సీఎం ప్రకటనతో ఆనందంలో అన్నదాతలు

The Chief Minister has That There Is No Need To Pay Market Fees On The Sale Of Fruits And Vegetables - Sakshi

మార్కెట్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్న సీఎం జగన్‌

లాభం పొందనున్న రైతులు    

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచి రైతులకు అండగా ఉంటామని అనేక పథకాలను ప్రవేశపెట్టారు. తాజాగా రైతుల నుంచి ట్రేడర్స్‌ వసూలు చేస్తున్న మార్కెట్‌  ఫీజు చెల్లించనవసరం లేదని ముఖ్యమంత్రి ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి దాకా రైతుల పండించి తీసుకొచ్చిన వివిధ రకాల పండ్లను, కూరగాయలను కొందరు 4 నుంచి 10 శాతం కమీషన్‌ తీసుకుని విక్రయాలు చేస్తున్నారు. ఇక నుంచి కమీషన్‌ పద్ధతి ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. దీంతో రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు తమకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.    

సాక్షి, నెల్లూరు(సెంట్రల్‌): జిల్లాలో ప్రధాన పంట వరి సాగు. ఆ తరువాత వివిధ రకాల పంటలు ఉన్నాయి. వీటికిగాను పండ్లు, కూరగాయల విక్రయాలపై మార్కెట్‌  ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కాకర, దొండ, బీర, వంగ తదతర కూరగాయల సాగు 17 వేల ఎకరాల్లో, నిమ్మ 42 వేలు, మామిడి 25 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జిల్లాలో వివిధ రకాల కూరగాయలు, పండ్లు కలసి మొత్తం 84 వేల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. ఏటా 65 లక్షల క్వింటాల్‌ కూరగాయలు, పండ్లు క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. వీటికి ఏటా మార్కెట్‌లోని ట్రేడర్స్, కొనుగోలుదారులు మార్కెట్‌ ఫీజు కింద సెస్‌ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ విధంగా ఏడాదికి రూ.కోటి వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ సెస్‌ను జిల్లాలోని 11 మార్కెట్‌ కమిటీలు ఉంటే ఆయా కమీటీలకు చెల్లిస్తారు. అయితే ట్రేడర్స్, కొనుగోలుదారులు చెల్లించే సెస్‌ను రైతుల వద్ద వసూలు చేస్తూ రైతులపై భారం మోపుతున్నారు. ట్రేడర్స్‌ చెల్లించాల్సిన దానికి కూడా రైతులపై భారం మోపడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఈ విషయాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రైతులపై భారం పడకుండా ఉండే విధంగా సెస్‌ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

స్పష్టమైన ఆదేశాలు జారీ
లైసెన్స్‌లు కలిగిన ట్రేడర్స్‌కు కూడా మార్కెట్‌ఫీజు కట్టనవసరం లేదని తెలిపారు. కొనుగోలు దారులు, ట్రేడర్స్‌ వారి లైసెన్స్‌లను రెన్యువల్‌ చేసుకోవాలని సూచించారు. ఈ నామ్‌ ప్లాట్‌ఫారం ద్వారా వలంటరీగా చేయాలనుకునేవారు కూడా లైసెన్స్‌లు పొందాలని పేర్కొన్నారు. కమీషన్‌ ఏజెంట్లు వ్యాపారం చేయాలనుకుంటే ట్రేడర్స్‌గా మారి లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రైతుల వద్ద నుంచి కమీషన్‌ తీసుకునే పద్ధతి పూర్తిగా తొలగనుంది. ఈ నిర్ణయం రైతులు ఎంతగానో ఉపయోగపడుతుంది.  

ఫీజు వసూలు చేయడం లేదు 
జిల్లాలోని 11 మార్కెట్‌ కమిటీ శాఖలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, పండ్లు, కూరగాయలకు, వీటిలో నిమ్మ కూడా వస్తుంది, వీటికి ఎటువంటి మార్కెట్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మార్కెట్‌కమిటీలకు ఆదేశాలు కూడా జారీ చేశాం. ప్రభుత్వం చెప్పిన ప్రకారం అమలు చేస్తాం.
– రావమ్మ, ఏడీఎం, మార్కెట్‌ శాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top