
దండిగా పెండలం దిగుబడి
వ్యాపారులు రాక రైతుల దిగాలు
ఎండిపోతున్న పంట
తీత కూలి కూడా రాదని ఆవేదన
ఎకరాకు రూ.2 లక్షల నష్టం
పెండలం ధర ప్రస్తుతం పూర్తిగా పతనమై, కిలో రూ.4 పలుకుతోంది. దుంపను తవ్వడానికి కిలోకు రూ.3 వరకూ ఖర్చవుతోందని, ప్రస్తుత పరిస్థితిలో దుంప తవ్వితే కూలి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు రూ.2 లక్షల వరకూ నష్టం వస్తోందని చెబుతున్నారు. ధర బాగుంటే ఎకరాకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం వస్తుందని అంటున్నారు.
దేవరపల్లి: భూమి నుంచి తవ్వి తీసే సమయం దాటిపోతున్నా.. కొనే నాథుడు లేక పెండలం దుంపలు చేలల్లోనే ఎండిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత రెండేళ్లూ మార్కెట్లో పెండలం దుంపలకు మంచి గిరాకీ ఉండేది. గణనీయంగా దిగుబడులు వచ్చేవి. మార్కెట్లో గిట్టుబాటు ధర పలికేది. దీంతో రైతులకు నాలుగు డబ్బులు మిగిలేవి. దీంతో చిన్న, సన్నకారు రైతులు ఉన్న కొద్దిపాటి భూములతో పాటు కౌలుకు తీసుకుని ఈ ఏడాది పెండలం సాగు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల, కురుకూరుతో పాటు కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో సుమారు 1,200 ఎకరాల్లో పెండలం సాగు జరుగుతోంది. పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం గ్రామాల్లోని రైతులు సుమారు 30 ఏళ్లుగా పెండలం సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ రెండు గ్రామాల్లోనూ సుమారు 600 ఎకరాల నల్లరేగడి భూముల్లో వాణిజ్య పంటగా పెండలం సాగు జరుగుతోంది.
పల్లంట్ల దుంపకు డిమాండ్
పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లో పండే పెండలం దుంపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడి దుంప మంచి సైజుతో పాటు నాణ్యత ఉంటుంది. 2 నుంచి 5 కిలోల దుంప తయారవుతుంది. కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి పెండలం దుంప కొనుగోలు చేసి, ఒడిశాకు ఎగుమతి చేస్తారు.
ఒడిశాలో పెండలాన్ని వివాహాలకు ఎక్కువగా వినియోగిస్తారని, ప్రతి ఇంటికీ 10 నుంచి 20 కిలోల దుంపలు సారెగా పంచి పెడతారని రైతులు చెప్పారు. ఈ ప్రాంతంలో పండిన ప్రతి కిలో దుంప అక్కడికే వెళ్తుందని తెలిపారు. అయితే, ఈ ఏడాది ఒడిశాలో రైతులు పెండలం సాగు చేయడంతో పాటు అక్కడ వినియోగం తగ్గడం వల్ల డిమాండ్ తగ్గినట్లు సమాచారం.
చేలల్లోనే ఎండిపోతూ..
తీగ జాతి పంట అయిన పెండలం దుంప భూమిలోనే తయారవుతుంది. ఏటా జూన్, జూలై నెలల్లో పెండలం సాగు ఆరంభిస్తూండగా.. జనవరి నుంచి మే నెలాఖరు వరకూ దిగుబడి వస్తుంది. ఒక్కో దుంప 2 నుంచి 5 కిలోల వరకూ బరువుంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది దిగుబడులు బాగున్నాయని, ధర 10 టన్నులకు రూ.40 వేలకు పడిపోయిందని, అయినప్పటికీ అడుగుతున్న నాథుడే లేడని రైతులు వాపోతున్నారు.
దీంతో, దుంప చేలల్లోనే ఎండిపోతోందని ఆవేదన చెందుతున్నారు. ఇటీవలి వర్షాలకు దుంప చివర కుళ్లిపోతోందని, అక్కడక్కడ మొలకలు వస్తున్నాయని, దీనివలన ధర మరింత పతనమవుతుందని చెబుతున్నారు. కుళ్లిన దుంపలను శుభ్రం చేయడానికి దుంపకు రూ.2 ఖర్చవుతుంది. మరో రెండు నెలల్లో కొత్త పంట వేసే సమయం వస్తోంది. ఈ తరుణంలో భూమిలో ఉన్న పంటను చూసి రైతులు దిగులు చెందుతున్నారు.
కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ
పెండలం ధరల పతనంతో కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒక్కో రైతు 5 నుంచి 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పెండలం దుంప సాగు చేశారు. ఎకరా కౌలు రూ.50 వేలు కాగా, పెట్టుబడి మరో రూ.లక్ష వరకూ అయ్యింది. ప్రస్తుత పరిస్థితిలో కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
భూమిలోనే ఉండిపోతోంది
నేను 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పెండలం సాగు చేశాను. కౌలు రూ.5 లక్షలు, పెట్టుబడి రూ.10 లక్షలు అయ్యింది. సాధారణంగా తయారైన దుంపను ఫిబ్రవరి నుంచి మే నెలలోగా భూమి నుంచి తవ్వి, మార్కెట్‌కు పంపాల్సి ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ కిలో దుంప కూడా తీయలేదు.
తయారైన దుంప భూమిలోనే ఉండిపోతోంది. ఇటీవలి వర్షాలకు దుంప కుళ్లిపోయి, మొలకలు వస్తున్నాయి. పరిస్థితి అర్ధం కావడం లేదు. గత రెండేళ్లూ పెండలం ధర లాభదాయకంగా ఉంది. 2023 పంట కాలంలో 10 టన్నుల దుంప రూ.5 లక్షలు పలికింది. గత ఏడాది రూ.45 వేలు పలికినప్పటికీ కొద్దిపాటి లాభంతో ఒడ్డున పడ్డాం. – నూతలపాటి వెంకట రమణ, రైతు, పల్లంట్ల
నిండా మునిగిపోయాం
దుంప ధర దారుణంగా పతనమైంది. గత ఏడాది 10 టన్నుల ధర రూ.45 వేలు ఉండగా, ఈ ఏడాది రూ.40 వేలు పలుకుతోంది. అయినప్పటికీ అమ్ముదామంటే కొనే వారే కనిపించడం లేదు. వ్యాపారులు రావడం లేదు. ఎక్కడి దుంపలు అక్కడే భూమిలో ఉండిపోయాయి. రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. నేను 4 ఎకరాల్లో పెండలం సాగు చేశాను. ఇప్పటి వరకూ కేజీ దుంప కూడా బోణీ కాలేదు. పెండలం రైతు నిండా మునిగిపోయాడు. – కూచిపూడి గంగాధర్, రైతు, పల్లంట్ల