క్వారంటైన్‌ భోజనం: ఇదేం కక్కుర్తి..?

Coronavirus: Quarantine Centre Food Fraud In Srikakulam - Sakshi

సిండికేటైన కాంట్రాక్టర్లు 

మోసపూరిత విధానంతో కోట్‌ చేసిన వ్యాపారులు 

ఒకరు తక్కువ కోట్‌ చేసి, మిగతా వారితో ఎక్కువ కోట్‌ చేయించిన వైనం 

ఈ క్రమంలో లబ్ధిపొందిన వారికి చెరో రూ.లక్ష చొప్పున తాయిలం  

సాక్షి, శ్రీకాకుళం: కరోనా విజృంభణతో ఊళ్లన్నీ చివురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఇంత ఆపత్కాలంలోనూ కొందరు అక్రమాలు ఆపడం లేదు. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పెద్ద ఎత్తున క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశా రు. ఈ సెంటర్లలో ఉన్న వారికి మంచి భోజనం, వసతి కల్పిస్తున్నారు. అయితే ఈ భోజనం సర ఫరా చేసేందుకు టెండర్లు పిలవగా, కొందరు హోటల్‌ యజమానులు కుమ్మక్కై కోట్‌ చేసి, త ద్వారా వచ్చే లాభాన్ని ముందుగానే పంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు తెలియకుండా జాగ్రత్తపడి ఈ టెండర్‌ పాట వ్యవహారాన్ని నడిపారు. 

జిల్లాలో 35 క్వారంటైన్‌ సెంటర్లు ఉండగా 768 మందితో నడిచాయి. అయితే, 14 రోజుల నుంచి 21 రోజుల లోపు క్వారంటైన్‌ పూర్తి చేసుకు న్న వారికి పరీక్షలు నిర్వహించి, నెగెటివ్‌ అని తే లాక కొందర్ని ఇళ్లకు పంపించారు. వీరు పోను ప్ర స్తుతం జిల్లాలో 411 మంది క్వారంటైన్‌లో ఉన్నా రు. వీరికే కాకుండా మరికొంత మందికి మూడు పూటలా భోజనం సమకూర్చారు. తొలి రోజుల్లో 1000 మందికి భోజనం పెట్టినట్టు సమా చారం. అయితే తొలి రోజుల్లో ఎలాంటి టెండర్లు పిలవకుండా కొందరు హోటల్‌ యజమానులకు మూ డు పూట్ల మెరుగైన భోజనం సమకూర్చే బా ధ్యతను నేరుగా అప్పగించారు.

రోజుకి రూ. 380 నుంచి రూ.420వరకు సరఫరా చేసేవారు. అయితే తర్వాత ఎక్కువ ధర అనో, ప్రభుత్వం ఆదేశాలో గానీ క్వారంటైన్‌ సెంటర్లకు భోజనం సమకూర్చేందుకు టెండర్ల ద్వారా సరఫరా కాంట్రాక్టర్లను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ నెల 6వ తేదీన టెండర్లు పిలిచారు. జిల్లాలో 14 మంది టెండర్లు దాఖలు చేశారు. 9వ తేదీన టెండర్లు పిలవాల్సిన సమయంలో టెండర్ల నోటిఫికేషన్‌లో చోటు చేసుకున్న లోపాలను గుర్తించారు. ముఖ్యంగా సరఫరా చేసే భోజనం ఎంత పరిమాణంలో ఉండాలి, భోజనాన్ని బాక్సుల ద్వారానే సరఫరా చేయాలన్న విషయాన్ని విస్మరించారు. ఆలస్యంగా గుర్తించిన అంశాలను అప్పటికప్పుడు నోటిఫికేషన్‌లో చేర్చి, ఆ దిశగా కోట్‌ చేయాలని అప్పటికే టెండర్లు వేసిన 14 మందికి అధికారులు సూచించారు.  

ఇదే అవకాశమంటూ..  
అధికారులు ఇచ్చిన అవకాశాన్ని హోటల్‌ యజమానులు అందిపుచ్చుకున్నారు. సిండికేట్‌లో జరిగిన వ్యవహారాలపై అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. సాధారణంగా టెండర్లు పిలిచినట్టుగానే పిలిచారు. హోటల్‌ యజమానులు మాత్రం బయట కుమ్మక్కై వ్యూహాత్మకంగా బిడ్‌ దాఖలు చేశారు. అతి తక్కువగా రూ. 310కి ఒకరు కోట్‌ చేయగా, మిగతా ఆపై మొత్తాలకు కోట్‌ చేశారు. చెప్పాలంటే క్వారంటైన్‌ సెంటర్లు ప్రారంభమైనప్పుడు సరఫరా చేసే ధర కంటే ఇది తక్కువగా ఉన్నప్పటికీ అంత కంటే తక్కువగానే కోట్‌ చేసే అవకాశం ఉంది. కానీ హోట ల్‌ యజమానులు రింగై ఒకరి చేత తక్కువ కోట్‌ చేయించి, మిగతా వారంతా ఎక్కువ కోట్‌ చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి.  

రింగైన వారికి చెరో రూ. లక్ష లబ్ధి 
ఇందులో ఒకరికే టెండర్‌ దక్కింది. వ్యూహాత్మకంగా రింగైన వ్యవహారంలో  మిగతా వారికి చెరో రూ.లక్ష చొప్పున ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్న పరిస్థితి ఉంది. అధికారులు ఎలాగూ రూ. 20లక్షల మేర అడ్వాన్సు ఇస్తారని, ఆ మొత్తానికి ముందుగా మీకే ఇచ్చేస్తానని చెప్పి ఒక్కొక్కరికీ రూ. లక్ష విలువైన చెక్కులను ముందుగా అందజేశారు. ఇప్పుడిది హోటల్‌ యజమానుల వర్గాల్లో చర్చనీయాంశమైంది. క్వారంటైన్‌లో ప్రస్తుతం ఉన్న సంఖ్య ఆధారంగానైతే వీరికి గిట్టుబాటు కాదు.

కానీ రానున్న రో జుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య 2వేలకు పైగా ఉండొచ్చని, ఆ సమయంలో ఈ ధర తో మరింత గిట్టుబాటు అవుతుందని, ఒక్కొక్కరికీ ఇచ్చిన రూ.లక్ష ఎంతమాత్రం నష్టం కాదనే అభిప్రాయంతో సిండికేట్‌ ముందుకెళ్లినట్టు గుసగుసలు వి నిపిస్తున్నాయి. ఇలా జరిగిన వ్యవహారంపై ఇప్పటికే హోటల్‌ వ్యాపారుల మధ్య ఫోన్‌ సంభాషణలు కూడా జరిగాయి. ఆ సంభాషణలు ఇప్పుడు బయ టకు రావడంతో సిండికేట్‌ వ్యవహారం వాస్తవమే అన్న అభిప్రాయానికి ఊతమిస్తోంది. ఇక్కడొక విషయమేమిటంటే సాధారణంగా టెండర్లు ఖరారు చేసినప్పుడు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3తో సంప్రదింపులు చేసి కోట్‌ చేసిన దాని కన్న తక్కువ ధరకు సరఫరా చేస్తారా? లేదా అన్నదానిపై చర్చించాలి. ఇక్కడదేమీ జరగలేదు.  

మాకేం తెలీదు..  
క్వారంటైన్‌ కేంద్రాలకు భోజనం సరఫరా చేసే కాంట్రాక్ట్‌ విషయమై నలుగురు అ«ధికారుల బృందం నిర్ణయం తీసుకుంది. చివరి క్షణంలో గుర్తించిన అంశాలను చేర్చి టెండర్లు దాఖలు చేయాలని హోటల్‌ యజమానులను కోరాం. ఎవరైతే తక్కువ కోట్‌ చేశారో వారి వివరాలతో కూడిన ఫైల్‌ను జాయింట్‌ కలెక్టర్‌కు సమర్పించాం. అన్నీ సవ్యంగా ఉన్నాయని జాయింట్‌ కలెక్టర్‌ కాంట్రాక్ట్‌ తుది నిర్ణయం తీసుకున్నారు. అంతకుమించి బయటేమి జరిగిందో మాకు తెలీదు.  
– బి.దయానిధి, డీఆర్‌ఓ, శ్రీకాకుళం  

తక్కువకు కోట్‌ చేశారని ఖరారు చేశాం 
క్వారంటైన్‌ కేంద్రాలకు భోజనం సరఫరా చేసేందుకు ఎవరైతే తక్కువ కోట్‌ చేశారో వారికి టెండర్‌ ఖరారు చేశాం. బయట జరిగిన వ్యవహారాలు మాకు తెలీవు. సిండికేట్‌ అయ్యారని తెలి స్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే మళ్లీ టెండర్లు పిలుస్తాం. లేదంటే భోజనం సరఫరా చేసినప్పుడు తేడాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 
– శ్రీనివాసులు, జాయింట్‌ కలెక్టర్, శ్రీకాకుళం   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top