యముడిని తరిమికొట్టిన సంజీవుడు..

Chief Minister Dr YS Rajasekhara Reddy, Who has Done Very Well in Corporate Hospitals For The Poor. - Sakshi

సాక్షి, జగన్నాథపురం (కాకినాడ రూరల్‌): ‘ఆ మారాజు చనిపోయి ఎక్కడున్నారో కానీ.. నాకు మళ్లీ ప్రాణం పోశారు. నాకొచ్చిన పాడుజబ్బుతో బతుకుతాననుకోలేదు. నాలాంటి కడుపేదకు కూడా ఎంతో ఉన్నతమైన చికిత్సను కార్పొరేట్‌ ఆస్పటల్లో చేయించిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి. ఈ జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నాను అనుకుంటే అది ఒకేఒక్కరికి.. మనసున్న మారాజు మా రాజన్నకే’..
హృదయం పట్టని కృతజ్ఞత.. కన్నుల కరకట్టలు దాటి అశ్రువుల రూపంలో ధారలు కడుతుండగా ఈ మాటలు చెప్పే వారెందరో. సమాజగమనానికి ఇంధనం వంటి శ్రామికుల స్వేదానికి ఖరీదు కట్టే షరాబు ఎవరని మహాకవి ప్రశ్నించాడు. ప్రాణావసాన స్థితిలో ఉన్న వేళ కబళించ వస్తున్న కాలయముడిని ఆరోగ్యశ్రీ పథకం అనే సంజీవినిని కొరడాలా ఝుళిపించి,  తోక ముడిచేలా చేయడం ద్వారా ఈ జన్మలోనే పునర్జీవితాన్ని పొందిన వారి కృతజ్ఞతను లెక్క కట్టగలవారెవ్వరు?  ఆ మహానేత దివంగతుడై దశాబ్దం కావస్తున్నా.. ఆ పేరు వినగానే ఎన్ని కుటుంబాలకో ఓ దేవుడి పేరు వీనుల పడ్డట్టుంటుంది. 

అలాంటి కుటుంబాల్లో ఒకటి కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని తూరంగి గ్రామం సత్యదుర్గా నగర్‌లో నివాసం ఉంటున్న కొక్కిరిగెడ్డ తాతారావు కుటుంబం. వారిది రెక్కాడితేగానీ, డొక్కాడని బతుకు. తాతారావు భార్య దుర్గాలక్ష్మికి గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడ్డాయి. విపరీతమైన ఛాతీనొప్పి. ఊపిరి తీసుకోలేని పరిస్థితి. డాక్టర్లు ఆపరేషన్‌ తప్పదన్నారు. వారి 16 ఏళ్ల కూతురు సత్యకుమారికి గుండె జబ్బు. విపరీతమైన ఆయాసం వచ్చేది. డాక్టర్లు గుండెకు బెలూన్‌ సర్జరీ పడుతుందని చెప్పారు.

ఇద్దరి ఆపరేషన్‌లకు లక్షల్లో ఖర్చవుతుంది. తాతారావుకి దిక్కుతోచలేదు. భార్యాబిడ్డల్ని దక్కించుకోవడమెలాగో తెలియక, ఆ ఆవేదనతో ఎన్నో నిద్రపట్టని రాత్రిళ్లు గడిపాడు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందామనుకున్న రోజులు కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితుల ప్రభావం ఎటువంటిదో. 2008లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ గురించి తెలుసుకుని, విశాఖపట్నంలోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఇద్దరికీ ఆపరేషన్‌లు చేయించాడు. ఆ పథకం పుణ్యమా అని ఇంటి దీపాన్నీ, కంటి పాపనూ.. ఇద్దర్నీ రక్షించుకోగలిగాడు.

పథకాన్ని నీరుగార్చిన ‘బాబు’ సర్కారు
ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ స్ఫూర్తితో ఎంతోమంది ముఖ్యమంత్రులు వారి రాష్ట్రాలలో కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారు. కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీరే వేరు. ఆరోగ్యశ్రీ పథకం జాబితా నుంచి ఒక్కో జబ్బునీ తొలగిస్తూ, ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించక పథకాన్ని నీరుగార్చారని ప్రజలు దుయ్యబడుతున్నారు. జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలవాలని, దివంగత నేత రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలని, ఆరోగ్యశ్రీకి మరలా జవసత్వాలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

నా దేవుడు వైఎస్సారే..
గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్‌ తప్పనిసరి అన్నారు. విపరీతమైన ఛాతీనొప్పి వచ్చేది. ఊపిరి ఆడేదికాదు. 2008లో ఆరోగ్యశ్రీ పథకంద్వారా ఆపరేషన్‌ చేయించుకున్నాను. వైఎస్సార్‌  ఇటువంటి పథకం పెట్టుండకపోతే నేను బతికుండేదాన్నికాదు. నా దేవుడు వైఎస్సారే.
– కొక్కిరిగెడ్డ దుర్గాలక్ష్మి, సత్యదుర్గానగర్, తూరంగి 
 

దేవుడి మందిరంలో వైఎస్సార్‌ పటం 
16 ఏళ్ల వయస్సులో ఛాతీలో నొప్పి వస్తోందని డాక్టర్‌ దగ్గరకు వెళితే గుండెజబ్బన్నారు. బెలూన్‌ సర్జరీ పడుతుందన్నారు. లక్షల్లో ఖర్చు. కూలి పని చేసి కుటుంబాన్ని పోషించే నాన్న ఆపరేషన్‌ చేయించలేని పరిస్థితి. 2008లో నేను కూడా అమ్మలాగే ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్‌ చేయించుకున్నాను. తర్వాత పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. ఆరోగ్యంగా ఉన్నాను. మా ఇంట్లో దేవుడి మందిరంలో రాజశేఖరరెడ్డిగారి పటం పెట్టుకున్నాము. 
–ఓలేటి సత్యకుమారి, సత్యదుర్గానగర్, తూరంగి 

ఈ సంతోషం వైఎస్సార్‌ చలవే..
నా ఆరోగ్యమే అంతంత మాత్రం. 2008లో నా భార్యకు, నాకూతురికీ ఆరోగ్యం బాగోకపోవటంతో దిక్కుతోచలేదు. ఇద్దరి మీదా ఆశ వదిలేసుకున్నాను. నిరాశానిçస్పృహæలతో ఉన్న అలాంటి సమయంలో అదృష్టం కొద్దీ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించటంతో ఇద్దరికీ ఒక్క పైసా ఖర్చులేకుండా ఆపరేషన్‌లు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో జరిగాయి. వాళ్ల ప్రాణాలు నిలిచి, మా కుటుంబం సంతోషంగా ఉందంటే.. అంతా వైఎస్సార్‌ చలవే.
–కొక్కిరిగెడ్డ తాతారావు, సత్యదుర్గానగర్, తూరంగి.

ప్రాణం నిలిపిన పథకం 
2009లో గుండెనొప్పి రావడంతో హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే.. ఆపరేషన్‌ చేయాలని, రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంతంత మాత్రం సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్న నాకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో బతుకు మీద ఆశ వదులుకున్నాను. అయితే అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్‌ చేశారు. మహానేత పథకం నాకు పునర్జన్మ ఇచ్చిందని నేడు కూడా కృతజ్ఞతతో చెబుతాను.
 –పురాలశెట్టి సూర్యనారాయణ, శబరిఒడ్డు, చింతూరు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top