కాల్ లెటర్ మరీ లేటు | Call Letter too letu | Sakshi
Sakshi News home page

కాల్ లెటర్ మరీ లేటు

Sep 21 2014 2:23 AM | Updated on Sep 2 2017 1:41 PM

విశాఖ ఏజెన్సీ 11 మండలాల పరిధిలో నిరుద్యోగ సమస్య అధికమైంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చదువుకున్న గిరిజన అభ్యర్థులు పాడేరులోని ఉప ఉపాధి కల్పన కార్యాలయంలో...

  • ఏజెన్సీని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్య
  •  ఉపాధి చూపని ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్
  •  ఏళ్ల తరబడి గిరిజన అభ్యర్థుల ఎదురుతెన్నులు
  •  కూలి పనులను ఆశ్రయిస్తున్న ఉన్నత విద్యావంతులు
  • పాడేరు : విశాఖ ఏజెన్సీ 11 మండలాల పరిధిలో నిరుద్యోగ సమస్య అధికమైంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చదువుకున్న గిరిజన అభ్యర్థులు పాడేరులోని ఉప ఉపాధి కల్పన కార్యాలయంలో నమోదు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా ఏ చిన్నపాటి ఉద్యోగానికీ పిలుపు రాకపోవడంతో ఉసూరుమంటున్నారు. ఏదో ఒక ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో ఉన్నత విద్య అభ్యసించిన వారు కూడా గ్రామాలకే పరిమితమవుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని వీరు కూలి పనులకు వెళుతున్న దుస్థితి చదివించిన తల్లితండ్రులను బాధిస్తోంది.

    ప్రభుత్వం ప్రతి ఏటా ఉపాధ్యాయ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తుండగా ఎంప్లాయిమెంట్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో బి.ఎడ్, డి.ఎడ్, తెలుగు, హిందీ పండిట్ అభ్యర్థులు ఏళ్ల తరబడి నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఇటీవల భర్తీ చేసిన పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు కూడా సీనియార్టీని పరిగణనలోకి తీసుకోలేదు. పారామెడికల్, జనరల్ నర్సింగ్ పోస్టులు కూడా భర్తీ చేయలేదు. డ్రైవరు పోస్టులకు అర్హత ఉన్నవారు వందల సంఖ్యలో ఉన్నా అవకాశాలు లేవు.

    ఏజెన్సీలో కనీసం బ్యాక్‌లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. పాడేరు డివిజన్‌లోని 11 మండలాలకు సంబంధించి 42 వేల 393 మంది అభ్యర్థులు స్థానిక ఉప ఉపాధి కల్పనా కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. వీరిలో పురుష అభ్యర్థులు 27,837 మంది, మహిళా అభ్యర్థులు 14,556 మంది ఉన్నారు. టెక్నికల్ విభాగంలో 7వేల 322 మంది నమోదు చేసుకున్నారు. మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకుంటున్నా కాల్ లెటర్ రానివారు వేల సంఖ్యలో ఉన్నారు.
     
    నిరుద్యోగ సమస్య ఏజెన్సీని పట్టి పీడిస్తున్నా పాలకులు, అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదు. ఒకప్పుడు పదోతరగతి చదివితే ప్రభుత్వ ఉద్యోగం పొందే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పట్టభద్రులకు కూడా అటెండరు ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. సాంకేతిక విద్యను అభ్యసించినవారు కూడా ఉపాధి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
     
    కాల్ లెటర్లు వెళ్లేది బాగా తక్కువ

    కిందటేడాది హెచ్‌పీసీఎల్‌లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కోసం ఒక డిగ్రీ అభ్యర్థికి, కోరుకొండ సైనిక స్కూలులో టీచరు ఉద్యోగం నిమిత్తం ఒక బి.ఎడ్ అభ్యర్థికి కాల్ లెటర్లు పంపారు. అప్పటి నుంచి మళ్లీ ఉన్నత విద్యావంతులకు కాల్‌లెటర్లు పంపలేదు. గతనెలలో విశాఖ స్టీల్‌ప్లాంట్, నావల్ డాక్ యార్డులో కూలిపనుల నిమిత్తం 140 మందికి కాల్ లెటర్లు పంపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement