విజృంభిస్తున్న ఆంత్రాక్స్‌    

Booming Anthrax - Sakshi

డుంబ్రిగుడ మండలంలో నలుగురికి సోకిన వ్యాధి

పోతంగిలో ఐదు రోజుల క్రితం ఇద్దరికి

తాజాగా కండ్రుంలో ఇద్దరికి సోకిన వ్యాధి

భయాందోళన చెందుతున్న గిరిజనులు

 డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలో  ఆంత్రాక్స్‌ మళ్లీ విజృంభిస్తోంది. ఐదు రోజుల క్రితం పోతంగి గ్రామంలో ఇద్దరికి ఈ వ్యాధి సోకగా, తాజాగా  ఆ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల పంచాయతీ కండ్రుం గ్రామంలో  ఇద్దరు గిరిజనులకు సోకింది.

కండ్రుం గ్రామానికి చెందిన వంతల సన్యాసి,వంతల అర్జున్‌ అనే గిరిజనులు ఈవ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. వ్యాధి గ్రస్తులు వారిని అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన మేక మాంసాన్ని వారం రోజుల క్రితం వీరు తిన్నారని, అందువల్లే ఈ వ్యాధి ప్రబలినట్టు గ్రామస్తులు తెలిపారు.'

ఇదే గ్రామంలో  2016   ఏప్రిల్‌లో  ఆంత్రాక్స్‌ వ్యాపించింది.  ఈ ఏడాది  కూడా ఏప్రిల్‌ నెలలో ఆంత్రాక్స్‌ వ్యాధి రావడంపై గిరిజనులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

అవగాహన కల్పించాలి

ఆంత్రాక్స్‌ వ్యాధి పట్ల గిరిజనులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అవగాహన కల్పించాలని గిరిజన సంఘం నేతలు కోరుతున్నారు. అవగాహన లేకపోవడం వల్ల మృతి చెందిన పశువుల మాంసం తిని వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రతి ఏడాది  ఆంత్రాక్స్‌ వ్యాధి ప్రబలుతున్నా  నిరోధించేందుకు  ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు.   

అప్రమత్తంగా ఉండాలి

ఆంత్రాక్స్‌  పట్ల గిరిజనులు అప్రమతంగా ఉండాలని పాడేరు ఏడీఎంహెచ్‌వో పార్థసారధి సూచించారు. మంగళవారం ఆయన పోతంగి గ్రామాన్ని సందర్శించారు.  ఆంత్రాక్స్‌ వ్యాధి సోకడానికి గల కారణాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   మృతి చెందిన పశువుల మాంసాన్ని తినరాదని తెలిపారు. దీనిపై గిరిజనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిం చాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమ వైద్యులు కళ్యాణ్‌ ప్రసాద్, స్థానికులు  శాంతికిరణ్, సింధరాంపడాల్‌ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top