బస్‌ ప్రయాణికుల అవస్థలు

Commuters Facing Problems with Lack Of Bus Shelters In Visakhapatnam - Sakshi

సాక్షి, చోడవరం(విశాఖ) : ఒక పక్క ఎండలు..మరో పక్క వర్షాలు...ప్రయాణికులకు మాత్రం అవస్థలు కలిగిస్తున్నాయి. ఎందుకంటే బస్సు కోసం ఎదురు చూడడానికి చాలా చోట్ల బస్‌ షెల్టర్లు లేవు. నిలువ నీడ లేక చెట్లను, దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. జంక్షన్‌లో బస్సుల కోసం నిరీక్షించే సమయంలో ఎండ మండినా, వాన వచ్చినా తలదాచుకోవడానికి పరుగులు తీయాల్సిన దుస్తితి. ఇటు పాలకులు, అటు ఆర్టీసీ వారు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది.

80 గ్రామాలకు బస్‌ సౌకర్యం లేదు
చోడవరం నియోజకవర్గంలో సుమారు 80 గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేకపోగా మిగతా 100 గ్రామాలకు బస్సులు వెళుతున్నా 60 శాతానికి పైగా గ్రామాలకు బస్‌ షెల్టర్లు లేవు. నియోజకవర్గంలో ఉన్న చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాలకు చెందిన సుమారు 40 వేలకు మందికి పైగా ఉద్యోగులు, రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు, ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రోజువారీ పనులు, ఇతర కార్యక్రమాలకు రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా ఎండలకు మండుతూ, వర్షాలకు తడుస్తూ ఎప్పుడో వచ్చే బస్సులు, ఆటోల కోసం గంటల తరబడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ప్రధాన రూట్లలో సైతం కనిపించని షెల్టర్లు
చోడవరం, నర్సీపట్నం, విశాఖపట్నం, అనకాపల్లి, మాడుగుల ప్రధాన ప్రాంతాలకు వెళ్లే బీఎన్‌రోడ్డు, మాడుగుల రోడ్డు, అనకాపల్లి –బంగారు మెట్ట, తోటకూపాలెం, రావికమతం రోడ్లులో సైతం చాలా గ్రామాల వద్ద బస్‌ షెల్టరు లేవు. నాలుగైదు గ్రామాల్లో స్థానిక దాతల సాయంతో బస్‌షెల్టర్లు నిర్మించగా, మరో ఏడు చోట్ల గతంలో పార్లమెంటు సభ్యుల నిధులతో నిర్మించారు. మిగతా గ్రామాల్లో కనీసం నిలబడడానికి నీడ కూడా లేని దయనీయ పరిస్థితి నెలకొంది. 

బస్సుల కోసం పరుగులు
చోడవరం మండలంలో గోవాడ, అంబేరుపురం, గజపతినగరం, గంధవరం, లక్కవరం, గాంధీగ్రామం, నర్సయ్యపేట, గౌరీపట్నం జంక్షన్, నర్సాపురం జంక్షన్, రాయపురాజుపేట, శీమునాపల్లి, ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉన్నా ప్రయాణికులు వేచి ఉండడానికి బస్‌ షెల్టర్లు లేవు. కొన్ని చోట్ల గ్రామాలు దూరంగా ఉండడంతో ఆయా జంక్షన్లలో మరీ దయనీయంగా ఉంది. స్కూళ్లు ప్రారంభం కావడం, వర్షాకాలం వచ్చేయడంతో సాధారణ ప్రయాణికులతోపాటు రోజూ పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. షెల్టర్లు లేక వర్షంలో తడుస్తూనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పాలకులు ప్రయాణికుల దుస్థితి గమనించి బస్‌ షెల్టర్లు కట్టించాలని జనం కోరుతున్నారు.

ఐదేళ్లుగా నిర్లక్ష్యం
గడిచిన ఐదేళ్లలో ఒక్క బస్‌షెల్డర్‌ కూడా గత ప్రభుత్వం నిర్మించలేదు. అసలే  ఎండలు మండిపోవడం, అకాల వర్షాలు కురవడంతో ప్రయాణికులు తలదాచుకోడానికి నిలువు నీడలేకుండా ఉంది. చెట్ల కింద ఉన్నా, కొన్ని గ్రామాలకు జంక్షన్ల వద్ద చెట్లు కూడా లేవు. బస్సులు కూడా సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నాం. మా గ్రామం అనకాపల్లి –చోడవరం రోడ్డులో ఉన్నప్పటికీ బస్‌ షెల్టర్‌ లేదు.
– మొల్లి ప్రసాద్, గంధవరం

షెల్టరు నిర్మించాలి
మా రూట్‌లో ఒకటి రెండు బస్సులే నడుస్తున్నాయి. అవికూడా సకాలంలోరావు. ఆ బస్సుకోసం గంటల తరబడి రోడ్డుపై నిలబడాల్సి వస్తుంది. ఎండకి ఎండి, వర్షానికి తడిసి నిలబడాల్సి వస్తుంది. బస్‌ షెల్టర్‌ కోసం పలుమార్లు గత ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చాం. కానీ ఆయన పట్టించుకోలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే అయినా చర్యలు తీసుకొని మా జంక్షన్‌ వద్ద బస్‌షెల్టర్‌ నిర్మించాలని కోరుతున్నాం.
–అప్పారావు, వీఆర్‌పేట  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top