‘గోదావరి’లో బాంబు కలకలం | Sakshi
Sakshi News home page

‘గోదావరి’లో బాంబు కలకలం

Published Sun, Mar 2 2014 2:13 AM

Bomb scare delays Vizag-Hyderabad Godavari Express

సామర్లకోట, న్యూస్‌లైన్ :  గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందన్న వదంతులతో సామర్లకోటలో ఆ రైలును శనివారం రాత్రి నిలిపివేశారు. రాత్రి 8.20 గంటల నుంచి 9.40 వరకు పోలీసులు రైలులో గాలించారు. బాంబు బెదిరింపు ఉట్టిదేనని తేలాక రైలు కదిలింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్‌ప్రైస్‌లో బాంబు ఉందని హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి ఫోన్ ద్వారా సమాచారం వచ్చిన్నట్టు పెద్దాపురం డీఎస్పీ అరవింద్‌బాబు తెలిపారు. రైలు తుని దాటిన తరువాత రాత్రి 7.45 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. 
 
 బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ప్రతి బోగీలోనూ గాలించాయి. ఎస్ 3 బోగీలోని 52వ నంబర్ బెర్త్‌లో అనుమానాస్పదంగా ఓ సూట్‌కేసు ఉండడంతో దానిని తెరచి చూశారు. లోపల ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎస్-1 బోగీ దిగువ భాగంలో అనుమానంగా ఉన్న వైరు కట్టను స్వాధీనం చేసుకున్నారు. సామర్లకోటలో రైలును నిలిపి వేసి ప్రయాణికులు అందరూ మూడో నంబరు ప్లాట్ ఫామ్ నుంచి ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌కు తరలివెళ్లాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 24 బోగీల్లోని ప్రయాణికులు దిగి అక్కడకు చేరుకున్నారు. రైల్వే స్టేషన్ మేనేజరు సీహెచ్ సుబ్రహ్మణ్యం, రైల్వే జీఆర్పీ సీఐ బి.రాజు, ఆర్పీఎఫ్ ఎస్సై రవిశంకర్ సింగ్, జీఆర్పీ ఎస్సై గోవిందరెడ్డి, పెద్దాపురం సీఐ కె. నాగేశ్వరరావు, ఎస్సైలు ఎండీఎంఆర్ ఆలీఖాన్, నాగార్జున, రమణ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ప్రయాణికులు అందరూ రైలు ఎక్కిన తరువాత రాత్రి 9.50 గంటలకు రైలు బయలుదేరింది.
 

Advertisement
Advertisement