌లోని చిన్నమొత్తాల పొదుపు సంస్థలో ఏజెంట్ల పారితోషికం నిధుల్లో రూ.13 లక్షల స్వాహాకు యత్నించిన ఘటనతో వెలుగులోకి వచ్చిన అవినీతి బాగోతంపై విచారణ రెండున్నరేళ్లు కావస్తున్నా ముందుకు సాగని పరిస్థితి.
 
  దీనిపై పూర్తిస్థాయి విచారణాధికారిగా అప్పటి జాయింట్ కలెక్టర్ అహ్మద్‌బాబును గత కలెక్టర్ నీతూప్రసాద్ నియమించారు. ఆయన చిన్నమొత్తాల విభాగంలోని రికార్డులతోపాటు సంబంధిత బ్యాంక్‌శాఖ అకౌంట్లు, పోస్టల్‌శాఖ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన సందర్భంలో పొదుపు ఏజెంట్లకు చెల్లించాల్సిన పారితోషికం కంటే ఎక్కువ క్లెయిమ్ చేయడం, పోస్టుమాస్టర్ సిఫార్సు లేకుండా ఏజెంట్ల క్లెయిమ్‌ల మంజూరు, ఏజెంట్లకు తెలియకుండా వారి పేరున పారితోషికం క్లెయిమ్‌ల మంజూరు, పోస్టుమాస్టర్ల సంతకాల ఫోర్జరీ వంటి అక్రమాలు విచారణలో వెలుగు చూశాయి.
 
  చిన్నమొత్తాల పొదుపు విభాగంలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిన వైనం బయటపడింది. 2000  నుంచి 2012 వరకు ఈ విభాగంలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు తేలడంతో పాటు అవినీతి రూ.20 కోట్లు ఉంటుందని  విచారణలో నిర్ధారించినట్టు సమాచారం. అవినీతి ఎక్కువగా ఉండటంతో మరింత లోతుగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సీబీఐకి అప్పగించాలని సూచిస్తూ అప్పటి కలెక్టర్‌కు విచారణ నివేదికను అందజేయడంతోపాటు అక్రమాలకు బాధ్యులైన ఆరుగురు  రెవెన్యూ అధికారులు, 19 మంది పోస్టల్ ఏజెంట్లపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసినట్టు సమాచారం.
 
 అయితే విచారణ జరిపిన అప్పటి జేసీ బదిలీ కావడంతో చిన్నమొత్తాల అవినీతి ఫైల్ మూలన పడింది. మరోపక్క విచారణ నివేదికను తొక్కిపెట్టి అక్రమార్కులకు అండగా అప్పటి కలెక్టర్ నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా మొన్న.. ఇసుక సీనరేజ్ నిధుల గోల్‌మాల్, కోట్లాది రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీల్లో మాయాజాలం, నిన్న.. చిన్నమొత్తాల పొదుపు అవినీతికి నిలయంగా నిలిచిన కలెక్టరేట్‌లో అక్రమాలపై ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునేవారు కరువవడమే కాక ఏ ఒక్కరిపైనా చర్యలు లేకపోవడంతో అక్రమార్కులకు కలెక్టరేట్ అడ్డాగా మారుతోందన్న భావన బలపడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement