గ్రామ స్వరాజ్యం దిశగా వైఎస్‌ జగన్‌ పాలన: బుగ్గన

Buggana Rajendranath Comments Over Grama Sachivalayam Posts In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : నూతన సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన ఉద్యోగులకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభినందనలు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు జిల్లా నుంచి ఎంపికైన అభ్యర్థులకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, జిల్లా ఎమ్మెల్యేలు నియామక పత్రాలను అందజేశారు. జిల్లా పరిషత్‌ కార్యలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగుల నియామకాల్లో కర్నూలు జిల్లా నంబర్ వన్‌గా నిలిచిందని, విధుల నిర్వహణలో కూడా నంబర్ వన్‌గా నిలవాలని సూచించారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య పాలన దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెచ్చారని కొనియాడారు. ఈ వ్యవస్థను అక్టోబర్ 2 నుండి ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 1.27 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు.

రాష్టంలో 1.27 లక్షల ఉద్యోగాలకు 20 లక్షలమంది పరీక్షలు రాశారని, లక్షమంది ఉద్యోగాల్లో చేరబోతున్నారని మంత్రి అన్నారు. కర్నూలు జిల్లాలో 9597 ఉద్యోగాలకు సోమవారం 5492 మందికి నియామక పత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రజల ఆదరణతో సీఎం అయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం నవరత్నాలు పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాలు, వార్డుల్లో లక్షల్లో ఉద్యోగాలు నిజాయితీగా, అవినీతి రహితంగా కల్పించారని ప్రశంసించారు.  రైతన్నల భూ సమస్యలను తీర్చడానికి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామని గుర్తు చేశారు. ఒక సెంటు భూమి కూడా తేడా రాకుండా సీఎం జగన్‌ చర్యలు చేపట్టారని తెలిపారు. 60 సంవత్సరాలు ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం అందరూ వద్దు అనుకున్నా పునర్విభజన జరిగిందని, ఐటీ, సేవారంగం ఆదాయం అంతా తెలంగాణ రాష్ట్రానికి పోయిందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిందని, జీడీపీలో అతి తక్కువ ఉంది తమదేనని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో ఇంటింటికీ ఉద్యోగమని.. బాబు వస్తే జాబు అన్న చంద్రబాబు పరిశ్రమల్లో, ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. రాష్ట్రం విడిపోయిన అనంతరం తమది జనాభా ఎక్కువ ఉండి, ఆదాయం తక్కువ ఉన్న రాష్టంగా మిగిలిపోయిందని అన్నారు. జనాభా 58 శాతం ఉంటే ఆదాయం 44 శాతం ఉందన్నారు. తెలంగాణకు తక్కువ జనాభా, ఎక్కువ ఆదాయం పోయిందని, గత ప్రభుత్వం తప్పిదాల కారణంగా తమకు అప్పులు మిగిలాయిని దుయ్యబట్టారు. గత పాలకుల నిర్వాకం వల్లే నేడు రాష్ట్రంలో కరెంటు సమస్యలు ఎదురవుతున్నాయని, త్వరలోనే ఈ సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పాలకులు అప్పులు చేసి, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెండింగ్ పెట్టి పోయారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top