ఆంధ్రప్రదేశ్ అన్నాహజారేను నేనే.. అని గొప్పలు చెప్పుకొనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు సీఎం జయలలిత లాగా జైలుకెళ్లక తప్పదని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు.
కడప: ఆంధ్రప్రదేశ్ అన్నాహజారేను నేనే.. అని గొప్పలు చెప్పుకొనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు సీఎం జయలలిత లాగా జైలుకెళ్లక తప్పదని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌జిల్లా కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆదివారం నగర మేయర్ కె. సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే పి. ర వీంద్రనాథ్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణాలో నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో చంద్రబాబు ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సమగ్రవిచారణ జరిపితే ఆయన ఎంత అవినీతి పరుడో త్వరలోనే బయటపడుతుందని చెప్పారు.
కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిచ్చిపట్టిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఆయన ఏమీ చేయకపోయినా చేసినట్లు చెప్పుకొంటున్నారని, ఇది కూడా ఒక రక మైన వ్యాధేనన్నారు. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నచందంగా రూపాయి ఖర్చుపెట్టకపోయినా కడప ఎయిర్‌పోర్టు నిర్మాణం తమ ఘనతేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నేను మారిన మనిషిని అని పదేపదే చెబితే ప్రజలు చంద్రబాబుకు ఓట్లు వేశారని, ఈ ఏడాది పాలనతో ఆయన ఏమీ మారలేదని ప్రజలు గ్రహించారన్నారు.