పగ్గాలెవరికో? | bharthiya janatha party | Sakshi
Sakshi News home page

పగ్గాలెవరికో?

Feb 18 2015 1:27 AM | Updated on Mar 22 2019 6:24 PM

నిన్నటివరకు నిస్తేజంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో ఇప్పుడు ఉత్సాహం కనిపిస్తోంది.

 నిన్నటివరకు నిస్తేజంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో ఇప్పుడు ఉత్సాహం కనిపిస్తోంది. ఆ పార్టీ కేంద్రంలో అధికారపగ్గాలు చేపట్టడం, రాష్ట్రంలోనూ అధికారం పంచుకున్న నేపధ్యంలో ఆ పార్టీ నేతల్లో ఉత్తేజం కనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే త్వరలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవీకాలం ముగియనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కమలం పీఠానికి పోటీ నెలకొంది. అధిష్ఠానం ఆశీస్సులు తమకే ఉన్నాయని పలువురు నాయకులు భరోసా వ్యక్తం చేస్తున్నారు.
 
 కడప రూరల్: భారతీయ జనతా పార్టీ జిల్లాలో మొన్నటి వరకు నిస్తేజంగా ఉండేది. బలమైన, ప్రజాధరణ కలిగిన నాయకులను, కార్యకర్తలను ఆకర్షించలేక ఓటింగ్ శాతాన్ని పెంచుకోలేకపోయేది. ఇలాంటి తరుణంలో నరేంద్రమోదీ హవాతో కేంద్రంలో పగ్గాలను చేపట్టడంతో జిల్లాలో కూడా ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ తరుణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శశిభూషణ్‌రెడ్డి పదవీకాలం మార్చితో ముగియనుంది.
 
 ఈ తరుణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష స్థానానికి నేనున్నానంటూ పలువురు పోటీ పడుతున్నారు. దీంతో పార్టీలో అంతర్గత చర్చ మొదలైంది. తాము మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామని, సీనియర్లం తామేనని ఒకరు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది తామేనని మరొకరు, గతంలో జిల్లా అధ్యక్ష పీఠానికి తనకు రెండుసార్లు అవకాశం వచ్చినా వద్దని చెప్పాను... ఇప్పుడు రెడీగా ఉన్నానని మరొకరు ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు.
 
 అధ్యక్ష స్థానానికి పలువురు పోటీ
 బీజేపీలో ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. అనంతరం మండలాలకు కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. తర్వాత జిల్లా అధ్యక్షుని ఎన్నిక, అనుబంధ శాఖల నియామకం జరగాలి. అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న వారిలో రాజంపేట ప్రాంతానికి చెందిన బీసీ వర్గం నేత ఒకరు, ప్రొద్దుటూరులో ఒకరు, మైదుకూరులో ఒకరు, కడపలో ఓసీ వర్గానికి చెందిన ఇద్దరు,  ఓ విద్యాసంస్థ అధినేత తనయుడు బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇతనికి పార్టీ సభ్యత్వమే లేదని, అతనికి అంతటి కీలకపదవి ఎలా ఇస్తారనే వాదన ఉంది.  
 
 కొత్తగా పార్టీలో చేరిన వారు కూడా...
 ఇన్నాళ్లు బీజేపీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. కేంద్రంలో ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడంతో పలువురు పార్టీలో చేరారు.  కొత్తవారి రాకతో సంప్రదాయాలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు నాయకులు, కార్యకర్తల్లో నెలకొంది. ఎన్నో సవత్సరాలుగా కమలం జెండాను మోసిన కార్యకర్తలను ఏనాడూ పట్టించుకోని అధిష్ఠానం కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేస్తుండడంపై కార్యకర్తల్లో  అసంతృప్తి నెలకొంది. పార్టీలో కొత్తగా చేరిన వారు కూడా జిల్లా అధ్యక్ష పీఠాన్నిదక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తుండడంపై విమర్శలు ఉన్నాయి.
 
 కీలకంగా కేంద్ర నాయకుడు
 నిన్నటివరకు ఆ పార్టీ జాతీయ నాయకుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి సమ్మతితోనే జిల్లాలో అధ్యక్షుని నియమాకం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం తెరపైకి ఆ పార్టీ జాతీయ నాయకుడు ఒకరు, మరో ప్రముఖ నాయకుడు వచ్చినా ప్రస్తుత కేంద్రమంత్రి సూచనల మేరకే జిల్లా అధ్యక్ష నియామకం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర కోర్ కమిటీలో నిర్ణయం ఉంటుందని, దానికి జిల్లా నుంచి 11 మంది హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అయితే కోర్ కమిటీలో నిర్ణయం ఎలాగున్నా అధిష్ఠానం సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడి నియామకం ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement