వరద గోదావరిని ఒడిసి పడదాం

CM Ys Jagan Discussion Godavari Water AP Assembly - Sakshi

ఆల్మట్టి ఎత్తు పెంచే పనులు పూర్తయితే కృష్ణా బేసిన్‌లో ఆయకట్టు ఎండమావే

రాష్ట్రానికి మంచి చేయాలన్నదే నా ఆరాటం.. లేదంటే ఆ పని కచ్చితంగా చేయం 

మనం తీసుకునే నిర్ణయం భావితరాలపై ప్రభావం.. గోదావరి నీటిని మరింతగా వాడుకుందాం

గత ఐదేళ్లలో సగటున 400 టీఎంసీలు కూడా శ్రీశైలానికి కృష్ణా నీరు చేరలేదు

ఆల్మట్టి ఎత్తు 519 నుంచి 524 మీటర్లకు పెరిగితే శ్రీశైలానికి వచ్చే నీళ్లు 250 టీఎంసీలే

ప్రస్తుతం తెలంగాణను దాటుకుని రాష్ట్రంలోకి 2,500 టీఎంసీల గోదావరి జలాల ప్రవాహం

రాష్ట్ర పరిధిలోని శబరి నుంచి గోదావరిలో లభించే నీళ్లు 500 నుంచి 600 టీఎంసీలే

కేసీఆర్‌తో కలిసి గోదావరి జలాల తరలింపే సమస్యకు ప్రత్యామ్నాయం

అందుకే గోదావరి డెల్టా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా శ్రీశైలం, సాగర్‌లకు జలాల మళ్లింపు

బాబు సీఎంగా ఉన్నప్పుడే తెలంగాణ సర్కార్‌    ‘కాళేశ్వరం’ను ప్రారంభించి ఐదేళ్లలో పూర్తి చేసింది

గోదావరి జలాలు శ్రీశైలం, సాగర్‌లకు చేరితే జగన్‌కు మంచి పేరొస్తుందనే ఈర్ష్యతో రాద్ధాంతం

శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తెలంగాణను దాటుకుని 2,500 టీఎంసీల గోదావరి జలాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. గోదావరి నది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో 120 రోజులు వరదతో పొంగుతుంది. వరద ఉన్న రోజుల్లో రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున 120 రోజుల్లో 450 నుంచి 500 టీఎంసీలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తీసుకెళ్లాలని ఇద్దరు ముఖ్యమంత్రులం నిర్ణయించాం.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : ‘తెలుగువాళ్లం ఎక్కడ ఉన్నా సరే ఇచ్చి పుచ్చుకునే గుణం ఉండాలి. కలిసి పని చేసుకునే వాతావరణం ఉండాలి. ఒకరికి తోడుగా మరొకరు నిలబడాలి. నిజంగా ఆ భావన రావడం సంతోషం. తెలుగు రాష్ట్రాల భావితరాల ప్రయోజనాల కోసమే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాలను తరలించాలని నేను.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించాం. తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలను తరలిస్తే అవి మన వరకూ వస్తాయా? అంటూ ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన సందేహాలు సహేతుకమైనవే. నిజంగా నీళ్లు రావు అనుకున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి ఎందుకు ముందడుగు వేయాలని అనుకుంటారు? మనం తీసుకునే నిర్ణయం వల్ల భావితరాలపై ప్రభావం ఉంటుంది. నిర్ణయం తీసుకోకపోవడం కూడా భావితరాలపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని మరచి పోకూడదు.

రాష్ట్రానికి మంచి చేయాలనే ఆరాటంతోనే నిర్ణయాలు తీసుకుంటున్నాం.. మంచి జరగదని అనుకుంటే ఆ పని ఎందుకు చేస్తాం? కచ్చితంగా చేయం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయానికి గోదావరి జలాలు తరలిస్తే జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఈర్షతోనే ప్రతిపక్ష సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. గోదావరి జలాల మళ్లింపుపై శాసనసభలో గురువారం జరిగిన స్వల్ప కాలిక చర్చలో జల వనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిలు మాట్లాడిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా జగన్‌   ఏమన్నారంటే.. 

నాసిక్‌ పాయపై మహారాష్ట్ర ఎక్కడికక్కడ బ్యారేజీలు 
‘గోదావరి నదికి నాలుగు పాయలు ఉన్నాయి. ఒక పాయ నాసిక్‌ నుంచి వస్తుంది. ఇది తెలంగాణలో కలుస్తుంది. దీన్నే అప్పర్‌ గోదావరి అంటారు.. ఈ సబ్‌ బేసిన్‌ను జీ–1 అంటారు. ప్రవర సబ్‌ బేసిన్‌ను జీ–2, పూర్ణ సబ్‌ బేసిన్‌ను జీ–3, మంజీర సబ్‌ బేసిన్‌ను జీ–4, మిడిల్‌ గోదావరి సబ్‌ బేసిన్‌ను జీ–5, మానేరు సబ్‌ బేసిన్‌ను జీ–6 అంటారు. నాసిక్‌ నుంచి వచ్చే పాయ ద్వారా గోదావరి నదిలో నీటి లభ్యత 22.23 శాతం ఉంటుంది. ఈ పాయపై మహారాష్ట్ర ఎక్కడికక్కడ బ్యారేజీలు కట్టేసి.. నీళ్లను వినియోగించుకుంటుండటం వల్ల తెలంగాణలో 90 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)కు నీళ్లు రాని పరిస్థితి నెలకొంది. దాంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీకి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా గోదావరి జలాలను తరలించే పనులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. 

శబరి సబ్‌ బేసిన్‌లో నీటి లభ్యత 12 శాతమే 
గోదావరి నది రెండో పాయ గురించి చెప్పాలంటే.. పెన్‌ గంగ సబ్‌ బేసిన్‌(జీ–7), వార్దా సబ్‌ బేసిన్‌(జీ–8), ప్రాణహిత సబ్‌ బేసిన్‌(జీ–9)లు తెలంగాణ పరిధిలోకి వస్తాయి. ప్రాణహిత సబ్‌ బేసిన్‌ నుంచి 35.46 శాతం నీటి లభ్యత ఉంటుంది. గోదావరి మూడో పాయ గురించి చెప్పాలంటే.. ఇది పూర్తిగా ఇంద్రావతి సబ్‌ బేసిన్‌(జీ–11). ఈ సబ్‌ బేసిన్‌లో 23 శా>తం నీటి లభ్యత ఉంటుంది. మనకు (ఆంధ్రప్రదేశ్‌) కేవలం శబరి సబ్‌ బేసిన్‌ (జీ–12) నుంచే గోదావరిలోకి నీళ్లు వస్తున్నాయి. ఈ సబ్‌ బేసిన్‌లో నీటి లభ్యత 12 శాతమే. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం గత 44 ఏళ్లలో ప్రాణహిత సంగమం తర్వాత కాళేశ్వరం వద్ద గోదావరిలో ఏడాదికి సగటున 1,709 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇంద్రావతి సంగమం తర్వాత పేరూరు వద్ద సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం గత 47 సంవత్సరాల్లో ఏడాదికి సగటున 2,489 టీఎంసీల నీటి లభ్యత ఉంది. శబరి సంగమం తర్వాత పోలవరం వద్ద గోదావరి నీటి లభ్యత 3,082 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే శబరి సంగమం నుంచి పోలవరం వరకూ గోదావరిలో నీటి లభ్యత 500 నుంచి 600 టీఎంసీలే. మిగిలిన 2,500 టీఎంసీలు తెలంగాణను దాటుకుని మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయన్నది స్పష్టమవుతోంది.

కృష్ణా ఆయకట్టు ఎండమావే.. 
సీడబ్ల్యూసీ రికార్డులను పరిశీలిస్తే గత 47 సంవత్సరాల్లో కృష్ణా నది నుంచి శ్రీశైలంలోకి సగటున ఏడాదికి 1,200 టీఎంసీలు వచ్చేవి. గత పదేళ్లలో శ్రీశైలంలోకి వస్తున్న నీళ్లు సగటున ఏడాదికి 600 టీఎంసీలకు పడిపోయాయి. గత ఐదేళ్లలో శ్రీశైలంలోకి ఏటా సగటున వస్తున్నది 400 టీఎంసీలు మాత్రమే. కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీళ్లు 811 టీఎంసీలు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్ణాటక సర్కారు ఆల్మట్టి జలాశయం ఆనకట్ట ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచే పనులను ప్రారంభించింది. ఈ పనులు పూర్తయితే ఆల్మట్టి జలాశయంలో అదనంగా 110 టీఎంసీలను నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల కర్ణాటక నీటి వినియోగం అదనంగా 130 నుంచి 140 టీఎంసీలకు పెరుగుతుంది. అప్పుడు శ్రీశైలం జలాశయంలోకి వచ్చే నీళ్లు 250 టీఎంసీలు మాత్రమే. ఇక శ్రీశైలం ఎప్పుడు నిండుతుంది? రాయలసీమ ప్రాజెక్టులు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులు ఎప్పుడు నిండుతాయి? నాగార్జునసాగర్‌కు నీళ్లు ఎప్పుడు వస్తాయి? కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిస్థితి ఏంటి? కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో ఆయకట్టు ఎండమావిగా మారింది. 

డెల్టా ప్రయోజనాలకు విఘాతం కలగనివ్వం 
గోదావరి నదీ జలాలను పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాలువ మీదుగా కృష్ణా డెల్టాకు మళ్లింపు చేసే పనులు చేపట్టినప్పుడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏ రకమైన అభ్యంతరాలు వచ్చాయి.. ఎలాంటి గొడవలు జరిగాయన్నది ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో.. శబరి ద్వారా వచ్చే నీళ్లు 500 నుంచి 600 టీఎంసీలు మాత్రమే. అక్కడి నుంచే ఈ నీటినే రాయలసీమకు తీసుకెళ్లండి.. శ్రీశైలానికి తీసుకెళ్లండి అని చెబితే.. గోదావరి జిల్లాల ప్రజలకు మనం న్యాయం ఎలా చేస్తాం.. వారికి ఎలా మంచి చేయగలుగుతాం? గోదావరి డెల్టా ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాలను తరలించాలని నిర్ణయించాం. 

తెలంగాణ వాళ్లు డ్యామ్‌లు కట్టలేరా? 
మహారాష్ట్ర, కర్ణాటకలు ఏ రకంగా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నాయో.. తెలంగాణ కూడా అదే మాదిరిగా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతోంది. గోదావరి నది నుంచి 450 టీఎంసీలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సర్కార్‌ తరలిస్తోందని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఇదివరకే సభలో చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ సర్కార్‌ ప్రారంభించి.. పూర్తి చేసింది. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపగలిగారా? ఏమీ చేయలేకపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి జలాశయం ఆనకట్ట ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్ల ఎత్తుకు పెంచే పనులను చేపట్టింది. ఆ పనులను ఆపగలిగారా? ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ వాళ్లు డ్యామ్‌లు కట్టే పరిస్థితి లేదని ప్రతిపక్ష సభ్యులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. డ్యామ్‌లు కట్టాలంటే రెండు కొండలు కావాలి.. వాటి మధ్య డ్యామ్‌ కట్టాలి అన్నది గతం. ఈ రోజుల్లో పరిస్థితి ఏమిటంటే.. చిన్న చిన్న బ్యారేజీలు టపాటపా కట్టుకుంటూ పోతున్నారు. కాళేశ్వరం వద్దకు నేను వెళ్లినప్పుడు 17 టీఎంసీల బ్యారేజీ అక్కడ కన్పించింది. ఇంకాస్త ముందుకు వెళితే మరో బ్యారేజీ కన్పించింది. అక్కడి నుంచి పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి.. ప్రాజెక్టులు నింపుతున్నారు.  

తెలంగాణతో సఖ్యత అవసరం 
ఇవ్వాళ్టి నుంచి పది సంవత్సరాలు ముందుకు వెళ్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయం వేస్తుంది. నీటి వినియోగం పెరుగుతోంది. నీటిపై ఆధారపడే పరిస్థితి పెరుగుతోంది. మరో వైపు నీటి లభ్యత తగ్గుతోంది. కృష్ణా నది నుంచి శ్రీశైలంలోకి 1,200 టీఎంసీలకు గాను 400 టీఎంసీలు కూడా రావడం లేదు. గత పది సంవత్సరాల లెక్కలను ఒకసారి పరిశీలిస్తే.. సగటున ఏడాదికి 600 టీఎంసీలు మాత్రమే శ్రీశైలానికి వచ్చాయి. గత ఐదేళ్లలో శ్రీశైలానికి వచ్చిన నీళ్లు 400 టీఎంసీలకు పడిపోయాయి. ఆల్మట్టి జలాశయం ఆనకట్ట ఎత్తును 519 నుంచి 524 మీటర్లకు పెంచే పనులు పూర్తయితే పరిస్థితి ఏమిటని ఆలోచన చేస్తేనే భయం వేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటం ఎంత అవసరమో మనందరం ఆలోచించాలి. ఒక్కటైతే చెప్తున్నా.. కేసీఆర్‌ మంచి వారు.. మంచి చేయడానికి ముందడుగు వేస్తున్నారు. దానికి హర్షించాల్సింది పోయి వక్రీకరించడం ఎంత వరకు ధర్మం?. 

ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా.. 
శ్రీశైలం జలాశయం సామర్థ్యం 215 టీఎంసీలు. నాగార్జునసాగర్‌ సామర్థ్యం 315 టీఎంసీలు. ఈ ప్రాజెక్టులను గోదావరి జలాలతో నింపుకోవచ్చు. కేవలం 190 టీఎంసీల సామర్థ్యం ఉన్న పోలవరం ప్రాజెక్టును కట్టడానికి అక్షరాలా రూ.55 వేల కోట్లు అవసరమని లెక్కకడుతున్నారు. ఇక శ్రీశైలం, నాగార్జునసాగర్‌ వంటి ప్రాజెక్టులు కట్టాలంటే ఎంత ఖర్చవుతుంది? శ్రీశైలం,నాగార్జునసాగర్‌  ప్రాజెక్టులు ఉమ్మడి ఆస్తులు. రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కలిసికట్టుగా అడుగులు ముందుకు వేస్తేనే ఇరు రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆలోచిస్తున్నాం. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాలను తరలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు.. తెలంగాణలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని ఆయకట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలను తరలిస్తే.. అవి శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు చేరవేమో అని ప్రతిపక్ష సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాలను పరిగణనలోకి తీసుకుంటాం. అలాంటి పరిస్థితులు రాకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీటిని ఎలా తీసుకెళ్లాలనే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రితో, తెలంగాణ నీటిపారుదల అధికారులతో మన మంత్రులు, అధికారులు చర్చిస్తున్నారు.  

ఈర్షతోనే ప్రతిపక్షం రాద్ధాంతం 
చంద్రబాబు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు అరుస్తున్నారో ఆయనకే తెలియదు. ఆయన మాట్లాడుతున్నంతసేపూ మేము మాట్లాడకుండా విన్నాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ఈ పెద్దమనిషికి అవతలి వాళ్లు చెప్పేది వినే ఓపిక కూడా ఉండాలి. గోదావరి జలాలను శ్రీశైలంకు.. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు తరలిస్తే జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఈర్ష తప్ప ప్రతిపక్ష సభ్యుల మాటల్లో ఇంకేమీ కన్పించడం లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మాట్లాడినంత సేపు మేం అడ్డుతగలకుండా విన్నాం. మేం మాట్లాడుతున్నప్పుడు మాత్రం.. మా మాటలు మైకుల్లో విన్పించకుండా చేయాలనే దుర్భిద్ధితో దుర్మార్గంగా, అన్యాయంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా? ఈ మనిషిని చూస్తే దెయ్యం, రాక్షసి గుర్తుకు వస్తాయి తప్ప మనిషి గుర్తుకు రాడు’ అని సీఎం జగన్‌ అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top