హుదూద్ తుపాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
హైదరాబాద్: హుదూద్ తుపాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. తుపాన్ ప్రభావం, సహాయక చర్యల గురించి సచివాలయంలో చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
అధికార యంత్రాగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల నష్టాన్ని భారీగా తగ్గించగలిగామని చంద్రబాబు చెప్పారు. తుపాన్ కారణంగా వరి పొలాలు దెబ్బతిన్నాయని, ముగ్గురు మరణించారని వెల్లడించారు. తుపాన్ బాధిత ప్రాంతాల్లో ప్రజలు మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సమాచారం అందిస్తే సహాయక చర్యలు చేపడతామని చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నంలో ముందు జాగ్రత్తగా కరెంట్ సరఫరా ఆపివేశారని చెప్పారు. మొబైల్ సర్వీసులు పనిచేయడం లేదని, అధికారులతో మాట్లాడి పునరుద్ధరిస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబుకు ఫోన్ చేసి తుపాన్ తీవ్రత గురించి తెలుసుకున్నారు. అవసరమైన సాయం చేస్తామని మోడీ చెప్పారు.