ప్రమాదాలు జరక్కుండా చూస్తాం

cm chandrababu statement in assembly on boat accident - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణానదిలో బోటు బోల్తాపడి.. 20 మంది మృతిచెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. కృష్ణానదిలో జరిగిన ఈ ప్రమాదం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటివరకు కృష్ణానదిలో 20 మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉందని సీఎం తెలిపారు. నదిలో గల్లంతైన బోటు డ్రైవర్‌, హెల్పర్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని సీఎం చెప్పుకొచ్చారు.

ఈ ఘటనలో బాధితులు నలుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రమాద సమయంలో బోటులో 41మంది ఉన్నారని చెప్పారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన ఆరు బృందాలు పాల్గొన్నాయని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైందని.. ఈ ఎఫ్‌ఐఆర్ ప్రతిని సీఎం చంద్రబాబు చదివి వినిపించారు. మొత్తం ఐదుగురిపై కేసు నమోదుచేశామన్నారు.

'బోటు నిర్వాహకుడికి అనుమతి లేదు. అతను డబ్బులకు ఆశపడి.. ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుండా ప్రయాణికులను ఎక్కించుకున్నాడని, అతని స్వార్థం ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైందని సీఎం అన్నారు. రివర్‌ బోటింగ్‌ సంస్థపై కేసు నమోదుచేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో పలువురు చనిపోవడం చాలా బాధ కలిగిస్తున్నదని, ఈ ఘటనకు కారణమైన వారిని శిక్షిస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో సీపీఐ నారాయణ బంధువులు ముగ్గురు మృతిచెందాడం బాధాకరమన్నారు. భద్రతా ప్రమాణాలు తీసుకొని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని చెప్పారు. ఈ ప్రమాదాన్ని చూసిన వెంటనే స్పందించి.. ఆపదలో ఉన్నవారిని కాపాడిన స్థానికులను చంద్రబాబు అభినందించారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర నిపుణులతో కూడిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ వేసి.. ఆ కమిటీ నివేదిక మేరకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ సీఎం చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం మృతులకు సంతాపం తెలుపుతూ.. సభ రెండు నిమిషాలపాటుమౌనం పాటించింది.

Back to Top