నీళ్లు అమ్ముకుంటే ఊరుకోం | collector srikanth given strict commitment for not saleing water | Sakshi
Sakshi News home page

నీళ్లు అమ్ముకుంటే ఊరుకోం

Mar 16 2014 2:53 AM | Updated on Oct 20 2018 6:17 PM

నీళ్లు అమ్ముకుంటే ఊరుకోం - Sakshi

నీళ్లు అమ్ముకుంటే ఊరుకోం

సోమశిల జలాశయంలో నుంచి రెండో పంటకు నీటి విడుదల చేయడంపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. పెన్నా, సంగం డెల్టాల్లోని 2.47 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందిస్తామని కలెక్టర్ శ్రీకాంత్ ప్రకటించారు.

సాక్షి, నెల్లూరు: సోమశిల జలాశయంలో నుంచి రెండో పంటకు నీటి విడుదల చేయడంపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. పెన్నా, సంగం డెల్టాల్లోని 2.47 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందిస్తామని కలెక్టర్ శ్రీకాంత్ ప్రకటించారు. శనివారం కలెక్టరేట్‌లోని జూబ్లీహాల్లో కలెక్టర్ శ్రీకాంత్ అధ్యక్షతన జిల్లా సాగునీటి సలహామండలి సమావేశం జరిగింది. సోమశిలలో ప్రస్తుతం ఉన్న నీరు 38.755 టీఎంసీలతో పాటు భవిష్యత్‌లో వచ్చే నీటితో కలిపి 43.860 టీఎంసీలుగా లెక్కించారు. ఇందులో ఖరీఫ్ పంటకు ఏప్రిల్ 15వ తేదీ వరకు సాగు నీరు ఇవ్వాల్సిన 6.735 టీఎంసీలు నీరు పోను సోమశిలలో 37.125 టీఎంసీల నీరు ఉంటుందని లెక్కలు తేల్చారు.
 
 ఇందులో డెడ్‌స్టోరేజ్, ఆవిరి, కావలి, నెల్లూరు, అల్లూరు ప్రాంతాల తాగునీటి అవసరాలకు పోను 27.6259 టీఎంసీలుగా తేల్చారు. ఉన్ననీటిలో ఒక్క టీఎంసీ నీటికి 8 వేల ఎకరాల చొప్పున 2.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని అధికారులు కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. అనంతరం రైతు సంఘాలు నేతలు, ఇరిగేషన్ అధికారులతో చర్చించిన కలెక్టర్ వారి సూచనల మేరకు పెన్నా, సంగం డెల్టాలోని మొత్తం 2.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని తీర్మానించారు.
 
 మే 1 నుంచి నీటి విడుదల
 రెండో పంటకు మే 1వ తేదీ నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఖరీఫ్ మొదటి పంట ఉంటుందని, అనంతరం కాలువల్లో పూడిక తీసి మే 1న నీటిని విడుదల చేస్తామన్నారు. ప్రతిసారి అధికారులు కొందరు రైతుల వద్ద భారీగా డబ్బులు గుంజి అనధికార ఆయకట్టుకు నీరందిస్తున్నారని పదేపదే ఫిర్యాదులొస్తున్నాయని, ఈ దఫా అలాంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాలని కలెక్టర్  ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. ఆరోపణలు వస్తే చర్యలు తప్పవన్నారు. అధికారులతో కమిటీలు వేసి చివరి ఆయకట్టు రైతులకు నీళ్లందేలా చర్యలు చేపట్టాలన్నారు.
 
 అవినీతిపై కఠిన చర్యలకు
 అధికారులతో కమిటీ
 సాగునీటి పనుల్లో అక్రమాలు జరిగినట్లు రుజువైతే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీకాంత్ హెచ్చరించారు. ఇప్పటికే కాలువ ఆధునికీకరణ పనుల్లో అవినీతి జరిగిందని పలు ఫిర్యాదు లొస్తున్నాయని, ఇక నుంచి ఫిర్యాదు చేయదలిచిన వారు స్థానిక ఎమ్మార్వో, ఇరిగేషన్, వ్యవసాయాధికారులతో కూ డిన కమిటీకి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదులపై విచారించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
 
 రూ.334.26 కోట్లతో పూడికతీత
 జిల్లాలో రూ.334.26 కోట్లతో సాగునీటి కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఏప్రిల్ 15 నాటికి తొలి పంట పూర్తయిన వెంటనే కాలువల్లో పూడిక తీత పనులు ప్రారంభిస్తామన్నారు. తొలుత స్థానిక రైతులతో పనులు చేయించాలని నిర్ణయించినప్పటికీ ఈ ప్రతిపాదనను విరమించుకున్నామన్నారు. ప్రభుత్వ అనుమతితో టె ండర్ల ద్వారా చేపట్టే అవకాశముందన్నారు.
 
 సోమశిల ఇంకా పూర్తి కాలేదు
 సోమశిల ప్రాజెక్టు అధికారికంగా ఇంకా పూర్తికాలేదని ఇరిగేషన్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తయిందని కలెక్టర్ అడగగా అధికారికంగా డ్యామ్ పూర్తయినట్లు ప్రకటించలేదని అధికారులు వివరించారు. డ్యామ్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో అటవీ అనుమతులు ఇంకా లభించలేదని, దీంతో 78 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన  సోమశిల ఇంకా పూర్తి కాలేదని వారు తెలిపారు.
 
 రిజిస్టర్డ్ ఆయకట్టు 1.75 లక్షలే
 సోమశిల  పరిధిలో ఇప్పటి వరకు రిజిస్టర్ ఆయకట్టు 1.75 లక్షల ఎకరాలు మాత్రమే ఉందని, మిగిలిం దంతా నాన్ రిజిస్టర్డ్ ఆయకట్టు మాత్రమేనని అధికారులు తేల్చారు. ఇన్నాళ్లు 75 వేల ఎకరాలు ఎందుకు రిజిస్టర్ కాలేదని కలెక్టర్ అధికారులు, రైతు సం ఘాల నేతలను ప్రశ్నించారు. మరి పెన్నా, సంగం డెల్టాల పరిధిలో 2.47 లక్షల ఎకరాలు ఎలా చూపిస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు.  ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో చూపించిన 2.47 లక్షల ఎకరాల ఆయకట్టును పూర్తిగా రిజిస్టర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement