రాష్ట్రంలో మొత్తం రహదారుల నెట్‌వర్క్‌ను డిజిటలైజ్ చేయాలని రవాణా శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రహదారుల నెట్‌వర్క్‌ను డిజిటలైజ్ చేయాలని రవాణా శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో నూతన జాతీయరహదారులు, రహదారుల ప్రణాళికలపై గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన జనవరి 31లోపు రాష్ట్రంలోని అన్ని రహదారుల మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పనులపై రోజువారీ సమీక్ష చేసి ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికలు సమర్పించాలని సూచించారు.
రహదారులకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ మేరకు ప్రాజెక్టులవారీగా కేంద్రానికి అందజేయాల్సిన నివేదికలు, డీపీఆర్‌లను సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దుర్గ గుడి ఫ్లయ్ ఓవర్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే కృష్ణా పుష్కరాల లోపు పూర్తవ్వాలని అధికారలను ఆదేశించారు. నూతన రాజధాని అమరావతి చుట్టూ 180 కిలోమీటర్ల మేర అవుటర్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి రూ. 20 వేల కోట్లు వ్యయం కాగలదని అంచనా వేసినట్లు చెప్పారు.
గ్రామీణ రహదారుల నిర్మాణం, నిర్వహణ కోసం నాబార్డు నిధులను ఉపయోగించుకునేందుకు అవసరమయ్యే ప్రణాళికలు సిద్ధం చేయాలని, అలాగే ప్రపంచ బ్యాంక్, జైకా నుంచి కూడా రహదారుల నిర్మాణానికి నిధులు సమీకరించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను కోరారు. వచ్చే మూడేళ్లలో రహదారుల పనుల ప్రాధాన్య క్రమాన్ని సంవత్సరాల వారీగా నిర్దేశించుకుని ప్రణాళికను రూపొందించి అమలుచేయాలని ముఖ్యమంత్రి కోరారు.