కానిస్టేబుళ్లకు ఫాస్ట్‌గా పదోన్నతులు | constables promotions speed up | Sakshi
Sakshi News home page

కానిస్టేబుళ్లకు ఫాస్ట్‌గా పదోన్నతులు

Dec 11 2013 3:07 AM | Updated on Mar 19 2019 6:01 PM

రాష్ట్ర పోలీసు కానిస్టేబుళ్లకు పోలీసు బాస్ త్వరలో తీపి కబురు అందించనున్నారు.

 ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదనలు
 అండర్ గ్రాడ్యుయేట్లకు 30 శాతం
 ఉన్నత విద్యావంతులకు 20 శాతం


రాష్ట్ర పోలీసు కానిస్టేబుళ్లకు పోలీసు బాస్ త్వరలో తీపి కబురు అందించనున్నారు. ఏళ్ల తరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న  కానిస్టేబుళ్లకు ఫాస్ట్‌ట్రాక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి  డీజీపీ ప్రసాదరావు పంపించారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది సంఖ్య లక్షా 30 వేలు ఉండగా, వీరిలో 70% కానిస్టేబుల్ స్థాయి  వారే ఉన్నారు. ఎక్కువమంది ఎలాంటి పదోన్నతులు లేకుండానే కానిస్టేబుల్ స్థాయిలోనే పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో కింది స్థాయిలో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. స్వయాన కానిస్టేబుల్ కుమారుడైన ప్రసాదరావుకు ఆ స్థాయిలో ఉన్న సిబ్బంది ఎదుర్కొనే సమస్యలు, అసంతృప్తిపట్ల అవగాహన ఉంది. దీంతో వారికి పదోన్నతులు కల్పించే విషయమై తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే తీవ్రంగా యోచిస్తున్నారు.

కానిస్టేబుళ్లలో డిగ్రీలు, పీజీలు చేసిన వారు కూడా అనేకమంది ఉన్నట్టు ఆయన పరిశీలనలో తేలింది. అంతేగాక, దాదాపు నాలుగువేల మంది వరకు బీటెక్‌చదివిన వారు కూడా ఉన్నారు. ఇప్పటివరకు పోలీసు శాఖలో కానిస్టేబుళ్లకు పదోన్నతులు ఇచ్చేటప్పుడు 70% నేరుగా రిక్రూట్ అయిన వారికి, ర్యాంక్ ప్రమోటీలకు 30% ఇచ్చేవారు.దీనిని ఈసారి మార్చాలని ప్రసాదరావు ప్రతిపాదించారు. ర్యాంక్ ప్రమోటీలకు పదోన్నతుల శాతాన్ని 50 శాతానికి పెంచాలని, అందులో కూడా 20% ఉన్నత చదువులు చదివిన వారికి, మరో 30% డిగ్రీ కంటే తక్కువగా చదువుకున్న వారికి ప్రమోషన్లు ఇచ్చేలా నిబంధనను చేర్చారని తెలిసింది. ఇక మిగతా 50% నేరుగా రిక్రూట్ అయ్యే వారికి కేటాయించినట్టు తెలిసింది. ఉన్నత చదువులు చదివిన కానిస్టేబుళ్లకు ఖాళీలనుబట్టి  పరీక్షలను నిర్వహించి పదోన్నతులు ఇచ్చేలా డీజీపీ తన ప్రతిపాదనలో పేర్కొన్నట్టు తెలిసింది. అంతేకాక ఐదేళ్లకోసారి పదోన్నతుల పరీక్షలు నిర్వహించేలా కూడా ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఈ విధానాన్ని వెంటనే అమల్లో  పెట్టాలని డీజీపీ యోచిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement