నాణ్యత చెల్లు.. అవినీతి ఫుల్లు | Corruption In Double Ciment Road Works PSR Nellore | Sakshi
Sakshi News home page

నాణ్యత చెల్లు.. అవినీతి ఫుల్లు

Jun 23 2018 1:34 PM | Updated on Jun 23 2018 1:34 PM

Corruption In Double Ciment Road Works PSR Nellore - Sakshi

నాసిరకం కంకరతో వేసిన రోడ్డు దుస్థితి ,బాగున్న రోడ్డును జేసీబీతో తవ్వి అక్కడే వేస్తున్న దృశ్యం

రహదారులు ప్రగతికి చిహ్నాలు. అలాంటి డబుల్‌ రోడ్డు నిర్మాణం కాంట్రాక్టర్ల కక్కుర్తి..అధికారుల అవినీతికి చిహ్నంగా నిలవబోతోంది. బాగున్న రోడ్డు స్థానంలో కొత్తగా రోడ్డు నిర్మాణాలు చేపడుతూ ఇటు కాంట్రాక్టర్లు, అటు అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. రోడ్డు నిర్మాణంలో నిబంధనలు పాటించడం లేదు. ఒక పక్క నిర్మిస్తుంటే.. మరో పక్క రోడ్డు దుస్థితికి అద్దం పడుతోంది.

చిట్టమూరు:  ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. క్వాలిటీ కంట్రోల్‌ శాఖ తనిఖీలు లేవు. ఇంకేముంది.. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన రోడ్డు నిర్మాణంలో నాణ్యత డొల్లతనం.. అవినీతి మయం కనిస్తోంది. ఏడాది క్రితం నాయుడుపేట నుంచి చిట్టమూరు మండలంలోని కోగిలి సోమసముద్రం వరకు  డబుల్‌ రోడ్డు నిర్మాణం పనులు మంజూరయ్యాయి. రూ. 28.45 కోట్ల అంచనాల పనులు కాంట్రాక్టర్లు  దక్కించుకున్నారు. ఈ పనులను రెండు భాగాలుగా అధికారులు విభజించి ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించారు. సుమారు 21 కిలో మీటర్లు డబుల్‌ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్డు పనుల్లో భాగంగా ఎల్లసిరి వద్ద సిమెంట్‌ రోడ్డు నిర్మించారు. కొత్తగుంట వద్ద సిమెంట్‌ రోడ్డు వేయాల్సి ఉంది. అయితే నాయుడుపేట నుంచి ఎల్లసిరి వరకు తారు రోడ్డు పనులు కొంత భాగం పూర్తి చేశారు. ఈ పనులను నాయుడుపేట, కోట సబ్‌ డివిజన్‌ అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. 

పనుల్లో కనిపించని నాణ్యత
ఇప్పటి వరకు చేపట్టిన పనుల్లో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించిన దాఖలాలు లేవు. ఎల్లసిరి, బయ్యవారికండ్రిగ గ్రామాల వద్ద వేసిన రోడ్డు పనుల్లో అప్పుడే తారు లేచిన  దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్‌ తోలి బర్మ్‌లను పూర్తి చేయాల్సి ఉండగా రోడ్డు పక్కన ఉన్న బురదమట్టిని జేసీబీలతో తీసి రోడ్డుకు ఇరువైపులా నింపారు. వర్షం వస్తే రోడ్డు ఇరువైపులా ఉన్న మట్టి కరిగి పోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. పనుల జరిగే సమయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు లేకపోవడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిబంధనలు ఏవీ!
రోడ్డు పనుల్లో నిబంధనలు పాటించడం లేదు. అయితే ఈ రోడ్డు పనుల్లో వాడే కంకరలో నాణ్యత లేకపోవడంతో పిండిగా ఉండే కంకర వాడుతున్నట్లు తెలస్తోంది. రోడ్డు కంకర వేసి రోలింగ్‌ చేసే క్రమంలో వాటర్‌ క్యూరింగ్‌ సక్రమంగా చేయడం లేదు. రోడ్డు పనుల్లో అడుగడుగునా లోపాలు, అతుకుల రోడ్డు పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల బాగున్న తారుపైనే మరో లేయర్‌ వేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల బాగున్న తారు రోడ్లను పెకళించి దాన్నే రోలింగ్‌ చేసి, ఆపైన తారు రోడ్డు వేస్తున్నారు. ఈ రహదారి పనుల్లో భాగంగా మ« ద్యలో 17 తూముల వంతెనలు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ తూములు కూడా నాసిరకంగా ఉన్న ట్లు తెలుస్తుంది. బరువైన వాహనాలు ఆ తూములపై వెళ్లేటప్పుడు దెబ్బతినే ప్రమాదం ఉంది. 

బాగున్న రోడ్డును తవ్వి దానిపై తారు రోడ్డు
రోడ్డు పనుల్లో భాగంగా బయ్యవారికండ్రిగ నుంచి ఎల్లసిరి సింగిల్‌ రోడ్డుపై ఉన్న తారును జేసీబీలతో తవ్వి దానిని పక్కకు తోలకుండా దానిపై కొత్తగా తారు రోడ్డు వేశారు. సుమారు 2 కిలో మీటర్ల మేర బాగున్న రోడ్డును తవ్వి ఆ తారును తొలగించాల్సి ఉండగా ఆ తారుపైనే రోలింగ్‌ చేసి తారు రోడ్డు వేశారు.  

ప్రమాదాల హెచ్చరిక బోర్డులేవీ!
 ఈ రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులను కాంట్రాక్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో వాహన దారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆర్నెల్ల క్రితం గొట్టిపల్లి రోడ్డు సమీపంలో చిట్టమూరు మండలం రాపురం గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. కల్వర్టు నిర్మాణ పనుల్లో భాగంగా హెచ్చరిక బోర్డులు లేకపోవడం, కల్వర్టు పనులు జరిగే ప్రదేశం వద్ద అడ్డుగా ఏమి పెట్టకపోవడంతో ద్విచక్రవాహన దారుడు కల్వర్టులో పడి మృతి చెందిన  ఘటన చోటు చేసుకుంది. చిట్టమూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో పీఈటీ ఉపాధ్యాయుడు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. నిత్యం ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 

 ప్రమాద సూచిక బోర్డులుఏర్పాటు చేయడం లేదు
నాయుడుపేట–మల్లాం రోడ్డు విస్తరణ పనుల ప్రదేశంలో ప్రమాద సూ చిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. దీంతో రాత్రి సమయాల్లో ద్విచ క్ర వాహనదారులు రోడ్డుకు ఇరువైపులా తీసిన గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికే ఒకరు మృతి చెందగా, మరి కొంత మంది తీవ్రగాయాల పాలయ్యాడు. ఇకనైనా విధిగా పనులు జరిగే ప్రదేశంలో బోర్డులు ఏర్పాటు చేయాలి.
–  సంక్రాంతి కస్తూరయ్య,మొలకలపూడి, చిట్టమూరు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement