ఏడాది ఎన్‌డీఏ పాలనలో కేంద్రంలో రాజకీయ అవినీతి పూర్తిగా అంతమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ
భీమవరం (కాళ్ల) :ఏడాది ఎన్‌డీఏ పాలనలో కేంద్రంలో రాజకీయ అవినీతి పూర్తిగా అంతమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భీమవరంలో మంగళవారం ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసవర్మ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయూంలో పలు కుంభకోణాలు వెలుగులోకి రాగా, మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాజకీయ అవినీతి అంతమైందన్నారు. మోదీ పథకాలు చరిత్రలో నిలచిపోతాయన్నారు. ఎన్‌డీఏ పాలనలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ మోదీ పాలనను దేశంలోని అత్యధిక జనం ఆమోదిస్తున్నారన్నారు. నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, అల్లూరి సాయిదుర్గరాజు పాల్గొన్నారు. ఏలూరులో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా బీజేపీ సమావేశం నిర్వహించనున్నట్టు శ్రీనివాసవర్మ తెలిపారు. నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.